Sunday, December 22, 2024

తండ్రి ఆనతిని రాముడికి తెలియజేసిన కైక!

రామాయణమ్25

కైక ముఖంలో కాఠిన్యం ప్రతిఫలిస్తుండగా ఆమె రామునితో,

‘‘రామా! నీకు ఒక విషయం చెప్పాలి ! అది చెప్పుటకు నీ తండ్రికి నోరు రావడంలేదు. అందుకే ఆయన అలా ఉన్నాడు.  అంతేగానీ ఏవిధమైన ఆపద సంభవించలేదాయనకు. అది నీకు అప్రియము కావచ్చును కానీ అది ఆయన ప్రతిజ్ఞా పాలనమునకు సంబంధించినది. ఆయన ఇచ్చిన మాట చెల్లించే సమయం నేడు ఆసన్నమయినది.

‘‘నీతండ్రి పూర్వము నాకు ఒక వరము ఇచ్చి వున్నాడు. ఆ వరము నాకిచ్చినందుకు సామాన్యమానవుడిలాగ విలపిస్తున్నాడు నేడు. అదేదో పాప కార్యమన్నట్లుగా భావిస్తున్నాడు.పశ్చాత్తాపం చెందుతున్నాడు. సత్యము వచించుట, ఇచ్చినమాట నిలబెట్టుకొనుట సత్పురుషుల లక్షణము. నీ తండ్రి మాట చెల్లించగలనని నీవు మాట ఇచ్చినచో ఆయన నా కిచ్చిన వరము గురించి నీకు తెలిచేయగలను. ఈయన స్వయముగా నీకది చెప్పలేడు.’’

Also read: కృద్ధుడైన తండ్రిని చూసి వేదన చెందిన రాముడు

ఆవిధంగా మాట్లాడుతున్న పినతల్లిని చూసి మనస్సులో బాధపడుతూ…‘‘ఛీ ఎంత కష్టము తల్లీ! నా విషయములో నీవు ఇటుల మాటలాడవలదు!  నా తండ్రి ఆజ్ఞాపించినచో అగ్నిలో దూకెదను. ఆయన కాలకూట విషమిచ్చి త్రాగు రామా! అన్నచో అది అమృతమువలే సేవించగలను. తల్లీ నీ మనసు నెరిగింపుము! రాముని వద్ద రెండు మాటలు లేవు  ..

రామో ద్విర్నభిభాషతే!

(ఇప్పుడొక మాట తరువాత ఒక మాట లేవు !ఎప్పుడూ ఒకటే మాట !)….ఒకటే మాట!’’

‘‘రామా! నీ తండ్రి పూర్వము నాకిచ్చిన వరములను నేడు అమలు పరచమంటున్నాను. దాని ప్రకారము …భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెను…నేడే నీవు జటావల్కలధారియై దండకారణ్యములో పదునాల్గువత్సరములు నివసింపవలే! తండ్రి ఆజ్ఞ పాలింపుము.. నీ కొరకై ఏర్పరచిన అభిషేక సామాగ్రితో భరతునికి పట్టముగట్టవలే.’’

మరణశాసనము వంటి ఆ పలుకులు రాముని ఏ మాత్రమూ బాధించలేదు! ప్రశాంతత చెడలేదు! వ్యధ దరిచేర లేదు.

‘‘అమ్మా! నీవు చెప్పినట్లే జరుగుతుంది’’ అని చాలా ప్రశాంతంగా పలికాడు రామచంద్రుడు.

‘‘అమ్మా! నా తండ్రి మాటలు యుక్తమా లేక అయుక్తమా అని నేను విచారణ చేయను. ఆయన కోరిక ప్రకారము పదునాలుగేండ్లు వనవాసమునకు ఈ క్షణమే బయలు దేరగలను. ఒక్కవిషయము మాత్రము నా హృదయమును దహించి వేయుచున్నదమ్మా! నా తండ్రిగారే నాకు స్వయముగా చెప్పకున్నారేమి? అయినా, రాజ్యాభిషేకమునకు భరతుడికి అభిలాష ఉన్నదని నాకు తెలియదు. తెలిసియున్న ఎడల నా సర్వస్వము అతనికి ధారపోసి యుండెడి వాడను.’’

Also read: కైక కోరిన రెండు వరాలు: భరతుడి పట్టాభిషేకం, రాముడి అరణ్యవాసం

రాముడి ఈ పలుకులు దశరధమహారాజు యొక్క గాయమయిన హృదయాన్ని కెలికినట్లుగా ఉన్నాయి. ముదుసలి మహారాజు తట్టుకోలేక పోతున్నాడు. ఆయన కళ్ళనుండి ధారాపాతంగా కన్నీరు కారుతున్నది. వంచిన తల ఎత్తలేక, సూటిగా రాముని చూడలేక సతమతమవుతూ యమయాతన అనుభవిస్తున్నాడు.

ఇటు కైక సంతోషము పట్టనలవిగాకుండా ఉన్నది.  ‘‘రామా! నేను చెపితే రాజు చెప్పినట్లేగదా! ఎవరు చెప్పారన్నది అంత ప్రధానముకాదు! ఇది రాజుగారి అభిమతము. ఇంక నీవు ఆలస్యము చేయక వెంటనే బయలుదేరవలెను’’ అని అంటూ తొందరపెట్టసాగింది. నీవు ఈ పట్టణము విడిచి వెళ్ళనంతవరకు నీ తండ్రి స్నానము, భోజనము చేయరు!

Also read: కోపగృహంలో కైక, ప్రాధేయపడుతున్న దశరథుడు

ఈ మాటలు వింటున్న దశరథుడు దీర్ఘముగా నిట్టూర్చి ‘‘ఛీ! ఎంత కష్టము వచ్చినది’’ అని తనలో తనే అనుకుంటూ కూర్చున్న మంచముమీద కూర్చున్నట్లే ఒరిగిపోయాడు. స్పృహతప్పిపోయాడు.

రాముడు తండ్రిని లేవదీసి మరల కూర్చుండపెట్టబోయాడు. కానీ  మరలమరల కొరడాతో గుర్రాన్ని కొట్టినట్లుగా కైక ప్రేరేపించటం మొదలు పెట్టింది! ఆవిడ తొందరను గమనించిన రాముడు…

‘‘అమ్మా! నాకు ధనము ప్రధానము కాదు. ఋషులవలే నాకు కూడా ధర్మమే ప్రధానము తల్లీ! నీవింతగా నన్ను తొందర పెట్టవలసిన పనిలేదమ్మా! నా తండ్రికొరకు ఇప్పటికిప్పుడు నా ప్రాణములనయినా ధారపోయగలనమ్మా!’’ అని అన్నాడు.

Also read: కైక మనసు నిండా విషం నింపిన మంథర

తండ్రి ఆజ్ఞను పాటించుటకు మించి ధర్మాచరణము లేదమ్మా నాకు. నా జీవితములో అర్ధమునకు, సంపదలకు ప్రధానములేదమ్మా!  ధర్మమే నా జీవన హేతువు! అమ్మా! నీకు నా మీద అధికారమున్నదమ్మా! భరతునికి రాజ్యమిమ్మని నీవే నాతో చెప్పవచ్చుగదమ్మా! తండ్రిగారి ద్వారా ఎందులకు? నీకు నా గుణములమీద ఇప్పటికీ నమ్మకములేదని తెలుస్తున్నదమ్మా! అమ్మా! మాఅమ్మ కౌసల్యకు, సీతకు చెప్పి తక్షణమే పయనమై పోగలవాడను’’ అని పలికి తండ్రికి, పినతల్లికి నమస్కరించి అచటనుండి నిష్క్రమించాడా ధర్మస్వరూపుడు!

Also read: మంథర రంగ ప్రవేశం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles