రామాయణమ్ – 22
‘‘మంధరా! రాముని పట్టాభిషేకము తప్పించే ఉపాయం ఆలోచించవే! వాడిని ఎలాగైనా సరే అడవులకు పంపాలి!’’ అడిగింది కైక .
‘‘పూర్వము నీవే నాకు ఒక విషయము చెప్పావు గుర్తులేదా! అయితే చెపుతా విను. మహారాజు శంబరాసురునితో యుద్ధానికి వెళ్ళి నప్పుడు నీవు కూడా ఆయన వెంట వెళ్ళావు. ఆ యుద్ధంలో ఒకసారి గాయాలబారిన పడి స్పృహకోల్పోయిన దశరథుడిని రాక్షసులబారినుండి నేర్పుగా నీవు తప్పించావు. అందుకు మహారాజు సంతోషించి నీకు రెండు వరాలిచ్చాడు. నీవు అవసరమయినప్పుడు ఆ వరాలు కోరుకుంటానన్నావు అందుకు రాజు సరే నన్నాడు. గుర్తుకు వచ్చిందా?’’
Also read: కైక మనసు నిండా విషం నింపిన మంథర
‘‘ఇదే సరయిన సమయం ఆ రెండు వరాలు ఇప్పుడు కోరుకో. నీ కొడుకు భరతుడికి రాజ్యపట్టాభిషేకము, రామునికి పదునాలుగేండ్లు అరణ్యవాసము.
పదునాలుగేండ్లు భరతుడు పరిపాలించెనా! జనం మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతాడు. రాజ్యాధికారమూ స్థిరమవుతుంది అని చెప్పి నీవు నిరాలంకారవై, మలినవస్త్రాలు ధరించు. నీ మగడు వచ్చే వేళ అయింది. ఆయనతో మాటాడకు. మొదట బెట్టు చేయి’’ అని నూరిపోసింది మంధర.
ఇలా పలికిన మంధర కైక కంటికి మనోహరంగా కనపడ్డది. ‘‘రాజహంసలాగ ఉన్నావే నీవు’’ అంటూ ప్రశంసించింది.
‘‘నీ గూని కూడా ఎంత అందంగా ఉన్నదే. దానికి బంగరుమాల తొడిగి అలంకరిస్తాను భరతుడు రాజు కాగానే!’’
‘‘ఈ మాటలు, వరాలమూటలు తరువాత. ముందు కాగల కార్యం చూడమ్మా కైకమ్మా! రాజు వచ్చే వేళ అయ్యింది,’’ అని హెచ్చరించింది దాసి మంధర.
Also read: మంథర రంగ ప్రవేశం
వంటికున్న అన్ని ఆభరణాలు తొలగించి, మాసిన చీర ధరించి మంధరతో కలసి కోపగృహప్రవేశం చేసింది కైక.
కైకను చూడకుండా దశరథుడు ఉండలేడు.
కౌసల్యాదేవి మందిరానికి ఎప్పుడోగాని పోడు.
ఆమె ఆయనకు కామసంజీవనౌషధి. ఆమె పెడమొగమయితే ఆయనకు నరకమే. రాముని పట్టాభిషేక వార్త ఆవిడకింకా చెప్పలేదు. తనకు చెప్పనందుకు ఎంతకోపంతో ఉన్నదో ఏమో! వెంటనే చెప్పి ఆవిడను ప్రసన్నురాలిని చేసుకోవాలి.
కసిరికొడితే బుజ్జగించాలి. కోపగిస్తే లాలించాలి ఏ విధంగానైనా ఆవిడను ప్రసన్నురాలిని చేసుకోవాలి అని ఆలోచిస్తూ కైక మందిరంలో అడుగుపెట్టాడు దశరథుడు.
మంధర మాటల ప్రభావం తీవ్రంగా పనిచేస్తున్నది కైక మీద.
ఆమె ఆంతరంగంలో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.
రాముడు రాజయితే? ఆ ఊహే భరింప శక్యంకాకుండా ఉన్నది. తన కొడుకు అడవులుపట్టి పోవాల్సిందే! తాను కౌసల్యకు దాస్యం చేయాల్సిందే. కౌసల్యను తాను ఎంత చిన్నచూపు చూసిందో! ఇప్పుడు అంతకు అంత అనుభవించాలి. ఇంత బ్రతుకు బ్రతికి ఇప్పుడు ఈ విధంగా! ఆ తలపు తట్టుకోలేకపోతున్నది. జరగబోయే అవమానాలు తలచుకొని ఆమె గుండె చెదిరింది.
తన ఉనికి ప్రశ్నార్ధకంగా మారబోతున్నది.
Also read: రాముడితో దశరథుడి సంభాషణ
ఇన్ని ఆలోచనలు ఆమె మానసాన్ని నిలువునా దహించి వేస్తున్నాయి!
చీకటి ఆవరించి నక్షత్రాలు లేని ఆకాశము వలే ఉన్నది ఆమె అంతరంగము!
ఉవ్వెత్తున లేస్తున్న ఆలోచనలు ఆవిడను కుదురుగా ఉండనీయటంలేదు. నేల మీద పడి దొర్లుతున్నది కైక!
పగపట్టిన పాములాగ బుసలుకొడుతున్నది. రుసరుసలాడుతున్నది. వేడివేడి నిట్టూర్పు సెగలు ఆవిడ శరీరాన్ని కాల్చివేస్తున్నాయి!
రాముడి అభిషేక వార్త బయట అందరికీ తెలిసిపోయింది.
కైకకు తానుగా చెప్పకపోతే బాగుండదన్న ఉద్దేశంతో ఆవిడకు తెలియచేయాలని అంతఃపుర ప్రవేశం చేశాడు దశరథ మహారాజు.
Also read: రామపట్టాభిషేకంపై వృద్ధనరపతి నిర్ణయం
ఆశ్చర్యకరంగా అక్కడ కైక లేదు! తాను వచ్చేసమయానికి సర్వాంగసుందరంగా అలంకరించుకొని తీయగా తనను పలుకరించే ఇల్లాలు అక్కడలేదు. ఆవిడ పెంపుడుచిలుకలు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాయి. కైకలేని ఆ ఇల్లు చంద్రుడు,నక్షత్రాలు లేని ఆకాశంలా ఉన్నది.
‘‘ఎక్కడికి వెళ్ళింది కైక?’’ పరిచారిక లను అడిగాడు దశరథుడు.
వారు భయంభయంగా అత్యంత వినయవిధేయతలతో “మహారాజా కైకమ్మ తీవ్రమైన కోపంతో కోపగృహంలోనికి వెళ్ళారు” అని తెలియజేశారు. ఆవిడ కనపడనందుకే ఆయన మనస్సును విచారం ఆవరించింది. ఇప్పుడు ఆవిడ కోపగృహప్రవేశం ఆయన మనస్సును విషాదంతో నింపింది. ఆవిడ ఉన్నచోటుకు మెల్లగా వెళ్ళాడా వృద్ధనరపతి.
అక్కడ పెరికివేసిన లతలా, బంధింపబడిన ఆడులేడిలా, క్రిందకు పడిపోయిన దేవకాంతలాగ, తన ప్రాణేశ్వరి, యువతి అయిన కైక మూర్తీభవించిన శోకదేవతలా శోభావిహీనంగా కనపడ్డది.
Also read: పరశురాముడి గర్వభంగం
ఆ స్థితిలో ఆవిడను చూసిన ఆయన మనస్సు వణికిపోయింది. తానుకూడా క్రింద చతికిలబడి మృదువుగా ఆవిడ చేయి తన చేతిలోనికి తీసుకొని మెల్లగా నిమురుతూ, ‘‘ఏమి కష్టము వచ్చింది దేవీ నీక ? ఆరోగ్యం సరిగాలేదా? ఇప్పుడే రాజవైద్యులను పిలిపిస్తాను. నీవు ఎవరికైనా ప్రియము చేకూర్చదలిస్తే చెప్పు. ఇప్పడే తీరుస్తాను. నీకెవరైనా అపకారం తలపెట్టారా చెప్పు, తక్షణమే దండిస్తాను నీకన్నా నాకు ప్రియమైనది ఏదీలేదు. నేను నీవాడిని. నీ ఆజ్ఞానువర్తిని. ప్రాణాలుఫణంగా పెట్టి అయినా నీ అభీష్టము నెరవేరుస్తాను. నా పుణ్యము మీద ఒట్టు వేసి చెపుతున్నాను’’ అంటూ పరిపరి విధాలుగా ప్రాధేయపడ్డాడు దశరథ మహారాజు.
Also read: సీతారామ కళ్యాణం
వూటుకూరు జానకిరామారావు