వచనం:
“కద్రువయు, వినతయు, వినోదార్థంబు విహరించువారు, కరిమకర నికరాఘాత జాత వాతోద్ధూత తుంగ తరంగాగ్ర సముచ్చలత్ జలకణాసార చ్ఛటాచ్ఛాదిత గగన తలంబైన దాని,
ఉద్యానవనంబునుం బోలె బహువిద్రుమ లతాలంకృతం బైన దాని,
నాటక రంగంబునుం బోలె ఘనరస పాత్ర శోభితరంగ రమ్యంబైన దాని,
దివంబునుం బోలె అహిమకర భరితంబైన దాని, మఱియు”;
పద్యం:
“అలఘఫణీంద్రలోక కుహరాంతర దీప్త మణిస్ఫురత్ ప్రభా
వలి గలదాని, శశ్వదుదవాస మహావ్రత శీత పీడితా
చల ముని సౌఖ్యహేతు విలసద్బడబాగ్ని శిఖాచయంబులన్
వెలిగెడి దాని, కాంచిరరవింద నిభానన లమ్మహోదధిన్!”
నన్నయ భట్టారకుడు
కద్రూవినతల నేపథ్యం
శౌనకాది మహామునులకు వివరిస్తున్న ఉగ్రశ్రవసువు, అందులో భాగంగా గరుడోపాఖ్యానాన్ని, దానిలో భాగమైన కద్రూవినతల వృత్తాంతాన్నీ, ఇట్లా నివేదిస్తున్నాడు:
“కృత యుగంలో కశ్యపబ్రహ్మ పత్నులైన కద్రువ, వినత, కుమారులు కావాలని కోరుకొని తమ భర్తను వేలాది యేండ్లు సేవించినారు. అందుకు కశ్యపుడు ప్రసన్నుడై “మీ కోరికలేమో చెప్పండి, తీరుస్తా” నన్నాడు.
“అనలతేజులు, దీర్ఘదేహులు, వినుత సత్వులై”న వేయిమంది పుత్రులను కద్రువ కోరుకున్నది. “సుపుత్రులు, భుజవీర్య వంతులు, కద్రువ పుత్రుల కన్న బలాఢ్యులు, వీరాగ్రేసరులైన పుత్రులిద్దరు మాత్రమే కావా”లని వినత వాంఛించింది.
కశ్యప బ్రహ్మ అనుగ్రహంతో, ఇరువురు పత్నులూ గర్భం ధరించినారు. వారిద్దరి గర్భాలు అండాలుగా కూడా మారినవి. ఆ గ్రుడ్లను సవతులిద్దరు నేతికుండల్లో దాచి రక్షింపగా, ఐదువందల సంవత్సరాల తర్వాత, కద్రువ గర్బంలోని అండాలు బ్రద్దలై శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు తదాదిగా గల వేయిమంది సర్పరాజులు ఉద్భవించినారు.
వినత మాత్రం తన రెండు అండాల్లో ఏ వొక్కటీ పగలకపోవడంతో సిగ్గుతో క్రుంగిపోయి, ఒక గ్రుడ్డును బ్రద్దలు కొట్టింది. పగలగొట్టిన గ్రుడ్డు నుండి , దేహంలో పై భాగం మాత్రమే కలిగి, క్రింది సగం దేహమే లేని వికలాంగుడు, అదే సమయంలో అత్యంత నీతిమంతుడైన పుత్రుడు, అనూరుడనే వాడు, జన్మించినాడు.
Also read: మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – దేవదానవ యుద్ధం
పూర్తిగా శరీరం ఏర్పడని అనూరుడు తల్లిపై అలిగి “నాకు పూర్తి ఆకారం ఏర్పడక మునుపే గ్రుడ్డు పగలగొట్టిన నీతిలేని దానవు. నీ సవతి కద్రువకు ఐదు వందల ఏండ్లు దాసీగా పడి వుండు” అంటూ ఆమెను శపించినాడు.
అదే అనూరుడు: “ఈ రెండవ అండాన్ని సరిగ్గా రక్షించు. దాని నుండి జన్మించేవాడు బహు బలవంతుడు, పరాక్రమశాలి కాగలడు. అతడే నీకు దాస్య విమోచనాన్ని ప్రసాదిస్తాడని” తల్లికి తెలిపి సూర్యుని రథసారధిగా వెళ్ళినాడు.
అప్పటి నుండి వినత తన రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడడం ప్రారంభించింది.
Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – దేవదానవులు క్షీరసముద్రాన్ని మధించడం
కద్రూవినతల సముద్రతీర విహారం
( నేటి వచనం యొక్క తాత్పర్యం)
“దేవదానవుల క్షీరసాగర మథనం జరిగిన సముద్రతీరానికి కద్రువ, వినతలు, విహారార్థులై విచ్చేసినారు. అక్కడ, నీటి ఏనుగులచే, మొసళ్ళచే, మర్దించబడుతున్న దాన్ని, అట్లా మర్దించినప్పుడు ఉద్విగ్నతరంగాలు ఉవ్వెత్తున ఉప్పొంగుతున్న దాన్ని, ఆ ఉప్పొంగే కెరటాల నుండి నలుదెసలా నీటితుంపురులు జడివాన వలె రేగి గగనతలాన్ని గ్రమ్మి నేలపై వర్షిస్తున్న దాన్ని, ఒక ఉద్యానవనం వలె బహువిద్రుమ లతా లంకృతమైన దాన్ని, ఒక నాటకప్రదర్శనం జరుగుతున్నదా అన్నట్లుగా ఘనరసపాత్ర శోభిత రంగరమ్యమైనదాన్ని, అంతేగాక ఆకాశం వలె దినకరుణ్ణి బింబిస్తున్న దాన్ని, అనగా, ఒక మహా సాగరాన్ని సవతులిద్దరు దర్శిస్తున్నారు. అంతేగాక”
(నేటి పద్యం యొక్క తాత్పర్యం): “పాతాళలోకపు గర్భ కుహరాంతరాల్లో అలఘ ఫణీంద్రలోక మణిప్రభలు వెలిగే దాన్ని, ఎడతెగని జలవాసపు శైత్యబాధను మహావ్రతం వలె మౌనంగా భరిస్తూ, హృదయంలో చెలరేగే బడబాగ్నితో చలి కాచుకొంటున్న ఒక గిరీంద్రాన్నీ అరవింద నిభాననలైన కద్రూవినతలు సముద్రం లోనికి చొచ్చుకొనిపోయి వీక్షిస్తున్నారు”.
కంటికి కనపడే దృశ్యాలు
సముద్రపు ఉపరితలంపైనా, సముద్రంలోపలా, మన కంటికి గోచరించే దృశ్యాలు కేవలం నిమిత్తమాత్రములు. ఆదికవి భావించిన అంతరార్థం వేరు. ఈ సముద్రమొక నాటకప్రదర్శన వలె వున్నదని ఆయనయే నేటి వచనంలో నొక్కి వక్కాణిస్తున్నాడు. “ఐ యామ్ నాట్ వాట్ ఐ యామ్” అంటాడు విషాదాంతమయ్యే ఒథెల్లో నాటకంలో పాత్రధారి ఇయాగో.
ఆదికవి భావించిన అంతరార్థం
సముద్రంలోకి చొచ్చుకొనిపోయి కద్రూవినతలు కేవలం మహాసాగర గర్బ కుహరాన్నే కాదు, తమ స్వీయ మనః కుహరాంతరాలను కూడా ఉత్కంఠతో దర్శిస్తున్నారు.
ఈ సముద్రగర్బం వినత యొక్క మానసికస్థితిని ప్రతిబింబిస్తున్నది. ఒకవంక సముద్ర దృశ్యాన్ని చూస్తూ, ఆహ్లాదాన్ని అనుభవిస్తున్న దాని వలె బహిరంగంగా ప్రవర్తిస్తున్న వినత మనస్సులో అశాంతి రగులుతున్నది.
కద్రువ వేయిమంది అనల తేజులకు జన్మను ప్రసాదిస్తే, తన గర్భం నుండి ఉదయించిన ఒక్క కొడుకూ అంగవిహీనుడు. అతని శాపం తనను సదా వెంటాడుతూనే వున్నది: “ఐదు వందల సంవత్సరాలు కద్రువకు దాసివై పడివుండు.” “ఈ రెండవ అండాన్ని సరిగ్గా రక్షించు. దాని నుండి జన్మించిన వాడు బహు బలవంతుడు, పరాక్రమశాలి, కాగలడు. అతడే నీకు దాస్య విమోచనాన్ని ప్రసాదించగలడు!”
అనూరుని శాపం నిజమైతే, సముద్రంలో సవతులిద్దరికీ సాక్షాత్కరిస్తున్న “ఫణీంద్రలోక కుహరాంతర దీప్త మణీస్ఫురత్ ప్రభావలి” కద్రువను ప్రతిబింబిస్తుంది. అదే సముద్రంలో విముక్తి లేని దాసివలె అణగిమణగి, శైత్యబాధను అనుభవిస్తూ, హృదయ బడబాగ్నులతో చలిని కాచుకొంటున్న పర్వతం, తననే ప్రతిఫలిస్తుంది.
Also read: మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం- ఉదంకోపాఖ్యానం-5
“సముద్రానికి దాస్యం చేస్తూ, దాని గర్భకుహరంలో శాశ్వతంగా మ్రగ్గుతున్న గిరీంద్రం వలె కద్రువకు దాసియై తానొక దిక్కులేని దానివలె జీవితాన్ని వెళ్ళబుచ్చ వలసిందేనా?”
కద్రువ సైతం పైకి ఏమీ ఎరగనట్లు నటిస్తున్నా, ఆమె మనస్సులోనూ అశాంతి రేగుతున్నది. “వేయిమంది కొడుకులతో తన కన్నకడుపు సుభిక్షంగా వున్నది. వినతకొక కొడుకు కలిగినా అంగ విహీనుడతడు. అమె రెండవ గర్భం కూడా విచ్ఛిన్నమై పోతే, తనదే ఎల్లప్పుడూ పై చేయి కాగలదు”.
సవతులిద్దరి మనస్సుల్లో పెను అశాంతి పొంచి వున్నదనే అభిప్రాయం ఈ పద్యం చదివినప్పుడు కలుగక మానదు. కద్రూవినతలు, తమతమ అంతరంగాలనే గాక, ఒకరి అంతరంగాన్ని మరొకరు చదవడానికి కూడా ప్రయాస పడుతున్నట్లుగా మనస్సుకు స్ఫురిస్తుంది.
“కాంచిరి అరవింద నిభానన లమ్మహోదధిన్” అనే పదప్రయోగం, కద్రూవినతల సముద్రపు దృశ్యాలను విప్పారిన పద్మవదనాలతో కలిసి చూస్తున్నారనీ, వినత వదనాన్ని కద్రువ ఎగాదిగా చూసినట్లే, కద్రువ ముఖాన్ని వినత కూడా తేరిపార పరికిస్తున్నదనే అర్థం హృదయంలో వెల్లివిరుస్తుంది.
అక్షర రమ్యత
నేటి చంపకమాలావృత్తం వాగనుశాసనుని రసరమ్యశైలికి అద్దం పడుతుంది. తత్సమపద బంధురమైన రెండు దీర్ఘ సమాసాలీ పద్యాన్ని ఆవరించినవి. కాకపోతే, రెండు సమాసాలూ, దాదాపు ఒకే కాలప్రమాణం కలిగిన విభాగాలుగా విరిగిపోతున్నవి. లయబద్ధంగా విరిగిపోయే వాక్యశకలాలు, వాటిలోని అనుప్రాసా విన్యాసాలు, పరస్పరం కలిపి చదవడంచే, పద్యానికి సమ్మోహనత్వం, తద్వారా పఠితకు అలౌకికానందం సిద్ధిస్తాయి.
మొదటి సమాసం లోని విరుపులివి:
అలఘ/ఫణీంద్ర/లోక (10 మాత్రలు)
కుహరాంతర/ దీప్త (9 మాత్రలు)
మణి/స్ఫురత్/ప్రభా (9 మాత్రలు)
వలి కలదాని
రెండవ సమాసం లోని విరుపులు:
శశ్వదుద/వాస (8 మాత్రలు)
మహావ్రత శీత (8 మాత్రలు)
పీడితాచల (7 మాత్రలు)
మునిసౌఖ్యహేతు (8మాత్రలు)
విలసత్ బడబాగ్ని(9 మాత్రలు)
శిఖాచయంబులన్(9మాత్రలు)
వెలిగెడు దాని
కలదాని, వెలిగెడు దాని, అనే సమాసాంత సంబోధనలు రెంటినీ ఒకే సూత్రంతో కవి బంధించడంచే పద్యానికొక ఏకత్వం ఏర్పడింది.
“కాంచి
రరవింద నిభానన లమ్మహోదధిన్”
అనే వాక్యంతో పద్యాన్ని ముగిస్తున్నాడు నన్నయ భట్టారకుడు.
Also read: మహాభారతం – ఆదిపర్వం – ఉదంకోపాఖ్యానం-4
మొదటి సమాసంలో పలు శబ్దాలు, కలుస్తూ, విడిపోతూ వుంటాయి. “అలఘఫణీంద్రలోక” అనే పదప్రయోగం చివర గల “క” కారం, “కుహరాంతర దీప్త” అనే తర్వాత పదప్రయోగం మొదట్లోనే గల “క” కారంతో అనుసంధితం కావడంతో బాటు, రెండు విభాగాల్లోనూ సరిసమానంగా గర రేఫాక్షరాలు, “త””ప”కార శబ్దాలు, కర్ణపేయమై, పఠితకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
దీని తర్వాత గల “మణిస్ఫురత్ప్రభా” అనే శబ్దప్రయోగం “జగణము” దాన్ని అనుసరించి “రగణము” రావడంచే సిద్ధించే మనోహరధ్వని (లఘువు-గురువు/లఘువు-గురువు/లఘువు-గురువు). ఇట్టి శబ్దాలు ఉరుదూ/హిందీ సాహిత్యంలో సర్వసామాన్యం (కహా షురూ కహా ఖతమ్). విరాటపర్వంలో జగణ/ రగణాల మనోహర సంగమాన్ని తిక్కన సోమయాజి కూడా విరివిగా వాడుకున్నాడు. ఉదాహరణకు: “వికటభ్రుకుటీ చటులప్రవృత్త నర్తన ఘటనాప్రకార భయదస్ఫురణా పరిణద్ధ మూర్తియై”. జగణాలు కలిగిన కందపద్యంలో కూడా ఇట్టి మెరుపులు సాధారణమే. ఉదాహరణకు పెద్దన ” హేమాఢ్య దరీజరీ నిరీక్షాపేక్షన్” అనే కంద పద్యప్రయోగం.
రెండవ సమాసంలో ఒకే శబ్దం (శ/చ/స) అన్ని విభాగాల్లోనూ సాక్షాత్కరిస్తుంది.
సామాన్యంగా అనుప్రాసను విరివిగా ప్రయోగించే వాగనుశాసనుడు (చలద్ వేలావనైలావలీ లవలీలుంగ లవంగ సంగత లతాలాస్యంబు లీక్షించుచున్),నేటి పద్యంలో ప్రతి శబ్దాన్నీ సూక్ష్మదృష్టితో (subtlity) వాడడం విశేషం. జాన్ కీట్స్ అనుప్రాసలను కుసుమకోమలంగా ప్రయోగించడంలో సిద్ధహస్తుడు. “ఓడ్ టు నైటింగేల్” అనే ఖండిక లోని ఆయన ప్రతిప్రయోగము రసాత్మకమైనదే. అందులో గల “ఇన్ మాజికల్ కేస్ మెంట్స్, అమాంగ్ పెరిలస్ ఫోమ్స్ ఇన్ ఫైరీ లాండ్స్ ఫర్ లోర్న్” అనే పంక్తి తరతరాల పఠితలకు ప్రీతిపాత్రమైనది.
Also read: మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం
ఈ వ్యాసం రచిస్తున్నప్పుడు, పంతొమ్మిదవ శతాబ్దపు అమెరికన్ చిత్రకారుడు విన్స్ లో హోమర్ నా స్మృతిపథంలో మెదిలినాడు. ఒక సముద్రతీరాన చిన్న కుటీరాన్ని నిర్మించుకొని, నీటి రంగులలో సముద్ర దృశ్యాలనే చిత్రిస్తూ జీవితాంతం గడిపిన ఆ చిత్రకారుని కుంచెలో సముద్రం శతకోటి రూపాలలో సాక్షాత్కరిస్తుంది. సముద్రమే గాక, సముద్రాన్ని ఆధారంగా చేసుకొని జీవించే మానవుల గాథలు కూడా ఆయన చిత్రాల్లో గోచరిస్తాయి.
వైతాళికుడు గోపాలకృష్ణగోఖలే
ఆధునిక భారతాన్ని మేలుకొల్పిన వైతాళికుల్లో గోపాలకృష్ణ గోఖలే అగ్రగణ్యుడు. పుణె డక్కన్ కాలేజీలో అధ్యాపకునిగా పనిచేసేవాడు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాజీవితంలో ప్రవేశించే సందర్బంలో, కళాశాల వృత్తిని వీడుగొల్పుతూ ఆయన చేసిన ప్రసంగం చిరస్మరణీయమైనది. తన ప్రసంగంలో ఒకచోట గోఖలే ఇట్లా అన్నాడు: “నాకొక కథ జ్ఞాపకం వస్తున్నది. ఒక వ్యక్తి వుండేవాడు. ఒక సముద్రతీరాన ఒక పాకను కట్టుకొని కష్టించి పనిచేస్తూ చీకూచింతలు లేని జీవితం గడిపేవాడు. సాయంసంధ్య తర్వాత ఇంటికి మరలివచ్చేవాడు. వచ్చినదాదిగా కట్టెదుట గల మహాసముద్రాన్నే ఆసక్తిగా గమనించేవాడు. కొన్ని సార్లు ఆ సముద్రం విశ్వాస పాత్రమైన శునకం మొరుగుతున్నట్లుగా అతనికి తోచేది. సముద్ర తరంగలు వచ్చి తన కాళ్లను ప్రేమతో నాకుతున్నట్లు అతనికి తోచేది. తాను నిద్రిస్తున్న వేళ సముద్రం కొన్ని పర్యాయాలు భీకరంగా గర్జించి భయభ్రాంతుణ్ణి చేసేది. సముద్రమంటే అతనికి చెప్పలేని వ్యామోహం కలిగింది. తాను చేస్తున్న వృత్తిని కాలదన్నినాడు. ఒక పడవను నిర్మించుకున్నాడు. ఆ పడవలో సముద్రమధ్యంలోకి ప్రయాణం చేసి అక్కడ ఒక పెను తుపానులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినాడు”.
Also read: భారత్, పాకిస్తాన్ మధ్య 1971లో జరిగింది ధర్మయుద్ధం
సమ్మోహనాస్త్రాన్ని విసిరే సముద్రపు ఉపరితలం
నేటి నన్నయ వచనము, పద్యము, ఎంతో ప్రసిద్ధమైనవి. ఆదికవి వచనంలో వర్ణించిన సముద్రపు ఉపరితలం మానవజాతిపై తరతరాలుగా తన సమ్మోహనాస్త్రాన్ని విసురుతూనే వుంది. అదే ఆదికవి పద్యంలో వర్ణించిన సముద్రగర్బం ఆద్యంతము ప్రమాదభరితమైనది. సముద్రంలో ఎట్లా బడబాగ్నులు రేగుతాయో ప్రతి వ్యక్తి జీవితంలో, జాతి జీవితంలోనూ బడబాగ్నులు రేగుతూనే వుంటాయి. చివరకు కద్రవకు, వినత, చిరకాల దాస్యం చేయక తప్పదు. కద్రువ, వినత, ఈ సమాజంలో సామాజిక అసమానతలకు ప్రతీకలు. బడబాగ్ని అనే దీనమానవుల ప్రతిభ సముద్రపు గర్భంలో దిక్కుమొక్కు లేక పడివుండడం చరిత్ర సత్యం.
మరొక్క కోణంలో కూడా ఆలోచించవలసి వుంది. సౌరకుటుంబంలో నీరు కలిగినదొక భూమాతయే. నీరు, అగ్నిని నియంత్రించినంత కాలం భూమాత సుభిక్షంగా ఉండగలదు. ఈ విషయాన్ని ఉదంకోపాఖ్యానంలో అగ్ని అనే గుఱ్ఱాన్ని అధిరోహించి దాన్ని నియంత్రించే పర్జన్యుడే చాటి చెబుతున్నాడు. జాతివైరం, హింస, యద్ధోన్మాదంతో సతమతమౌతున్న లోకమీ సంగతి గుర్తించవలసి వుంది.
సముద్రగర్భంలోకి తొంగి చూడగల్గిన నేటి నన్నయగారి సాహసికపద్యం తరతరాల పాఠకుల జిహ్వాగ్రాలపై నర్తిస్తూనే వున్నది.
Also read: మహాభారతం: ఆదిపర్వం: ఉదంకోపాఖ్యానం-3
నివర్తి మోహన్ కుమార్