Sunday, December 22, 2024

మహాభారతం – ద్వితీయాశ్వాసం – కద్రూవినతల వృత్తాంతం

వివిధోత్తుంగ తరంగ ఘట్టన చలద్వేలావనైలావలీ

లవలీలుంగ లవంగ సంగత లతాలాస్యంబు లీక్షించుచున్

ధవళాక్షుల్ సని కాంచిరంత నెదురం తత్తీర దేశంబునం

దవదాతాంబుజ ఫేనపుంజ నిభు నయ్యశ్వోత్తమున్ దవ్వులన్”

నన్నయ భట్టారకుడు

నేపధ్యం

క్షీరసాగరమథనం జరిగిన సముద్రతీరానికి కద్రూవినతలు విహారార్థులై విచ్చేసి, మనోహరమైన సాగరోపరితలాన్ని  వీక్షిస్తున్నారు.  క్రింది వచనం ఆ ఘట్టాన్ని దృశ్యమానం చేస్తున్నది.

‘కరిమకర నికరాఘాతజాత వాతోద్ధూత తుంగతరంగాగ్ర సముచ్చలజ్జల కణాసార చ్ఛటాచ్ఛాదిత గగనతలంబైన దాని,నుద్యాన వనంబునుం బోలె బహువిద్రుమా లంకృతంబైన దాని, నాటకప్రయోగంబునుం బోలె ఘనరసపాత్రశోభిత రంగ రమ్యంబైన దాని, దివంబునుం బోలె నహిమకర భరితంబైన దాని (కద్రూవినతలు వీక్షిస్తున్నారు).

Also read: మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – కద్రూవనితల సముద్ర తీర…

పై వచనానికి అనుబంధమైన నేటి పద్యభావమిది:

“ఆ పిమ్మట కద్రూవినతలు వివిధ భంగిమల్లో ఎగిసెగిసి పడుతూ, తీరాన్ని తాకుతున్న సముద్ర తరంగాలను, ఆ తాకిడికి తీరవనాంతరాల్లో అటూ ఇటూ కదులుతూ లాస్యం చేస్తున్న ఏలకీ లతలను, లవలీలతలను, మాదీలతలను, లవంగలతలను, తమ ధవళాయత నేత్రాలతో చూసి చని, దూరంగా, సముద్ర తీరాన, తెల్లని తామరతో, తెల్లని ఫేనంతో ఉపమింపదగిన ఒక శ్వేతాశ్వాన్ని కట్టెదుట వీక్షించినారు”

పై వచనంలో వర్ణింపబడిన శ్వేతాశ్వమే  క్షీరసాగర మథనంలో అమృతంతో బాటు ఉద్భవించిన ఉ చ్చ్వైశ్రవం.

పై వచనం, నేటి పద్యం, రెండూ కలిపి పఠించినప్పుడొక మనోహర చలనచిత్రం మన కట్టెదుట సాక్షాత్కరిస్తుంది.

“నీటి ఏనుగలు, మొసళ్ళు కలిసి సముద్రతరంగాలను మర్దిస్తున్నాయి. అట్లా మర్దించినప్పుడు, సాగరతరంగాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ఆ కెరటాల నుండి నీటి తుంపురులు రేగి, గగనతలాన్ని గ్రమ్మి, జడివాన వలె నేలపై వర్షిస్తున్నాయి.” 

“సముద్రతరంగాల తాకిడికి, అటూ ఇటూ కుదలుతూ, లాస్యం చేస్తున్న ఏలకీ లతలతో, లవలీలతలతో, మాదీలతలతో, సాగరతీరమొక నందనోద్యానవనం వలె బహువిద్రుమ లతాలంకృతమై అలరారుతున్నది”.

ఆ వనాంతాన్ని ముగ్ధులై వీక్షించిన కద్రూవినతలు, అక్కడనుండి చని, దూరంగా, సాగరతీరాన ఉల్లాసంగా సంచరిస్తున్న ఒక శ్వేతాశ్వాన్ని, తెల్లని తామరతో, తెల్లని ఫేనంతో ఉపమింపదగిన దాన్ని, తమ ధవళాతపత్ర నేత్రాలతో వీక్షిస్తున్నారు”.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – దేవదానవ యుద్ధం

హృదయాలను రంజిల్లజేసి, శాంతినీ, సంతోషాన్నీ ప్రసాదించే పరాత్పరుని  సృష్టి పరమాద్భుతమైనది.  అపురూపమైన భూతల శోభను తమ స్వార్థ ప్రయోజనాలకై మానవులెంత ధ్వంసం చేసినా,  నిసర్గసుందరమై సృష్టి మళ్లీ మళ్లీ చిగురిస్తునే వుంటుంది.

ఈ విషయాన్నే ఋషి తుల్యుడు, మహా రచయిత, లియో టాల్ స్టాయ్ తన నవల “రిసరెక్షన్”లో  చాటి చెబుతున్నాడు:

“Though hundreds of thousands had done their very best to disfigure the small piece of land on which they were crowded together, paving the ground with stones, scraping away every sprouting blade of grass, lopping off the branches of trees, driving away birds and beasts, filling the air with the smoke of coal and oil, still spring was spring, even in town.”

“The sun shone warm, the air was balmy, the grass where it did not get scraped away, revived and sprang up everywhere, between the paving-stones as well as on the narrow strips of lawn on the boulevards. The birches, the poplars and the bird-cherry trees were unfolding their gummy and fragrant leaves. The swelling buds were bursting on the lime-trees. Jackdaws, sparrows and pigeons, filled with the joy of spring, were getting their nests ready. Flies warmed by the sunshine were buzzing along the walls”.

వసంతోదయంతో మొక్కలు,  పక్షులు, కీటకాలు  పరవశించి పోతున్నవి, చిన్నారి పాపలతో సహా.

టాల్ స్టాయ్ మాటల్లో:

“All were glad; the plants, the birds, the insects and the children!

దేవదానవుల క్షీరమధనానికి కేంద్రబిందువైన సాగరతీరాన సైతం, ఏనుగలు, మొసళ్ళు, పరస్పర వైరాన్ని మరచి, ప్రకృతి శోభను తనివితీరా గ్రోలుతూ, హర్షాతిరేకంతో  పులకించి పోతున్నవి. 

పెరిగి పెద్దలైన పిదప, ఒకరినొకరు మోసం చేసుకుంటూ, ఒకరిపై ఒకరు రహస్యంగా కత్తులు నూరుతూ, కుటిల జీవనాలను సాగించే స్వార్థపరులైన మానవులను  ఈ సృష్టి సౌందర్యం కదిలింపలేదని టాల్ స్టాయ్ ఆవేదన చెందుతున్నాడు:

“But men, grown-up men and women, did not leave off cheating and tormenting themselves and one another. It was not this spring morning that they thought sacred and important, not the beauty of God’s world, given to benefit all creatures – a beauty which inclines the heart to peace, harmony and love – but only their devices for getting the upper hand of each other”.

ఇదే విషయాన్ని నన్నయ భట్టారకుడు  కథారూపంగా మనకు నివేదిస్తున్నాడు.

నాటకరంగం

ఏనుగలూ, మొసళ్ళూ కలిసి హాయిగా ఆడుకొంటున్న నేటి క్షీరసాగరం చెంతనే మొన్నటికి మొన్న దేవదానవులు పరస్పరం స్నేహం నెరపి అమృతాన్ని  మధించినారు. అది పంచుకోవడంలో తేడాలు వచ్చి పరస్పరం మోసం చేసుకున్నారు. ఎవరిది పై చేయి అని నిర్ణయించు కోవడానికి, ఒకరితో ఒకరు ఘోరయుద్ధానికి కూడా పాల్పడినారు.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – దేవదానవులు క్షీరసముద్రాన్ని మధించడం

కశ్యపబ్రహ్మకు ఇరుపత్నులైన కద్రూవినతలు పరస్పరం కలిసి మెలిసి వున్నా,  ఇరువురి మనస్సుల్లో పరస్పర వైరభావం వున్నది. కద్రువ వేయిమంది వీర్యవంతులైన పుత్రులను కోరుకుంటే, వినత కద్రువ తనయులకన్న పరాక్రమవంతులైన ఇద్దరు కొడుకులను వాంఛించింది. కానీ, రెండు అండాల్లో ఏ ఒకటీ పగలక పోవడంతో, సిగ్గుచెంది, తొందరపాటుతో, ఒక గ్రుడ్డును పగలగొట్టింది. పగలగొట్టిన గ్రుడ్డు నుండి పై దేహం మాత్రమే గల కొడుకు, అనూరుడనే వాడు జన్మించినాడు.

“గ్రుడ్డు పరిపక్వం కాకమునుపే పగులగొట్టి నేను వికలాంగుణ్ణి కావడానికి కారణమైన నీతిలేని దానవు.  నీవు కద్రువకు ఐదువందల ఏండ్లు దాసివై పడి వుందువు గాక!” అని స్వంత కొడుకుచే  శపించబడిన దురదృష్టమహిళ  వినత.  కద్రువకు ఈ విషయం తెలిసి వున్నది గనకనే వినతను తన దాసిగా చేసుకోవాలనే బలీయమైన వాంఛ కద్రువకు కలిగింది. సాగరతీరవిహారం ఆమె కోరికను బలవత్తరం చేసింది.

అలఘ ఫణీంద్రలోక కుహరాంతర దీప్త మణిస్ఫురత్ ప్రభా

వలి గలదాని, శశ్వదుద వాస మహావ్రత శీత పీడితా

చల మునిసౌఖ్యహేతు విలసత్ బడబాగ్ని శిఖాచయంబులన్

వెలిగెడు దాని, కాంచిరరవింద నిభానన లమ్మహోదధిన్”

సముద్రపు లోతుల్లో  కద్రూ వినతలు రెండు దృశ్యాలను వీక్షించినారు.  మణిస్ఫురత్ ప్రభలతో తేజస్వియై వెలుగుతున్న అలఘఫణీంద్ర లోక కుహరాంతరమొకటి. మరొక్కటి: సముద్రగర్బ దాస్యం చేస్తూ శైత్యబాధతో,  హృదయ బడబాగ్నులు చిమ్ముతున్న పర్వతమొకటి. మొదటిది తనకు సంకేతంగా, మరొక్కటి వినతకు ప్రతీకగా కద్రువ మనస్సులో ఊహించింది.

అధర్మమార్గంలో సవతిని ఓడించి తన దాసిగా చేసుకోవాలనే కద్రువ ఎత్తుగడకు, సాగరతీరాన ప్రత్యక్షమైన తెల్లని గుఱ్ఱం ఊపిరి పోసింది.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం- ఉదంకోపాఖ్యానం-5

నేటి కథ

సముద్రతీరాన హాయిగా, స్వేచ్ఛగా, విహరిస్తున్న తెల్లని గుఱ్ఱాన్ని కద్రూవినతలు కలిసి వీక్షిస్తున్న వేళ, కద్రువ సవతితో అన్నది: “చూడవే! అక్కడ అతి తెల్లగా కనపడే ఆ గుఱ్ఱానికి, తోకభాగం మటుకు పూర్ణచంద్రునికి నల్లని మచ్చ వున్నట్లుగా, కృష్ణవర్ణంతో వుంది!”

వినత నవ్వి ఇట్లా జవాబిచ్చింది: “అక్కా! నీవే కన్నులతో చూచినావే? మచ్చ నీకెక్కడ కనపడింది? ఆ అశ్వరాజమూర్తి మహాపురుష కీర్తి వలె ఆపాదమస్తకం అతి నిర్మలమైన ధావళ్యంతో ఒప్పారుతున్నది!”

దానికి కద్రువ ఇట్లా సమాధానం చెప్పింది: “ఇది మన మధ్య పందెం. గుఱ్ఱం వాలభాగం నేనన్నట్లుగా నల్లగా వుంటే నీవు నాకు దాసివి. నల్లగా లేకపోతే నేను నీకు దాసిని!”

వినత పందెమునకు ఒప్పుకున్నది. “తక్షణమే వెళ్ళి నీవన్నది నిజమో కాదో తేల్చుకుందాం” అన్నది. “ప్రొద్దు పోయింది. పతికి పరిచర్య చేసే కాలమైంది. రేపు వచ్చి పరీక్షించుకుందాం” అని కద్రువ  దాటవేసింది.

ఆ రాత్రి కద్రువ తన పుత్రుల చెంతకు వెళ్ళి ఇట్లా ప్రార్థించింది: “తనయులారా! మిమ్ముల నందరినీ వేడుకుంటున్నాను. నా ఆజ్ఞ శిరసావహించండి. కామచారులైన మీకు చేయలేనిదేదీ లేదు. తెల్లని అశ్వరాజం తోకను మీరు నల్లగా చేయగలిగితే, వినత నాకు దాసి కాగలదు. లేకపోతే నేనే వినతకు దాసి కావలసి వస్తుంది”.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ఉదంకోపాఖ్యానం-4

కద్రువ పుత్రులందరు తమలో తాము చర్చించుకొని “అధర్మం. మేమిది చేయం!” అని ముక్తకంఠంతో అన్నారు. ఆ జవాబుతో కద్రువ కోపోద్దీపిత ముఖియై “ఎక్కడా లేని విధంగా జనమేజయ మహారాజు చేయబోయే సర్పయాగంలో మీరందరూ అగ్నిగుండంలో పడి మరణింతురు గాక!” అని కన్నకొడుకులనే శపించింది.

కానీ, అంతమంది కొడుకుల్లోనూ కర్కోటకుడనే వాడు మాత్రం శాపానుభవ భీతచిత్తుడై, ఉచ్చ్వైశ్రవం యొక్క తోక, నల్లగా వున్నదా అనిపించేటట్లు, గుఱ్ఱం తోకను పట్టుకొని వ్రేలాడడానికి ఒప్పుకున్నాడు.

మరునాడు, కద్రూవినతలు సముద్రతీరానికి వచ్చి తెల్లని  గుఱ్ఱాన్ని దర్శించినారు. కర్కోటకుడు గుఱ్ఱం తోకకు వ్రేలాడడంచే వినతకు తోకభాగం నల్లగా కనిపించింది. దానితో వినత ఓటమిని అంగీకరించి కద్రువకు దాసియై ఆమె చెప్పిన పనులు చేస్తూ కాలం గడపింది. ఇట్లా ఐదువందల ఏండ్లు గడచినవి.

ఈ కథకు, భారతకథకు పోలిక లున్నాయి. కద్రువకు  వేయిమంది కొడుకులైతే, గాంధారికి నూరు మంది. ఈ కథలో తల్లి కద్రువ అధర్మానికి పాల్పడితే, భారతకథలో గాంధారి పుత్రులు అధర్మ మార్గాన్ని అవలంబిస్తారు. కౌరవుల అధర్మ జూదంచే పాండవులు పరాజయం చెంది వన వాస, అజ్ఞాత వాస శిక్షలనుభవిస్తే, కద్రువ కనికట్టుచే వినత పరాజయం చెంది  సవతికి చిరదాస్యం చేయవలసి వస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులందరూ నిహతులైతే, సర్పయాగంలో  కద్రూతనయులైన సర్పరాజులనేకులు  మరణిస్తారు.

కద్రువ పుత్రులందరూ పాతాళలోక వాసులు, అధోముఖులు. దుర్మార్గులైన  కౌరవులందరూ అధోముఖులే.

కుంతీపుత్రులైన పాండవులు ఊర్థ్వముఖులై స్వర్గపథం వైపు వెళ్ళినట్లే, వినత పుత్రుడైన అనూరుడు కూడా సూర్యుని రథసారధియై, ఆకాశమార్గాన సంచరిస్తాడు. వినత రెండవ సుతుడు గరుత్మంతునిది కూడా గగనపథమే.   అజరామరమైనది గరుత్మంతుని గాథ.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం

నేటి పద్యసౌందర్యం

తెలుగువారి జిహ్వాగ్రాలపై సదా నర్తించే నన్నయ భట్టారకుని పద్యాల్లో నేటి పద్యం అగ్రశ్రేణికి చెందుతుంది. అందుకీ పద్యంలోని గాంభీర్యత, ధ్వని, అక్షరరమ్యతలు కారణాలు.

నేటి ఆదికవి వచనం, దానికి అనుబంధమైన పద్యంలోని  వర్ణన, ఎగిసిపడే తరంగాల చుట్టూ, ఉద్యానవనాన్ని తలపించే లవలీలుంగ లవంగ లతావితానాల చుట్టూ పరిభ్రమిస్తుంది. పద్యం చివర్లో ఉచ్వైశ్రవాన్ని క్లుప్తంగా నన్నయ పేర్కొంటున్నాడు: ధవళాక్షుల్ సని కాంచిరంత నెదురన్ తత్తీర దేశంబునం/దవతాతాంబుజ ఫేనపుంజ నిభునయ్యశ్వోత్తమున్ దవ్వులన్”

తరంగాలు లాస్యం చేస్తున్నాయి. వనాంతం కూడా లాస్యం చేస్తున్నది. ఈ విషయాన్ని కవి వాచ్యంగా పేర్కొంటున్నాడు. సముద్రతరంగాలు, నీటి ఏనుగులు, మొసళ్ళు,  వనాంతమూ ఆనందంతో కేరింతలు కొట్టినప్పుడు, వెన్నెలవంటి తెల్లని అశ్వరాజం కూడా ఆనందంతో కేరింతలు కొట్టకుండా వుంటుందా? గుఱ్ఱం సైతం హర్షోద్వేగంతో పొంగిపోతున్నదనే విషయం ధ్వనిపూర్వకంగా ఆదికవి పేర్కొంటున్నాడు.

మరొక్క విషయం. ఈ పద్యంలోని  వస్తుసముదాయం ప్రధానంగా ధవళాకృతిలో వున్నది. తీరాన్ని ఢీకొనే తెల్లని తరంగాలు. తెల్లని తామరవలె, తెలతెల్లని నురగవలె  నిగనిగ లాడుతున్న అశ్వరాజం. ఈ తెల్లదనాన్ని ఆస్వాదిస్తూ వీక్షిస్తున్న కద్రూవినతల కంటిపాపలు కూడా తెల్లని కాంతితో మిరుమిట్లు గొల్పుతున్నాయి. ఇది ధ్వనింపజేయడానికి కాబోలు, ఆదికవి, సవతులిద్దరినీ “ధవళాక్షులు” అని సంబోధిస్తున్నాడు.

మరి నల్లదనం ఎక్కడ నుండి వచ్చింది? “చలద్వేలా వనైలావలీ/లవలీలుంగ లవంగ సంగత లతా లాస్యం” నుండి వచ్చినది. ఈ వనంతమంతా దూరం నుండి చూసినప్పుడు శ్యామలాకృతితో గోచరిస్తుంది. ఈ కృష్ణవర్ణం చూసినప్పుడే కద్రువ మనస్సులో దుష్టచింతన అంకురించింది.

Also read: భారత్, పాకిస్తాన్ మధ్య 1971లో జరిగింది ధర్మయుద్ధం

అక్షరరమ్యత

నేటి పద్యం తరతరాలుగా తెలుగువారి నాలుకలపై జీవించడానికి, అపారమైన దాని శబ్దమాధుర్యమే హేతువు. తత్సమ పదశోభితమైన ఈ పద్యంలో, ప్రతిదీ ఏడు లేక ఎనిమిది మాత్రల కాలప్రమాణం కలిగిన పలు శబ్దశకలాలన్నవి. పరస్పర సమానమైన ఈ శబ్దవిభాగాలన్నీ కలిపి పఠించినప్పుడు, లయబద్ధంగా పలుకుతూ, మధుర, మంజుల సంగీతమై మ్రోగుతాయి. ఉదాహరణకు, సముద్రతీర వనాంత వర్ణనను చూడండి:

“చలద్వేలా/ వనై/లావలీ/ లవలీ/లుంగ లవంగ సంగత/ లతా/ లాస్యంబు/లీక్షించుచున్” అంటూ సాగే ఈ వర్ణన సుదీర్ఘ సమాస బంధురమైనది. వృత్యనుప్రాసాశోభితమైన ఈ సమాసంలో తరచుగా తారసపడే  “ల” కారాన్నే పఠితలందరూ అప్రయత్నంగా నొక్కి పలుకుతారు (స్ట్రెస్డ్ సిలబల్). దీనిలో, “వ” కారము, “త” కారము వంటివి విరివిగా వున్నా, అవన్నీ కేవలం సహాయ వాద్యాల వంటివి.

చలద్వేలా (7 మాత్రలు)

వనైలావలీ (8 మాత్రలు)

వీటిల్లో ‘ల’ కారం చివర వున్నది.

లవలీలుంగ (7 మాత్రలు)

లవంగసంగత (8 మాత్రలు)

లతాలాస్యంబు (8 మాత్రలు)

లీక్షించుచున్ (7 మాత్రలు)

వీటిల్లో “ల” కారం మొదటనే వున్నది.

ఇప్పుడు మొదటి/రెండవ పాదాల లయానుబంధం గమనించండి

వివిధోత్తుంగ తరంగ (మొదటి పాదం)

లవలీలుంగ లవంగ (రెండవ పాదం

ఇంకొక విశేషం. పై వనాంతర వర్ణన తప్పితే మరెచ్చటా “ల” కార శబ్ధం వినిపింపదు, పద్యం చివర్లో తప్ప (దవ్వులన్).

సున్నితమైన శబ్దాలతో కూడిన   నేటి పద్యనిర్మాణం  పరమోత్కృష్టమైన వాగనుశాసనుని సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం.

సుందర పదబంధాలతో, పఠితల హృదయ కుహరాంతరాల్లో “నిత్య నూతన తాండవ నృత్యకేళి” సలపగల పద్యమిది.  అర్థంతో నిమిత్తం లేకుండా, కేవలం సమ్మోహపరచే  శ్రవణానందం కోసం, చదివిన పద్యాన్నే మరీమరీ చదివి ధన్యత గడించేవారు తెలుగునాట కోకోల్లలు.

Also read: మహాభారతం: ఆదిపర్వం: ఉదంకోపాఖ్యానం-3

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles