Sunday, December 22, 2024

ఒక సాంస్కృతిక వికాస వీచిక – కదలిక!

సరిగ్గా పదేళ్ళ క్రితం ఒక డాక్టర్ గా ఉంటూ సమాజంలో మూఢనమ్మకాల నిర్మూలన కోసం కృషి చేసిన ఆలోచనా పరుడూ, అంధశ్రద్ధ నిర్మూలన సమితి వ్యవస్థాపకుడూ డా. నరేంద్ర దభోల్కర్ హత్య చేయబడ్డారు. మనుషుల్ని భౌతికంగా చంపడం ద్వారా వారి భావాలను ఆపగలమనే వారు ఎంతటి అమాయకులో ఈ రోజు దేశంలో ఇన్నిచోట్ల దభోల్కర్ గురించిన సంస్మరణ సమావేశాలు జరపడం చూస్తే తెలుస్తుంది. ఆ రోజు ఆయన మెదళ్ళో బుల్లెట్లు దింపిన దుండగులకి అదెంత శక్తి వంతమైనదో ఈ మధ్య కాలంలో తెలిసొస్తోంది. ఎలాటి మెదడది? అక్షరాల పక్షం వహించింది. దానిని ఏ ఆయుధమూ తాకలేదు. అదిగో అలా అక్షరాల వైపు నిల్చిన అనేక గొంతుకలలోంచే ఈ అభివ్యక్తి జనించింది. అదే మన కదలిక. అందుకే అంటాడు కాళోజీ, “ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక” అని!

ఇది సగటు మనిషి ప్రగతి కోసం పాటుపడే భావోద్యమ స్వచ్ఛంద సంస్థ. అన్ని ప్రజాసంఘక్షేత్రాల్ని మిత్ర పూరితంగా కలుపుకొని పోయేది. సమాజంలో ‘ఉండకూడని’ అవాంఛనీయ ప్రభావాలకు విరుద్దంగా, ‘ఉండవల్సిన’ ఆలోచనలకి అనుగుణంగా ముందుకెళ్ళేది. ఆధునిక ప్రజాతంత్ర ప్రవాహంలో రాజ్యాంగబద్ధమైన దృక్పథంతో, హేతుబద్దమైన వైఖరుల్ని ప్రజా సంఘటనగా మల్చుకునేది. ఈ క్రమంలో సుమారు 260 ఏళ్ళ క్రితమే ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ‘యాజకత్వ’ హక్కు కోసం బ్రాహ్మణాధిక్యతపై తిరుగు బాటు చేసి, ఏకంగా న్యాయం కోసం ఇంగ్లాండు ప్రివీకౌన్సిల్ వరకూ వెళ్ళిన భావోద్యమశీలి “మామిడి వెంకయ్య’ గార్ని స్మరించు కోవాల్సి ఉంది!

“మనుషులు కులాలుగా విభజించబడి, హక్కులు కులాల ప్రకారం విభజించబడి, అందుకు భిన్నంగా నడవ డానికి అవకాశం ఇవ్వని సమాజ వ్యవస్థలో కులాల పేరిట జరిగిన పోరాటాలు హక్కుల పోరాటాలేకానీ కులపోరాటాలు కావు” అన్న హేతువాద మిత్రులు, పెద్దలు రావిపూడి వెంకటాద్రి గారు, దశాబ్దాల క్రితం రచించిన “అడుగు జాడలు” అనే తన గ్రంథంలో, “పురోహిత వర్గ వ్యతిరేక ఉద్యమాలన్నీ నిస్సంశయంగా మానవ హక్కుల ఉద్యమాలే. అవి ఆత్మాభిమాన సంఘాలే కాని కుల సంఘాలు కావు..” అంటారు. భారతీయ సమ్మిళిత సమాజంలోని భిన్నత్వాన్ని, బహుళత్వాన్ని ఆరోగ్యకరమైన రీతిలో గుర్తించి, కొనసాగించ గలగడమే వికసిత పౌరసమాజం లక్ష్యం కావాలి గానీ, భావాధిపత్య ధోరణులతో ఏకస్వామ్య విధానాలకి వంతపాడటం కాదు. అందుకోసం ఇలాటి ఎన్నో ‘కదలిక’లు అవసరం!

యలవర్తి నవీన్ బాబు

ఈ క్రమంలో గుర్తుంచు కోవల్సిన మరో మహా వ్యక్తి, అమరుడు యలవర్తి నవీన్ బాబు. ఎక్కడో గుంటూరు జిల్లాలో పుట్టినప్పటికీ తన కుటుంబం పశ్చిమ గోదావరి జిల్లా విజయిరాయికి వలస వచ్చింది. జె. ఎన్. యు. లో ప్రజాసంఘాల్లో భాగమైన నవీన్ విద్యార్థి దశలోనే అసాధారణ పరిణితి చెంది తెలుగులో, ఆంగ్లంలో పత్రికలు నడిపాడు. జాతుల సమస్య కోసం అంతర్జాతీయ స్థాయిలో అతడు కృషి చేసి ఏర్పాటు చేసిన సమావేశం అద్భుతం అంటారు. ఇందుకోసం కాదు ఆయన్ని ఇక్కడ ప్రస్తావిస్తోంది. “భారతీయ సామాజిక వ్యవస్థలో కులం : ఒక రాజకీయ ఆర్థిక విశ్లేషణ (political economy of caste in Indian social formation) పేరిట అతడు ఎం. ఫిల్ థీసిస్ కోసం చేసిన పరిశోధన (వర్ణం నుండి కులం దాకా అని తెలుగులో పుస్తకం గా కూడా వచ్చింది.) నిజంగా విస్మరించబడిన ఒక బుద్దిజీవి మేధో సాధన. తదనంతరం నవీన్ తూ.గో. జిల్లాలో జరిగిన ఒక ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. వ్యవస్థలోని అసమానతల్ని అధ్యయనం చేసేవారు, కులనిర్మూలన కోరుకునే వారూ తప్పక తెల్సుకోవాల్సిన వ్యక్తి అతడు!

కదలిక ప్రారంభోత్సవ సభలో ప్రసంగిస్తున్న గౌరవ్

కులతత్వం మీద, మతోన్మాదం మీద, ఆధిపత్య ధోరణుల మీదా ఎక్కుపెట్టబడిన ఈ “కదలిక” ఒక రకంగా చిరకాల మిత్రులు, పెద్దలు గోఖలే గారి మానసపుత్రిక (Brain Child). ఎన్నో రోజుల నుండి ఈ విధమైన  సంస్థ గురించి ఆయన నాతో చర్చిస్తూ వస్తున్నారు. సుమారు 80 ఏళ్ళ వయసులో సమాజ హితం కోసం ఆయన పడుతున్న తపన వ్యక్తిగతంగా నన్నే కాదు, నా వంటి ఎంతో మందిని కదిలించింది. ఆ ఫలితమే ఇక్కడీ ప్రాంగణంలో అనేకానేక స్రవంతులకు చెందిన ఇంతమంది ఒక మంచి వేదిక ను బలపరచాలనే సదుద్దేశంతో ఒక్క దరికి చేరడం కనిపిస్తోంది. ఇది చిన్న విషయం కాదు. సమాజ పురోగతి కోసం ముందడుగు వేసిన కదలిక మున్ముందు మరింత పురోగ మించాలనీ, నిర్మాణాత్మక ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక వేదికగా ఎదగాలని మనస్పూర్తిగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఇక ఆపుతున్నాను!

కదలిక ప్రారంభోత్సవ సభలో సభికులు

(ఆగష్టు 20, ఆదివారం ప.గో. జిల్లా నర్సాపురంలో డా.నరేంద్ర దభోల్కర్ 10వ వర్ధంతి సందర్భంగా జరిగిన ‘కదలిక’ సంస్థ ప్రారంభ సమావేశంలో సంచాలకునిగా నా ప్రసంగపాఠం కాస్త ఆలస్యంగా ఇలా…)

గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles