Thursday, December 26, 2024

కబంధుని వధ, విమోచన

రామాయణమ్ 91

అవి కబంధ హస్తాలు!

ఒక్కసారి వాటిలో చిక్కితే ఇక అంతే సంగతులు.

అలాంటి కబంధుడి హస్తాలలో చిక్కి నిట్టూర్పులు విడుస్తూ,

‘‘లక్ష్మణా! చూడు విధి ఎంత చిత్రమైనదో!  ఒక కష్టము మీద మరియొక కష్టము వచ్చిపడుతున్నది. సీత లభించకపోగా మన ప్రాణాలే పోయే పరిస్థితి దాపురించినది మనకు. కాలము చాలా బలమైనది సుమా. మహా శూరులూ, వీరాధివీరులు, బలవంతులు, వివిధ శస్త్రాస్త్ర నైపుణ్యము కలవారందరూ కూడా కాలము దాపురించగానే ఇసుకతో కట్టిన అడ్డకట్టల వలే కూలి పోవలసినదే’’ అని పలుకుతూ శ్రీరాముడు తన మనస్సులో అప్పటికప్పుడు ఒక స్థిర నిర్ణయము తీసుకొన్నాడు.

Also read: కబంధుడి చేతచిక్కిన రామలక్ష్మణులు

‘‘ఏమి మాటలాడుకొంటున్నారు మీరు? నాకు చాలా ఆకలిగా ఉన్నది. నా చేతిలో చిక్కిన మీరు నోటిదాకా రాకుండా ఎలా ఉండగలరు? ఇదుగో ఇప్పుడే మిమ్ములను భక్షించివేస్తాను’’ అని హుంకరించాడు కబంధుడు.

రాముడి మనస్సులో చటుక్కున ఒక ఆలోచన వచ్చింది. ఆ రాక్షసుడి బలము ఎక్కడ ఉన్నదో ఆయనకు వెంటనే స్ఫురించింది.

ఆలోచన వచ్చినదే తడవు ‘‘లక్ష్మణా వీడి బలమంతా వీడి బాహువులలోనే ఉన్నది. వెంటనే వీడి బాహువులను నరికి వేద్దామని’’ చెపుతూ చెపుతూనే ఇరువురూ కూడబలుక్కొని క్షణమాలస్యము చేయకుండావాడి బాహువులను భుజముల దగ్గర వరకు నరికివేశారు.

Also read: సీతాపహరణ గాథ తెలిపి మరణించిన జటాయువుకు అంత్యక్రియలు

రక్తప్రవాహములో శరీరము తడిసి ముద్ద అయిపోయి దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ కబంధుడు, ఖండించబడిన తన బాహువులను చూసుకుంటూ  వారిరువురినీ చూస్తూ ‘‘మీరెవరు?’’ అని దీనముగా ప్రశ్నించాడు.

అప్పుడు వాడిని చూసి లక్ష్మణుడు ‘‘ఈయన ఇక్ష్వాకు కులతిలకుడు శ్రీరాముడు. ఈయన భార్యనెవరో రాక్షసుడు అపహరించగా ఆమెను వెదుకుతూ ఇచ్చటకు వచ్చినాము.’’

‘‘మరి నీవెవరవు? మొండెము ,చేతులు మాత్రమే కలిగి ఈ అరణ్యములో దోర్లుతున్నావు’’ అని ప్రశ్నించాడు  లక్ష్మణుడు.

 ఆ మాటలు విన్న కబంధుడికి ఇంద్రుడు పూర్వము పలికిన పలుకులు గుర్తుకు రాసాగాయి.

Also read: రాముడిని శాంతపరచడానికి లక్ష్మణుడి ప్రయత్నం

‘‘మహానుభావా, నీవు రాముడవేనని నాకు అర్ధమయ్యింది. నేను దనువు కుమారుడను. పూర్వము నేను యవ్వన గర్వముతో మదించి చేసిన పనులకు నాకీ రూపము ప్రాప్తించినది. ఈ రూపముతో నేను స్థూలశిరస్కుడు అనే మహర్షిని భయపెడదామని ప్రయత్నించి ఆయన శాపానికి గురి అయినాను. ఇంద్రుడి మీదకు యుద్ధానికి పోగా ఆయన కోపించి వజ్రాయుధము దెబ్బతో నా శరీరానికి ఈ స్థితి కల్పించినాడు. నన్ను కరుణించమని ఆయనను ప్రార్ధించగా ,ఎప్పుడైతే నా బాహువులలో రాముడు చిక్కి వాటిని ఖండిస్తాడో అప్పుడే నాకు ముని శాప విమోచనము, ఈ రూపమునుండి విముక్తి కలిగి మరల స్వర్గ ప్రవేశానికి అర్హత లభిస్తుందని అనుగ్రహించాడు. అప్పటినుండి నా చేతులకు అందినంత మేర ఏ వస్తువునూ, జీవినీ విడిచిపెట్టకుండా దగ్గరకు లాగుకునే వాడిని. నీ కోసమే  అనుక్షణము ఎదురుచూసేవాడిని. ప్రతిక్షణము నీవే నా చేతిలో చిక్కినట్లుగా భావించేవాడిని. ఇన్నాళ్ళకు నా నిరీక్షణ ఫలించినది రామా’’ అని తన కధ తెలిపాడు కబంధుడు.

Also read: రామచంద్రుని వ్యధాభరితమైన క్రోధావేశం

‘‘రామా నా శరీరానికి దహన సంస్కారాలు సూర్యాస్తమయము లోపుగా చెయ్యండి. అప్పుడు నాకు నా దివ్యరూపము  తిరిగి లభిస్తుంది. అప్పుడు మాత్రమే నేను మీకు సహాయ పడగలను …అంతవరకు నాకు ఏ విషయము తెలియదు.’’

అతని మాటలు విన్న రామలక్ష్మణులు ఏనుగులచేత విరవబడిన కట్టెలు ఎండినవి సేకరించి, ఒక పెద్ద గొయ్యి తీసి అందులో వేసి వాటిపై కబంధుడి శరీరమునుంచి దహనముచేసారు.

ఆ చితి నుండి మహాబలవంతుడైన కబంధుడు దివ్యమైన వస్త్రాలతో, ఆభరణాలతో ప్రకాశిస్తూ పొగలేని అగ్నివలె పైకి లేచాడు.

దివ్యవిమానములో ఆకసమున నిల్చి ‘‘రామా, ప్రస్తుతము నీ దశ . అదేవిధమైన చెడుదశలో ఉండి బాధపడుతున్న ఒక మహా బలవంతుడైన వానితో నీవు స్నేహము చేసిన కానీ నీకు మేలు జరగదు. అటువంటి మిత్రుడొకరిని నీవు ప్రస్తుతము సంపాదించ వలసి ఉన్నది. మానవుడు లోకములో కార్యములు సాధించుటకు సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైదీభావము, సమాశ్రయము అను ఈ ఆరు ఉపాయములను అవలంబించవలెను. ప్రస్తుతము మీరు దుర్దశా ఫలములు అనుభవిస్తున్నారు. అందుకే నీకు భార్యా వియోగము కలిగినది.

‘‘రామా, సుగ్రీవుడు అనే వానరుడు ఒకడున్నాడు …….

Also read: సీతమ్మకోసం రామలక్ష్మణుల వెదుకులాట

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles