రామాయణమ్ –90
ఆ అరణ్యములో అడుగుతీసి అడుగువేసే సందు కూడా లేదు. చాలా దట్టముగా అల్లుకుపోయిన పొదరిండ్లు, మహా వృక్షాలూ, లతలతో అల్లుకుపోయిన దారులూ చాలా క్లిష్టమైన, దుర్గమమైన అరణ్యమది.
ఓపికగా దారులు చేసుకుంటూ ఏ ప్రమాదము ఎదురైనా దానిని కాచుకునే విధముగా ఆయుధాలతో సదా సన్నద్ధతో ఉండి దక్షిణ దిక్కుగా అడుగులు వేస్తున్నారు రామలక్ష్మణులిరువురూ.
Also read: సీతాపహరణ గాథ తెలిపి మరణించిన జటాయువుకు అంత్యక్రియలు
వెళ్లే మార్గములో కనపడ్డ ప్రతి పొదనీ ప్రతి గుహనీ సీతాదేవి కోసం గాలిస్తున్నారు. అప్పటికే వారు జనస్థానమునుండి మూడు క్రోసుల దూరము వచ్చేశారు.
అది క్రౌంచము అనే అరణ్య ప్రాంతము ..ఆ అరణ్యాన్ని దాటేసారిరువురూ.
మరల ఎత్తైన పర్వతములతో కూడిన ఇంకొక అటవీ ప్రాంతములో ప్రవేశించారు. అక్కడ ఒక పర్వతము మొదట్లో ఒక పెద్ద గుహ కనపడ్డది వారికి. ఆ గుహలో వారు సీతాదేవిని గురించి వెదుకబోగా ….పెద్ద ఆకారము, వికృతమైన ముఖము, వేలాడే బానపొట్ట, ఎత్తుపల్లాలతో కూడిన అవయవములు, విరబోసుకున్నజుట్టు, తీక్షణమైన కోరలు కలిగి భయంకరముగా ఉన్న ఒక రాక్షస స్త్రీ కనపడ్డది.
Also read: సీతాపహరణ గాథ తెలిపి మరణించిన జటాయువుకు అంత్యక్రియలు
ఆ స్త్రీ లక్ష్మణుని చూడగానే …‘‘రా ! సుందరా! నాతో రమింతువుగాని’’ అంటూ మీద మీదకు వచ్చి ఆయనను కౌగలించుకొని, ‘‘వీరుడా నా పేరు అయోముఖి. నీవే నా ప్రియుడవు. నాధుడవు’’ అంటూ కౌగిలి బిగించివేయసాగింది క్షణమాలస్యము చేయక లక్ష్మణుడు దాని ముక్కు చెవులు కోసి వేయగా అది వికృతముగా అరుస్తూ ,గావుకేకలు పెడుతూఅరణ్యములోనికి పారిపోయింది.
మరల ప్రయాణము సాగించారు ఇద్దరూ. కొంత దూరము ప్రయాణించిన తరువాత లక్ష్మణుడు అంజలి ఘటించి అన్నగారి తో ‘‘అన్నా, నా బాహువు ఎందుచేతనో మాటిమాటికీ అదురుతున్నది. మనస్సును ఎదో చెప్పరాని దిగులు ఆవరిస్తున్నది. అరిష్ట సూచకములైన అపశకునములు కనపడుతున్నవి. రామా! మనకేదో ఆపద రాబోతున్నట్లుగా ఉన్నది. అది ఎదుర్కొనుటకు సిద్దముగా నుండుము’’ అని పలికాడు.
Also read: రామచంద్రుని వ్యధాభరితమైన క్రోధావేశం
ఇంతలో ఒక భయంకరమైన పక్షికూత విన్నాడు. అది వంచులకము అనే పక్షిది. ఆ కూతను విశ్లేషణ చేసి, ‘‘ఇదుగో ఈ పక్షి కూత రాబోవు యుద్ధములో జయము మనదే అని తెలియచేయుచున్నది మనము యుద్ధ సన్నద్దులమై ఉండవలెను’’ అని మాట్లాడుకుంటూ నడక సాగిస్తున్నారు.
నడుస్తున్న వారికి ఎక్కడనుండో అరణ్యములోని చెట్లనన్నింటినీ విరిచివేస్తున్నట్లుగా ఒక మహాశబ్దము వినపడ్డది. ఆ వనమంతా పెనుగాలితో నిండిపోయింది. ఎక్కడ నుండి వచ్చినది ఈ శబ్దము? రామ లక్ష్మణులు నలుదిక్కులా పరికించి చూడగా ఒక పొదలో పెద్ద శరీరము, విశాలమైన పొట్ట ఉన్న రాక్షసుడు కనపడ్డాడు. ఆ రాక్షసుడి పేరు కబంధుడు. అతని దేహము చాలా చిత్రముగా ఉన్నది. అతనికి కంఠము కానీ శిరస్సు కానీ లేవు అతని ముఖము అతని పొట్టలోనికి ఉండి, వక్షస్థలము మీదనే కనులు, నోరు, నాసిక అమరి ఉండి, పచ్చని గుడ్లతో వింత గొలిపే కనురెప్పలతో, పెద్దగుహ వంటి నోటిలో కోరలు కలిగిఉండి, ఆమడ పొడవున్న దీర్ఘమైన బాహువులతో మహా భయంకరముగా చూపరుల గుండెలు బెదిరి చెదిరి పోయేలా ఉన్నాడు. వాడి నోటి నుండి వచ్చే ధ్వని పెద్ద ఉరుములాగా ఉన్నది. వాడు ఆ సమయములో ఎలుగుబంట్లను, సింహాలను, ఏనుగులను భక్షిస్తూ కనపడ్డాడు వారిరువురికీ. వాడి పొడవైన చేతులను అరణ్యములోనికి పంపి వాటి సహాయముతో అన్ని రకముల పెద్దపెద్ద జంతువులను తనవైపుకు లాగుకొంటున్నాడు. వాడి చేతులు రామలక్ష్మణులున్న వైపునకు రాసాగినవి .ఒకే సారి ఆ చేతులు వారిద్దరిని చుట్టుముట్టినవి. ఒక చేయి ఇద్దరినీ కలిపి తీసుకొని బంధించి గట్టిగా పట్టుకొన్నది. ఆ చేయిని నెమ్మదిగా తనవైపుకు లాగుకుంటున్నాడు కబంధుడు. ఆ హస్తాల నుండి తప్పించుకొనే మార్గము లేక అందులో చిక్కుకొనిపోయి వానిచేత లాగబడి, లొంగిపోయి రాక్షసుని వద్దకు చేర్చబడ్డారు రామ లక్ష్మణులిద్దరూ.
Also read: సీతమ్మకోసం రామలక్ష్మణుల వెదుకులాట
ఆ స్థితిలో కూడా రాముడు నిబ్బరముగా ఉన్నాడు. కానీ లక్ష్మణుడు మాత్రము ధైర్యము కోల్పోయి వ్యధ చెంది, ‘‘అన్నా నేనొక్కడినీ వీడికి వశమైపోయి ఆహారమైపోతాను. నీవు నన్ను వీని వశము చేసి ఎదోవిధముగా తప్పించుకొనుము’’ అని పలికాడు.
అధైర్యముతో లక్ష్మణుడు అన్నమాటలు విని, ‘‘వీరుడా, నీవు భయపడకుము. నీ వంటి వాడు ఇలా విషాదమునకు గురి కావచ్చునా?’’ అని ధైర్య వచనాలు చెప్పి ఉత్తేజితుడిని చేశాడు.
వీరి మాటలు వింటున్న కబంధుడు వారిరువురినీ ‘‘మీరెవరు? ఎచటివారు?
ఈ అడవిలో విల్లమ్ములూ, ఖడ్గాలు ధరించి తిరుగుతూ నాకు ఆహారమై పోయినారు? ఎవరు మీరు?’’ అని అడిగాడు.
Also read: సీత క్షేమమేనా? రాముడిని మనసు అడుగుతున్న ప్రశ్న
వూటుకూరు జానకిరామారావు