Sunday, December 22, 2024

నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం జువ్వాడి రత్నాకర్ రావు

ఫిబ్రవరి 15 సోమవారం ధర్మపురి లో కాంస్య విగ్రహం ఆవిష్కరణ

మంత్రి కొప్పుల ఈశ్వర్ సొంత ఖర్చులతో తయారైన విగ్రహం

ఆరు దశాబ్దాలు రాజకీయ రంగంలో మచ్చలేని రాజకీయ నేతగా గుర్తింపు పొందారు.  సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఆయన అలుపెరుగని రాజకీయ ప్రయాణం కొనసాగించారు.  ఆయన వద్దకు అనేక అత్యున్నత పదవులు పరుగు పరుగున వచ్చాయి. అధికార దర్పంతో నియంతలా శాసించే అధికారం ఉన్న అన్ని వర్గాల ప్రజలకూ ఆయన ఆపద్బాంధవుడు అయ్యారు. అధికార అనధికార తుపాకుల నీడలో జీవనం కొనసాగించే మారుమూల గ్రామాల్లో సైతం ఆయన కలియతిరిగారు, బడుగు బలహీనవర్గాలకు తాగు సాగు నీరు కూడు, గూడు కల్పన  ఆయన లక్ష్యం, ఆశయం, తపన. అది చూసి నక్సలైట్  వర్గాలు సైతం ఆయన దారికి అడ్డు రాలేదు అడ్డంకులు సృష్టించ లేదు.  తన చివరి శ్వాస వరకు ప్రజా సంక్షేమం కోసం పరితపించాడు.  ఆయనే స్వర్గీయ మాజీ దేవాదాయ శాఖ మంత్రి  జువ్వాడి రత్నాకర్ రావు.  రాజకీయాలకతీతంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు వ్యక్తిగతంగా లక్షలాది రూపాయల వ్యయంతో  విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాక  విగ్రహ ప్రతిష్టాపన జరిగే  ప్రాంతాన్ని పచ్చిక బయళ్లతో, పూల చెట్లతో అలంకరించారు. ధర్మపురి క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఆ కాంస్య విగ్రహం సోమవారం ఆవిష్కరణ కానున్నది..

వివరాల్లోకి వెళితే !

రత్నాకర్ రావు ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో 1928 అక్టోబర్ 4న వెంకటేశ్వరరావు, రుక్కమ్మ  దంపతులకు జన్మించారు.  ఆయనకు ఆరుగురు తోబుట్టువులు, ముగ్గురు సోదరులు.  ఆయన 2020 మే  10న స్వర్గస్తులైనారు. రెండు పర్యాయములు తిమ్మాపూర్ గ్రామం సర్పంచ్ గా,  రెండుసార్లు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పాలకవర్గ అధ్యక్షుడిగా, 1989లో బుగ్గారం అసెంబ్లీకి స్వతంత్ర శాసనసభ్యుడిగా ,1999, 2004లో ఎమ్మెల్యేగా,  వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకవర్గ సభ్యులుగా పనిచేశారు.  ఆధునిక వ్యవసాయ పద్ధతుల అధ్యయనం కోసం రెండుసార్లు ఇజ్రాయిల్ కి ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన వెళ్లారు. వైయస్ రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ, స్టాంపులు శాఖల మంత్రిగా ఆయన పని చేశారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాల పాలక వర్గ అధ్యక్షుడిగా చివరి శ్వాస వరకు  కొనసాగారు.

తెలంగాణ వివక్షత పై గళమెత్తిన యోధుడు :

ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి లో పుష్కర స్నానాలు అంటూ వేల కోట్ల నిధులు కేటాయించడం ఆ ప్రాంతాన్ని  అభివృద్ధి పరచడం జరిగేది. . 1991 గోదావరి పుష్కరాల సందర్భంగా సీమాంధ్ర ప్రభుత్వం తో  తెలంగాణలో గోదావరి నది ఉందని ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి నిధులు ఇవ్వండి అంటూ స్వర్గీయ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావుతో కలిసి మంథని, కాళేశ్వరం, ధర్మపురి క్షేత్రాలకు 30 లక్షల నిధులు మంజూరు చేయించారు.

వైయస్ ప్రభుత్వ హయాంలో మండలానికో ప్రభుత్వ జూనియర్ కళాశాల ను మంజూరు చేయగా, నియోజకవర్గంలోని సారంగాపూర్ మండలం నైసర్గిక గంగా  బీర్పూర్ గుట్ట కింద 10  గ్రామాలు సారంగాపూర్ పరిధిలో10   ఉన్నాయి.  రెండు ప్రాంతాల ప్రజలు తమ  ప్రాంతానికే కళాశాల అంటూ పోటీ పడగా అప్పటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి ఒకే మండలానికి రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మంజూరు చేయించి ఉమ్మడి రాష్ట్రంలో చరిత్ర సృష్టించారు.

వైయస్ ప్రభుత్వ హయాంలో నక్సలైట్లకు ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరిగాయి.  అందులో అనేక డిమాండ్లతో  పాటు 1995 నవంబర్ 15న జీవితకాల శిక్ష పడిన నక్సలైట్లు బీర్పూర్ కు చెందిన సముద్రాల మల్లేశం, తుంగుర్ కు చెందిన శీలం రమేష్, ఆదిలాబాద్ కు చెందిన బండి ప్రకాష్ ను బేషరతుగా, రాజకీయ ఖైదీలుగా విడుదల చేయాలని అప్పుడు చర్చలలో పాల్గొన్న నక్సలైట్ నాయకులు అక్కిరాజు రామకృష్ణ, ఆజాద్ డిమాండ్ పెట్టారు. చర్చలు అర్ధాంతరంగా ముగిసిన అప్పటి మంత్రివర్గంలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రత్నాకర్ రావు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి ఈ నక్సలైట్ నాయకులను  రాజకీయ ఖైదీలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ద్వారా ప్రత్యేక జీవోను జారీ చేయించి విడుదల చేయించారు.

16 నవంబర్ 2006లో పత్రికా దినోత్సవం సందర్భంగా జర్నలిస్ట్ సంఘం  పక్షాన ” తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మీడియాలో వ్యక్తీకరణ “

అనే అంశంపై కరీంనగర్ ప్రెస్  భవన్లో సెమినార్ జరిగింది. ఈ సమావేశంలో ప్రొఫెసర్ స్వర్గీయ జయశంకర్ సార్ ఆచార్య స్వర్గీయ బియ్యాల జనార్దన్ రావు, ఆంధ్ర ప్రదేశ్ జాతీయ మీడియా ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ ,ప్రస్తుత తెలంగాణ మీడియా చైర్మన్ అల్లం నారాయణలు పాల్గొన్నారు.. ఈ సెమినార్ లో పాల్గొన్న రత్నాకర్ రావు తెలంగాణ ప్రాంతం పట్ల జరుగుతున్న వివక్షత, దోపిడికి గురి అవుతున్న తీరుతెన్నులు తదితర అంశాలను ఆయన వివరించడంతో ఆ సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన ప్రసంగంలో  రత్నాకర్ రావు కు   ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ మీకు నేను శిరస్సువంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను సర్ అంటూ తన ప్రసంగంలో పేర్కొనడం గమనార్హం.

దేవాదాయ శాఖ మంత్రిగా జువ్వాడి కొనసాగిన ఈ సమయంలో ధర్మపురి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ముప్పై రెండు గదుల నిర్మాణం శ్రీ నిధి నుంచి కోటి రూపాయలు మంజూరు చేస్తూ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన అన్నవరం, శ్రీశైలం, ద్వారకా తిరుమల, సింహాచలం, విజయవాడ కనకదుర్గ, భద్రాచలం, యాదగిరిగుట్ట ఆలయం నుంచి దాదాపు కోటి రూపాయలు  దేవాలయం నిధులను విరాళంగా సాధించిన ఘనత ఆయనది. రాష్ట్రంలో దూప దీప నైవేద్యం పథకానికి తను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి సంతకం ఆ ఫైలు పైనే ఆయన చేశారు.

జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహ ఏర్పాటు ఒక చారిత్రక అవసరం భావితరాల సమాజం ఈయన సేవలు గుర్తించడానికి, తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.  రాజకీయాలకతీతంగా విలువల తో కూడిన రాజకీయ నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యక్తిగతంగా తన సొంత డబ్బులతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం  ఒక చరిత్రగా చరిత్రపుటల్లో నిలిచిపోతుంది.

సాగు , తాగు  ప్రాజెక్టు పథకాలు, కోరుట్ల పట్టణంలో ఉమ్మడి రాష్ట్రంలో తొలి లి పశు  పశు వైద్య కళాశాల ఏర్పాటు తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలు పథకాలు ఇందిరమ్మ ఇళ్లు. నేటికీ జగిత్యాల జిల్లా లోని మారుమూల గ్రామాల్లో ప్రత్యక్షంగా అగుపిస్తాయి.నిస్వార్థ, నిజాయితీ రాజకీయాలకు, రాజకీయ విలువలకు  స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు  నిలువెత్తు నిదర్శనంగా అపర చాణక్యుడిగా రాజకీయ భీష్మాచార్యుడు చరిత్ర పుటలలో లో కొనసాగుతున్నారు కొనసాగుతారు కూడా  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత పొన్నాల ధ్వజం

Surendra Kumar
Surendra Kumar
Sakalam Correspondent, Dharmapuri

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles