- రెండు మాసాలలోగా నివేదిక సమర్పించాలని ఆదేశం
- సుప్రీంకోర్టుమాజీ న్యాయమూర్తికి ఐపీఎస్ అధికారి, నేషనల్ ఫ్లొరెన్సిక్ యూనివర్శిటీ సిబ్బంది సహకారం
పెగాసస్ నిఘాప్రక్రియ వ్యవహారంపై దర్యాప్తు జరిపే సంఘాన్ని సుప్రీంకోర్టు బుధవారంనాడు ప్రకటించింది. ఈ సంఘానికి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్. వి. రవీంద్రన్ నాయకత్వం వహిస్తారు. ఆయనకు ఒక ఐపీఎస్ అధికారి సహాయంగా ఉంటారు. నేషనల్ ప్లొరెన్సిక్ యూనివర్శిటీ సిబ్బంది సహకరిస్తుంది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ సూర్య కాంత్ లతో కూడిన ధర్మాసనం 27 అక్టోబర్ 2021 నాడు ప్రకటించింది.
పిటిషనర్లు లేవనెత్తిన అంశం ప్రాథమిక హక్కులకు సంబంధించిందనీ, వాటి జోలికి వెడితే భయానక పరిస్థితి (చిల్లింగ్ ఎఫెక్ట్) ఏర్పడుతుందనీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వానికి నోటీసలు ఇచ్చామనీ, చాలా అవకాశం ఇచ్చామనీ, అయినప్పటికీ విషయాన్ని సవిస్తరంగా వివరించకుండా చాలా క్లుప్తంగా అఫిడవిట్ సమర్పించి మన్నికున్నదనీ కోర్టు వ్యాఖ్యానించింది. జాతీయ భధ్రత పేరు మీద ప్రభుత్వం దర్యాప్తును అడ్డుకోజాలదనీ, జాతీయ భద్రత గురించి తాము ప్రశ్నించబోమనీ, ఆ అంశాన్ని పట్టించుకోమని చాలాసార్లు స్పష్టం చేశామనీ, అయినా సరే ప్రభుత్వం వివరాలు వెల్లడించడానికి సిద్ధంగా లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు మౌనసాక్షిగా మిగిలిపోజాలదనీ, ప్రాథమిక హక్కులను హరిస్తుంటే ప్రేక్షకపాత్ర పోషించజాలదనీ, అందుకే దర్యాప్తు సంఘాన్ని నియమించవలసి వచ్చిందనీ, ఇందుకు సైతం చాలా క్లిష్టమైన కసరత్తు చేయవలసి వచ్చిందనీ సుప్రీంకోర్టు అన్నది.
మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా, ద హిందూ బోర్డు చైర్మన్ ఎన్ రామ్, ఎడిటర్స్ గిల్డ్, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, సుప్రీంకోర్టు అడ్వకేటు ఎంఎల్ శర్మ, మరికొందరు జర్నలిస్టులు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్లలో ఎక్కువమంది అడిగింది ప్రభుత్వం ఈ సాఫ్ట్ వేర్ ను ప్రతిపక్ష నాయకులపైనా, జర్నలిస్టులపైనా ప్రయోగిస్తున్నదా అని. భావప్రకటన స్వేచ్ఛను హరించేందుకూ, అసమ్మతిని అణచివేసేందుకూ ప్రభుత్వం సెగాసస్ స్పైవేర్ ను వినియోగిస్తున్నదని వారు ఆరోపించారు.30 జులై 2021న జస్టిస్ రమణ నాయకత్వంలోని బెంచ్ పిటిషనర్ల తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ శిబల్ వాదనను ఆలకించింది. 5 ఆగస్టు 2021నాటి వాదనలలో కోర్టు పర్యవేక్షణలో ఈ అంశంపైన దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు.