Sunday, December 22, 2024

నాలుగు పాదాల మీద న్యాయం …

ఆధునిక బేతాళ కథలు-౩

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే   మౌనంగా  స్మశానం వైపు నడవసాగాడు . అప్పుడు శవంలోని భేతాళుడు – “రాజా కష్టపడితే పడ్డావు కానీ నీకు కష్టం తెలియకుండా ఉండటానికి “ప్రార్ధన” అన్న ఓ కథ చెబుతాను” అంటూ  చెప్పసాగాడు.

ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలు చాలా ఉన్నాయి. కమ్యూనిస్టు దేశాలు ఉన్నాయి రాచరిక దేశాలు చాలా తక్కువ. రాచరికం ఉన్న దేశాల్లో ఆ దేశం ఒకటి.ఆ దేశంలో ముప్పై సామంత రాజ్యాలు ఉన్నాయి.

Also read: ప్రార్ధన

సామంత రాజ్యం లో జాగీరులు ఉన్నాయి. ఆ జాగీరులను పాలించే వ్యక్తులని  జాగీర్దారులని అంటారు. సామంత రాజ్యాలని  సామంతరాజులు పరిపాలిస్తారు. ఈ సామంత రాజులు, జాగిర్దారులు  పన్నులు వసూలు చేసి దేశ రాజధానికి పంపిస్తారు. రాజు అనుమతి తీసుకొని సామంత రాజులు  కొన్ని శాసనాలు కూడా తయారుచేస్తారు. తమ  పరిధిలోని ప్రజల సమస్యలను వాళ్ళు పరిష్కరించేవారు. వివాదాలను కూడా పరిష్కరించేవారు. తప్పులు చేసిన వ్యక్తులని శిక్షించేవారు.  ఆ తీర్పుల పట్ల ఎవరికైనా అభ్యంతరాలుంటే రాజు దగ్గరికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు కానీ అలా దరఖాస్తుచేసుకున్న వ్యక్తుల సంఖ్య తక్కువ.

Also read: పరిమళం

ఆ దేశ రాజుని  ప్రజలు దైవంగా భావిస్తారు. రాజుకు ఏ చిన్న కష్టం వచ్చినా ప్రజలు బాధ పడతారు. రాజకుటుంబంలో ఎవరైనా మరణిస్తే సంతాప దినాలు ముగిసే వరకు ప్రజలు ఎలాంటి ఉత్సవాలు కూడా జరుపుకోరు. ఆధునిక కాలంలో ఒక దేశం లోని పరిస్థితి ఇది. తన దేశ ప్రజలు తనను దైవంగా భావించడం రాజుకు గొప్ప ఆనందంగా ఉండేది. తన అధికారానికి ముప్పు రాకుండా రాజు అప్పుడప్పుడు కొన్ని ప్రజాస్వామిక  చర్యలు చేపట్టేవాడు. ప్రపంచంలోని  ప్రజాస్వామ్య దేశాల పరిస్థితుల్ని జాగ్రత్తగా పరిశీలించేవాడు. అదేవిధంగా వివిధ దేశాల  ప్రముఖులు తన దేశాన్ని సందర్శించినప్పుడు రాజు ఆ దేశాలలోని పరిస్థితులను అడిగి తెలుసుకునేవాడు. ఆయా దేశాలలోని  న్యాయ వ్యవస్థల పనితీరును పరిశీలించిన రాజుకు కూడా తన దేశంలో కూడా అలాంటి న్యాయవ్యవస్థని ఏర్పాటు చేయాలని రాజుకి అనిపించింది.

శాసనాలు తయారు చేసే అధికారం, తీర్పులు చెప్పే అధికారం రెండూ తన దగ్గరే ఉండటం సరైంది కాదని రాజు అనుకున్నాడు. రాజు ఆలోచన మేరకు ఆ దేశంలో కొత్త న్యాయవ్యవస్థ ఏర్పాటు చేసారు. ఆ దేశానికంతటికీ  వర్తించే విధంగా దేశ రాజధానిలో ప్రజా కోర్టుని సామంత రాజ్యాలలో సామంత కోర్టులని జాగీర్లలో జాగీర్ కోర్టులని ఏర్పాటు చేశారు.

ప్రజాకోర్టులకి న్యాయమూర్తులని ఎంపిక చేసుకునే వెసులుబాటును ప్రజా కోర్టు న్యాయమూర్తులకి అప్పగించాడు రాజు. అదే విధంగా  సామంత కోర్టు న్యాయమూర్తులు కూడా తమ  తమ కోర్టులకి న్యాయమూర్తులని ఎంపిక చేసుకోవచ్చు కానీ వాటికి ప్రజా కోర్టు న్యాయమూర్తులు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాజు తన ఫర్మానా ద్వారా వారిని నియమిస్తాడు. ఇదీ ఫర్మానా సారాంశం.

అంతే కాదు.ప్రజా కోర్టుకి సామంత కోర్టులకి న్యాయమూర్తులని ఎంపిక చేసి తన ఆమోదానికి పంపించాలన్న నియమాన్ని మహా మంత్రి సలహామేరకు ఏర్పాటు చేశాడు రాజు. ఈ మార్పులు చేస్తూ రాజు  కొత్త ఫర్మానాని జారీ చేశాడు.ఈ కొత్త మార్పులు దేశ ప్రజలకి బాగా నచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రాజు తీసుకున్న ఈ నిర్ణయానికి అభినందనలు వచ్చాయి ఆ దేశం ప్రజాస్వామ్యం దిశగా ప్రయాణం చేసిందని ఇతర దేశాధినేతలు రాజుని అభినందించడం మొదలుపెట్టారు.

 రాజు అభీష్టం మేరకు మూడు అంచెల న్యాయవ్యవస్థ ఆ దేశంలో ఏర్పాటైంది. జాగీర్ కోర్టులు ఇచ్చిన తీర్పుపై ఆ సామంత కోర్టుకి ఆపై ప్రజాకోర్టుకి అప్పీలు చేసుకునే విధంగా వెసులుబాటును రాజు కల్పించాడు. జాగీర్ కోర్టుల న్యాయమూర్తులకి కాంపిటేటివ్ పరీక్షలు  పెట్టి ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసేవారు.

Also read: మర్యాద రామన్న

ఈ ప్రక్రియ క్రమపద్ధతిలో జరుగుతూ ఉండేది.కానీ ఈ మధ్య రెండు సంవత్సరాలుగా న్యాయమూర్తులఎంపిక జరగడం లేదు. కారణం ఏమై ఉంటుంది.సమాధానం తెలిసీ చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది ‘అన్నాడు బేతాళుడు

దానికి విక్రమార్కుడు-బేతాళా ! ఓ సామంత రాజ్యంలోని సామంత కోర్టుకి నాయకత్వం వహిస్తున్న ఓ ప్రధాన న్యాయమూర్తి అందరిలో కన్నా సీనియర్. అయితే  గతంలో ఆయన ఓ సామంతరాజుకి కష్టం కలిగించాడు. ఆ సామంతరాజు  ఇప్పుడు ఉన్న రాజుకి చాలా సన్నిహితుడు. అతను సీనియర్, అదే విధంగా  మంచి యోగ్యత వున్న న్యాయమూర్తి కాబట్టి అతన్ని  ప్రజా కోర్టుకి ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా ఎంపిక చేయాలని న్యాయసమూహంలోని ఒకరిద్దరు న్యాయమూర్తులు పట్టుబడుతున్నారు. అయితే  ఆయనను ప్రజాకోర్టు కి తీసుకొని రావడం న్యాయ సమూహంలోని మరి కొంత మంది న్యాయమూర్తులకి  ఇష్టం లేదు ఎందుకంటే రాజుకి  ఇష్టం లేదు. రాజుకి అసౌకర్యం,  అసంతృప్తి కలగజేయడం వాళ్ళకు ఇష్టం లేదు.అందుకని న్యాయ సమూహ సమావేశం జరగడం లేదు. ఆ న్యాయమూర్తిని బలపరుస్తున్న ప్రజాకోర్టులోని ఒకరిద్దరు న్యాయమూర్తులు పదవీ విరమణ చేసే వరకూ న్యాయమూర్తుల సమావేశం జరగకపోవచ్చు. ఆ విధంగా న్యాయం నాలుగు పాదాల మీద నదుస్తుంది. అంతే!” జవాబు చెప్పాడు విక్రమార్కుడు.

విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టు ఎక్కేసాడు.

           @@@@@@

Rajender Mangari
Rajender Mangari
మంగారి రాజేందర్ జింబో కి కవిత్వం,కథలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు . అందరికీ న్యాయం అందాలన్నది అయన అభిమతం . జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి,పదవీ విరమణ చేసినప్పటికీ రచయితగా తన సామాజిక బాధ్యత నిరంతరం అని విశ్వసించే వ్యక్తి. (మా వేములవాడ కథలు, జింబో కథలతో కథా సాహిత్యం మీద ఆయన చెరగని ముద్ర వేసారు. హాజిర్ హై అంటూ నేర న్యాయ వ్యవస్థ పై మరే కవీ రాయలేని కవిత్వం రాశారు. లోపలివర్షం,రెండక్షరాలు కవిత్వం సెంటిమెంట్, మానవ సంబంధాలు ప్రతిబింబిస్తే ,"చూస్తుండగానే "లో ఆధునిక జీవితం లోని సంక్లిష్టతని కవిత్వీకరించారు.)

Related Articles

2 COMMENTS

  1. నేటి పరిస్థితి కి అద్దం పట్టిన ట్లు….

    .నిజంగా నాలుగు పాదాలే……. అభినందనలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles