రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
మనిషి మనుగడకు మూలసూత్రం
అభయ జీవనానికి నాంది
సుఖమయ బ్రతుకు జీవనాడి
అనాదిగా ఆలోచన రూపంలో నిక్షిప్తం
సంప్రదాయం పేరిట వారసత్వం
మనుధర్మం అంటూ క్రోడీకరణ
మానవత్వాన్ని మతంలో కలగలపడం
ఆచరణకు దారి కల్పించడం.
మతాన్ని మూలకు నెట్టి
ధర్మ శాస్త్రాలను పక్కన పెట్టి
రాజ్యాగంలో పొందు పరిచాం
శిక్షా స్మృతి పేర పాటిస్తున్నాం.
దేవుడంటే భయం లేని నేడు
సైన్స్ నే నమ్ముకున్న నేడు
దొరికితేనే దొంగనే రోజులు పోయి
దొంగ అన్నవాడికే దొంగతనం అంటగట్టే
నేటి అతితెలివి సమాజంలో
న్యాయానికి చోటెక్కడ.
రాజ్యాలు పాలించే రాజులే దొంగలైన నాడు
చట్టబద్దంగా అందరిని దోచి కొందరికి పంచే నేడు
న్యాయ వాదులే న్యాయ రక్షకులపై దాడి చేసే నేడు
రక్షకులే నాయకుల బంట్లుగా మారి బక్షకులైన నేడు
రాజకీయ, ధన బలాలతో
న్యాయ దేవత కళ్లకు గంతలు కట్టిన నేడు
పెద్దలు నిర్దేశించిన న్యాయ సూత్రాలను
అంబేద్కర్ బృందం అక్షరీకరించిన రాజ్యాంగాన్ని
అంతరాత్మ ప్రభోదంతో కాపాడుతున్న ధర్మమూర్తుల సంరక్షణలో
గుడ్డిగానైనా మిగిలిన న్యాయ దేవతను
క్షణం క్షణం చిత్రహింసకు గురిచేయకుండా
న్యాయ వ్యవస్థను సంస్కరించి
స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం కంటే ముందే
రాజ్యాంగంలో చోటిచ్చిన న్యాయాన్ని
ఆచరణ యోగ్యం ఎప్పుడు చేద్దాం
మానవులమని, నాగరీకులమని
చెప్పుకునే అర్హత ఎప్పుడు సంపాదిద్దాం?