వసంత కోయిల తొలి వలపు గీతం ఆలపిస్తే
ఆహా ఓహో అంటూ తలలూపుతాం
నువ్వూ నేనూ…
మన ప్రక్కన్నే తప్పులు వెతుకుతూ సంగీతజ్ఞుడు
ఒకడు వెక్కసంతో!
పేదరాలి చిరిగిన చీర చూసి
అయ్యో పాపం అని ఆక్రోశిస్తాము
నువ్వు నేనూ ..
చిరుగులలో చిగురు పరువపు పొంకం వెతుకుతూ
కామ వికారంతో ఇంకొకడు!
రాముడు దుర్మార్గుడంటాడు ఒకడు,
యుధిష్టురుడు అబద్దాలు కోరంటాడు ఇంకొకడు!
దశకంథరునికి దయ ఎక్కువంటాడు ఒకడు,
దుర్యోధనుడు ధర్మాత్ముడంటాడు ఇంకోడు!
రాజ మార్గంపై నలుగురు నడుస్తుంటే
మురికి కాలువలో మునిగి తేలుతూ
మూఫై సూకరాలు!
ఎవరేమంటే నాకే…
నేనో జగన్నాథ రథాన్ని.
నా చక్రాల క్రింద నలుగక తప్పదు
పెళుసు పలక రాళ్లయినా, గట్టి గులకరాళ్లయినా!
నా ఉగ్రవేగచక్ర సముద్భూత ఝంఝానిలయ ప్రకోపానికి
కొట్టుకపోక తప్పదు …
తప్పుడుకూతల కొక్కిరాళ్లయినా;
నా గరుడ ధ్వజ పక్షోత్పన్న మహా ధ్వనికి
రెక్కలు తెగి రాలిపోక తప్పదు
కుతర్కపు వాదాల వాయసాలయినా!
(19-01-21)
Also read: నేను చెప్పని కతలు
Also read: నా ఇష్టాయిష్టాలు
Also read: మా రైతు
Also read: కొందరు అంతే
Also read: రాజకీయం