ఇద్దరు వేర్వేరు సంగీత నిష్ణాతులు కలిసి పోటా పోటీగా గానం చేయటం జుగల్బందీ. అందులో పోటీ, సహకారం, ఉత్సాహం కలబోసి ఉంటాయి. ఒక రకంగా ఇది ఒక కూడా భాగస్వామ్యం. అది శ్రావ్య సంగీతంలో కావచ్చు లేదా కఠిన రాజకీయాల్లో కావచ్చు లేదా అలరించే క్రికెట్ ఆటలోనూ కావచ్చు. ఇద్దరి మధ్య సయోధ్య, అవగాహన, పరస్పర గౌరవం,విశ్వాసం ఉన్నట్లైతే కచ్చితంగా వారి భాగస్వామ్యం అమోఘమైన ఫలితాలు సాధిస్తుంది. ఒకటికి ఒకటి కలిపితే మూడౌతుంది. లేకుంటే ఒకటి మాత్రమే మిగులుతుంది.
ఈ పుస్తకం ఆద్యంతం ఎన్నో ఆశ్చర్యకర సంఘటనలతో, సునిశిత విశ్లేషణతో సాగుతుంది. చదవడం ప్రారంభించాక ఆపడం కష్టమే. ఈ జుగల్బందీ 16 అధ్యాయాల ఆరోహణ అవరోహణలతో హృద్యమైన రాగాలను వినిపిస్తుంది.
అటల్ మరియు అద్వానీలలో ఎవరిది పైచేయి అనే సామాన్య ప్రశ్నకు అసామాన్యమైన జవాబు ఈ జుగల్బందీ. వీరి మధ్య ఉన్న సారూప్యతలను, వైరుధ్యాలను, మనస్తత్వాలను, విభిన్న కుటుంబ నేపథ్యాలను, పరస్పర ప్రేమను, స్పర్థను, వారి జీవన గమనాన్నిశోధించి సమర్పించిన ప్రామాణిక గ్రంథం ఇది.
ఇది చదవండి: నేతాజీ వారసత్వం కోసం మోదీ, దీదీ బలప్రదర్శన
వాజ్ పేయి లేని అద్వానీ దేవుడు లేని గుడి, అద్వానీ లేని వాజ్ పేయి గుడి లేని దేవుడు అనే స్ఫురణను కలిగిస్తుంది. రాజకీయాల్లో కొన్నిపరిస్థితులు కొత్త నాయకులను తెర మీదకు తెస్తే, ఈ ఇద్దరు విపరీత పరిస్థితుల్లో ఒకరి నొకరు తెర పైకి తెచ్చికొత్త ఒరవడి తెచ్చారు. వీరిద్దరిలో గల విచక్షణ, సిద్ధాంత నిబద్ధత వీరి బంధాన్ని తెగనీయక మానవ సహజమైన అహాన్నికూడా అధిగమించగలిగేలా చేసింది. వీరు నాణానికి ఒకరు బొమ్మ, ఒకరు బొరుసు. ఒకరు లేక మరొకరు చెల్లరు. వీరి జుగల్బందీ ఈనాటి బిజెపి మహాప్రస్థానానికి ఎలా బాటలు వేసింది అనే విషయాన్ని ప్రస్ఫుటంగా చూపిస్తుంది.
భారతదేశం – నరేంద్ర మోదీ నాయకత్వాన్ని చూడటానికి ముందు – 1924 నుంచి 2004 వరకు భారతీయ జనతా పార్టీ ఎలాంటి మలుపులు తిరుగుతూ వచ్చింది అన్నదే ఈ పుస్తకంలోని ప్రధానాంశం. భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం, దాని సిధ్ధాంత పునాదులు, పార్టీపై ఆర్ఎస్ఎస్ ప్రభావం, నాయకత్వ మార్పులు, ఒడిదుడుకులు, ప్రముఖ నాయకుల నేతృత్వ ధోరణులను చాలా విపులంగా చర్చించారు. ముఖ్యంగా కొన్ని క్లిష్ట అంశాలపై, సంధించిన ప్రశ్నలు, వివరణలు, వాటిని సమర్పించిన తీరు ఆసక్తికరంగా ఉంది.
ఇది చదవండి: శాస్త్రవేత్తల్లో జోష్ నింపిన ప్రధాని పర్యటన
ఉదా:
హిందూజాతీయవాదంఅంటేఏమిటి?
గాంధేయ సోషలిజంఏమిటి ? ఎందుకు?
అందరిని కలుపుకు వెళ్ళటం – ఉదారవాదం అనే సూత్రం బిజెపికి వర్తిస్తుందా ?
బిజెపి ఎందుకు గెలిచింది ?
ఇలాంటి ఎన్నోప్రశ్నలకు విద్యావేత్తలు, విమర్శకులు ఏమంటున్నారో తెలుపుతూ, ఒక అర్థవంతమైన చర్చకు బాటలువేసి పాఠకులను ఆలోచింపజేసే శైలి హత్తుకుంటుంది.
అలాగే ఈ జుగల్బందీ ఒక ఉత్కంఠ భరిత రచన అనడంలో సందేహం లేదు. వైవిధ్య సంఘటనలు, యాదృచ్ఛిక సన్నివేశాలైనా వాటిని చూపిన తీరు మనస్సులో నాటుకు పోయే రకంగా ఉన్నాయి.
క్రిందివాటినిఉదహరించవచ్చు.
“గుజరాత్లో పుట్టిన వల్లభాయ్ పటేల్ సమర్థమైన న్యాయవాదిగా గోద్రా జిల్లా కోర్టులో పనిచేసారు. వంద సంవత్సరాల తరువాత విచిత్రంగా అదే గోద్రాలో ప్రయాణీకులతో ఉన్న ఒక రైలు అగ్నిజ్వాలల్లో కాలిబూడిదైపోయిన సంఘటన వాజ్ పేయి, అద్వానీల రాజకీయ ఎదుగుదలకి బ్రేకులు వేసి నరేంద్రమోదీ, అమిత్ షాల నాయకత్వానికి కొత్త జీవితాన్నిఇచ్చింది “
అలాగే …
” ప్రతి భారతీయుడి ఆలోచనా విధానాల్లోనూ ఒక గాంధీ ఉంటాడు. ఒక మార్క్సిస్టు ఉంటాడు. ఇద్దరూ ఆధిపత్యం కోసం కొట్లాడుతుంటారు” అన్నచరిత్రకారుడు రామచంద్ర గుహ మాటలు …
ఇంకా….
“పారిశ్రామిక వేత్తలు అధికారపార్టీ జడిపిస్తే జడిసి పోయి ప్రతిపక్ష పార్టీలకు విరాళాలు ఇవ్వటంలో వెనకంజ వేస్తాయి. కాని జిన్నా మనుమడైన నస్లీవాడియా మాత్రం ఆ చీకటి రోజుల్లో (1975-77) కూడా జనసంఘ్ వెన్నంటే ఉన్నారు.”
అదేవిధంగా …
” భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ మహాసభకు దేశ విభజనకు కారకుడైన జిన్నా బంధం ఈ మహాసభలో ముఖ్యఅతిథి (చాగ్లు) ద్వారా ముడిపడి ఉండటం ఒక విచిత్రమైతే ఈ సభకు నిధులు సమకూర్చిన నస్లీవాడియా ద్వారా ముడిపడి ఉండడం ఒక విచిత్రం” ఇలాంటి ఎన్నో ఆసక్తి కలిగించే సన్నివేశాలు మనకు ఆవిష్కృతమౌతాయి.
ఇది చదవండి: అడ్వాణీకి మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
అంతేకాకుండా ..
మండల్, మందిర్, మార్కెట్లు బిజెపిని ఎలా ఇరకాటంలోకి నెట్టాయి ?
వాజ్ పేయి జీవితంలో రాజకుమారి కౌల్ పాత్ర ఎంత? ఆమే ఆయన హై కమాండా ?
అద్వానీ ఎలాంటి మచ్చ లేని వ్యక్తిగా పేరు పొందారు. అలాంటి ఆయన ఢిల్లీకి చెందిన ఎస్.కె. జైన్ ఇంటిపైన సి.బి.ఐ చేసిన దాడిలో దొరికిన డైరీలో 60 లక్షలు తీసుకున్న వ్యక్తిగా అద్వానీ పేరుంది. ఎలా ?
ఇలాంటి సున్నితమైన విషయాలను చాలా నేర్పుతో స్పృశించారు..
ఈ పుస్తకం చదివే క్రమంలో
బుల్లెట్ల లాంటి వాక్యాలు మళ్లీ మళ్లీ చదివింపజేసి ఆలోచనల్లో పడవేస్తాయి. మచ్చుకు రెండు మాత్రం ….
“అన్నిరాజకీయజీవితాలు – మధ్యలో ఏవో కొన్ని ఆనందకరమైన మజిలీలు వస్తే తప్ప – చివరకు మిగిలేది వైఫల్యంలోనే”
“ఒక మహావృక్షం నేల కూలుతోందంటే దాని చుట్టూ నేలకంపించిపోతుంది. ఇది ప్రకృతి సహజం”
ఇక .. ఈ అనువాద రచయిత గురించి విశేషంగా చెప్పుకోవాలి.
వినయ్ సీతాపతి రాసిన జుగల్బందీ అనే ఆంగ్ల గ్రంథాన్నితెలుగులో వల్లీశ్వర్ గారు అదే పేరుతో అనువదించారు. ఇది స్వేచ్ఛానువాదం. ప్రతి వాక్యంలో వల్లీశ్వర్ గారు తన దైన శైలిలో కనిపిస్తారు. ఆయన చేసిన ఇతర అనువాదాలు నిప్పు లాంటి నిజం, నరసింహుడు, రిజర్వు బ్యాంకు రాతి గోడల వెనకాల చదివిన వారికి ఈ జుగల్బందీ కమ్మని భోజనం తరువాత సంగీతం విన్నట్టుగా ఉంటుంది. ఆయన రచనలు చదవడం ఇదే మొదటిదైతే ఆకలి గొన్న వాడికి పంచభక్ష్య పరమాన్నాలు దొరికినట్టుగా ఉంటుంది. వల్లీశ్వర్ గారికి పాఠకుల నాడి బాగా తెలుసు. గొప్ప తనం సరళతలో ఉంటుందంటారు. అది వారి వద్ద కావలసినంత ఉంది. నిజానికి ఈపుస్తక వస్తువు అంత సులభమైంది కాదు. కాని క్లిష్టమైన దానిని సులభం చేసి, అందంగా చెప్పడంలోనే వల్లీశ్వర్ గారి ప్రతిభ కనిపిస్తుంది.
మొత్తంగా బిజెపిని, ముఖ్యంగా వాజ్ పేయి, అద్వానీలను ఏ అద్దాలు పెట్టుకొని చూడక విశ్లేషణ చేసిన గొప్ప రచన ఇది.