ప్రపంచంలో నియంతృత్వానికీ, ప్రజాస్వామ్యానికీ మధ్య ఘర్షణ జరుగుతోంది. మన దేశంలో కూడా దాని ఉధృతి పెరుగుతోంది. రాజ్యాంగాన్ని రక్షించుకోవలసిన అవసరం మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. రాజ్యాంగం ఎంతమంచిదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే రాజ్యాంగం అమలు చెడుగానే ఉంటుందనీ, రాజ్యాంగం చెడ్డదైనా అమలు చేసేవారు మంచివారైతే రాజ్యాంగం వల్ల మంచి ఫలితాలే ఉంటాయనీ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ రాజ్యాంగాన్ని దేశానికి సమర్పించిన క్షణాలలోనే స్పష్టం చేశారు. మన రాజ్యాంగం మంచిదే. గొప్పగొప్పవారు రాజ్యాంగ నిర్మాణ సభ చర్చలో పాల్గొని అద్భుతమైన రాజ్యాంగాన్ని తయారు చేశారు. కానీ దాన్ని అమలు చేసేవారికి ఉద్దేశాలు మారుతున్నాయి.
ఈ ధోరణికి ఉపరాష్ట్రపతి ధన్ కడ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాలు చేసిన వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి. ఇటీవల అఖిల భారత సభాపతుల సమావేశంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్ వెలిబుచ్చిన అభిప్రాయాలూ, చేసిన వ్యాఖ్యలూ ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్నేళ్ళ కిందట నేషనల్ జుడిషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ (ఎన్ జేఏసీ) చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జనాదేశాన్నిధిక్కరించడమేననీ, పార్లమెంటు ప్రతిపత్తిపైన దారుణంగా రాజీపడటమేననీ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ కడ్ అన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన అధికారాల విభజనను సుప్రీంకోర్టు పాటించవలసిందేనని స్పీకర్ ఓంబిర్లా వ్యాఖ్యానించారు. వీరిద్దరూ ఈ విధంగా వ్యాఖ్యానించడం కేవలం వారి మనసులో మాట వెల్లడించడంగా భావించనక్కరలేదు. దీనిని ప్రధాని స్థాయి ఆలోచనగానే పరిగణించాలి. ఈ విషయంలో ఎవ్వరికీ సందేహం అక్కరలేదు. పశ్చిమబెంగాల్ గవర్నర్ గా మమతాదీదీని ముప్పుతిప్పలు పెట్టిన ధనకడ్ ను ఉపరాష్ట్రపతిని ఎందుకు చేశారో ఈ వ్యాఖ్యలూ, ప్రకటనలూ సూచిస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో మూడు విభాగాలను రాజ్యాంగం సృష్టించింది. మూడిటికీ మూడు రకాల విధులను నిర్దేశించింది. అవి శాసనవ్యవస్థ అంటే చట్టసభలూ (లెజిస్లేచర్), కార్యనిర్వాహక వ్యవస్థ (ఎగ్జిక్యుటివ్), న్యాయవ్యవస్థ (జుడీషియరీ). ఈ మూడూ స్వతంత్రంగా పని చేస్తూ, కొన్ని నియమాలకు ఐచ్ఛికంగా కట్టుబడి ఉండే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఉన్నత స్థానాలలో ఉన్న ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షడూ అయిన జగ్దీప్ ధన్ కడ్, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాలు శాసన వ్యవస్థకూ , కార్యనిర్వాహక వ్యవస్థకూ అనుగుణంగా న్యాయవ్యవస్థ నడుచుకోవాలని అంటున్నారు. ఇది రాజ్యాంగ నిర్మాతల అభీష్టానికి విరుద్ధమైనది.
వక్తలు ఇద్దరూ ఉన్నత స్థానాలలో ఉన్న పెద్దవారే కానీ వీరికంటే దేశం పెద్దది, రాజ్యాంగం పెద్దది. మూడు వ్యవస్థలకూ అధికారాలను పంచిన రాజ్యాంగమే బాధ్యతలనూ, పరిమితులనూ కూడా నిర్దేశించింది. వాటిని గమనంలో పెట్టుకోకుండా ఎవరు మాట్లాడినా పొరబాటే.
మన రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రాథమిక హక్కులు ప్రసాదించింది. వాటికి భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చునని చెప్పింది. న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశం లేకపోతే హక్కులను ప్రభుత్వాలు హరిస్తాయి. హక్కులకు ప్రమాదం వాటిల్లినప్పుడు న్యాయస్థానాలకు (సుప్రీంకోర్టు దాకా) వెళ్ళడానికి వీలు కల్పించేదే రాజ్యాంగం 32వ అధికరణ. 13(2) అధికరణ మరో హామీ ఇచ్చింది. ప్రాథమిక హక్కులకూ, రాజ్యాంగ స్వభావానికీ భంగం కలిగించే ఏ చట్టాన్నీ చట్టసభలు చేయకూడదు. అటువంటి చాట్టాలు చేసినట్లయితే అవి చెల్లనేరవు అని ఈ అధికరణ స్పష్టం చేస్తున్నది. 13(2)వ అధికరణను ఎనిమిదవ అధికరణగా రాజ్యాంగ నిర్మాణ సభలో సుదీర్ఘంగా మూడు రోజులపాటు (25,26,28 నవంబర్ 1948) చర్చించారని సోమవారం ముంబాయ్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో రాసిన వ్యాసంలో ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే తెలియజేశారు. అయితే, దీన్నికొంతవరకూ నీరు కార్చుతూ ఈ చట్టానికి 1971లో ఒక సవరణ తెచ్చారు. ఈ రాజ్యాంగానికి 368వ అధికరణ కింద చేసే సవరణలకు ఇది వర్తించదు అన్నది ఆ సవరణ తాత్పర్యం. అయితే న్యాయవ్యవస్థ ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసింది. అదేమంటే ప్రముఖమైన కేశవానందభారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం కేసులో తీర్పు ఇస్తూ 398 అధికరణ కింద చట్టాలను సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నదనీ, కానీ ఏ సవరణలైనా రాజ్యాంగ మౌలిక స్వభావానికి అనుగుణంగా ఉండాలే కానీ భిన్నంగా ఉండరాదని స్పష్టం చేసింది. రాజ్యాంగ మౌలిక స్వభావాలు ఏమిటి? చట్టపాలన హక్కు, ప్రాథమిక హక్కులు, న్యాయసమీక్ష, అధికారాల విభజన, స్వతంత్ర్య న్యాయవ్యవస్థ. వీటికి భిన్నంగా ఏ సవరణా జరగకూడదు. స్వతంత్ర్య న్యాయవ్యవస్థ అన్నారే కానీ శాసనవ్యవస్థకూ, కార్యనిర్వాహక వ్యవస్థకూ అనుగుణమైన న్యాయవ్యవస్థ అనలేదు. ఎన్ జేఏసీ చట్టం, దాని తర్వాత చేసిన చట్టం కూడా రాజ్యాంగస్వభావానికి విరుద్ధమైనవేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగం ఏమి ఆశించిందో, ఏమి ఆదేశించిందో అదే పని సుప్రీంకోర్టు చేసిందనడంలో సందేహం అక్కరలేదు.
భారత రాజ్యాంగంలో 141, 144 అధికరణలు న్యాయవ్యవస్థకు ప్రాణప్రదమైనవి. సుప్రీంకోర్టు ఆదేశాలు భారత దేశంలోని అన్ని న్యాయవ్యవస్థలకూ శిరోధార్యం అని 141వ అధికరణ స్పష్టం చేస్తున్నది. సర్వోన్నత న్యాయస్థానానికి (సుప్రీంకోర్టుకు) పౌర, న్యాయ వ్యవస్థలన్నీ చేదేడువాదోడుగా ఉండాలి అని 144వ అధికరణ నిర్దేశిస్తున్నది. అంటే అర్థం ఏమిటి? న్యాయవ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థకూ, శాసనవ్యవస్థకూ అనుగుణంగా ఉండమనా? కానే కాదు. రాజ్యాంగాన్నీ, దాని స్వభావాన్నీ రక్షించే బాధ్యత రాజ్యాంగం న్యాయవ్యవస్థపైన, ముఖ్యంగా సుప్రీంకోర్టు భుజస్కంధాలపైన పెట్టింది. ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు ఏ మాత్రం భంగం కలిగించడానికి వీలు లేదనీ, అటువంటి చట్టాలు చేయడం రాజ్యాంగ విరుద్ధమనీ రాజ్యాంగ నిర్మాతలు స్పష్టం చేశారు. రాజ్యాంగాన్నిఅంతిమంగా అన్వయించే అధికారం సుప్రీంకోర్టుకే ఉన్నది కనుక పార్లమెంటు ఆమోదించి, రాష్ట్రపతి అనుమతించిన చట్టాలను అవి ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవి అయితే అవి రాజ్యాంగానికి అనుగణమైనది కాదని ప్రకటించే బాధ్యత సర్వోన్నత న్యాయస్థానానిదే.
దేశవ్యాప్తంగా ఆనాడు ఉన్న మేధావుల్లో శిఖర సమానులు రాజ్యాంగ నిర్మాణ పరిషత్తు సభ్యులుగా ఉన్నారు. అన్ని అంశాలనూ కూలంకషంగా చర్చించారు. న్యాయవ్యవస్థ స్వేచ్ఛ గురించి సుదీర్ఘంగా, సవివరంగా సమాలోచన చేశారు. తుది ముసాయిదాలో 395 అధికరణలూ, ఎనిమిది షెడ్యూళ్ళూ ఉన్నాయి. 7,635 సవరణలు వచ్చాయి. సభలో ప్రవేశపెట్టిన సవరణలు 2,473. చివరలో అంబేడ్కర్ పైన చెప్పుకున్న వ్యాఖ్య చేశారు. కాలం వేగంగా మారిపోతోంది. సభ్యుల ఆలోచనా తీరు కూడా మారుతోంది. పాలకులకు ప్రజలంటే విసుగు పుడుతోంది. వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు కానీ అది ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వంగానే వ్యవహరిస్తుంది కానీ అబ్రహాంలింకన్ చెప్పినట్టు ప్రజల యొక్క, ప్రజల చేత ఏర్పాటు చేసిన ప్రభుత్వంలాగా పని చేయదు. (ప్రజాస్వామ్యం అంటే ప్రజలు, ప్రజల కోసం, ప్రజలతో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం అని అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ చెప్పారు). ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ అంబేడ్కర్ పైన చెప్పుకున్న వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం గాడి తప్పే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తూ అంబేడ్కర్ 25 నవంబర్ 1949న రాజ్యాంగ నిర్మాణ పరిషత్తులో చర్చకు స్వస్తి చెప్పారు. అంబేడ్కర్ చెప్పిన జోస్యం నిజమయ్యే ప్రమాదం ఉన్నదా? ఏమో. తెలియదు. లేకపోలేదు. రాజ్యాంగం గాడి తప్పిందా? తప్పుతున్నట్టే కనిపిస్తోంది. అధ్యక్ష తరహా పరిపాలన ప్రవేశపెట్టేందకు ప్రయత్నాలు ప్రారంభమైనాయా? మన ప్రజాస్వామ్యాన్నీ, మన రాజ్యాంగాన్నీ, మన న్యాయవ్యవస్థనూ కాపాడుకోవడానికి ప్రజలు నడుం బిగించవలసిన రోజు ఆసన్నమవుతోంది.