న్యాయస్థానాలు ప్రాంతీయ భాషల్లో తీర్పులు ఇవ్వడం ప్రశంసనీయమని, దీనివల్ల న్యాయవ్యవస్థ ప్రజలకు మరింత చేరువలోకి వస్తుందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. అదే సమయంలో అర్హులకు న్యాయవాదులు ఉచిత సేవలు అందించాలని, తాను న్యాయవాదిగా ఉచితంగా వాదించానని చెప్పారు. న్యాయం అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం నిరంతర ప్రక్రియ అని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో గురువారం జరిగిన రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో ఆయన అన్నారు. ఎదరువుతున్న సమస్యలన్నిటిని న్యాయవ్యవస్థ సమమర్థంగా అధిగమిస్తోందని అభినందించారు. కోవిడ్ సమయంలో ఈ-ఫైలింగ్, వీడియో కాన్ఫరెన్సుల వంటి సాంకేతికతను ఉపయోగించడం ప్రశంసనీయమని అన్నారు.
ఇతర దేశాలకు ఆధర్శం
కరోనా సంక్షోభ సమయంలోనూ న్యాయవ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ బోబ్డే చెప్పారు. ఈ విషయంలో ఇతర దేశాల కంటే ముందు, ఆదర్శంగా నిలిచామన్నారు. కాగా, పోగుపడిపోతున్న అప్పీళ్ల విచారణను వేగవంతం చేసేందుకు 15 మంది న్యాయమూర్తలతో దేశంలో నాలుగు మధ్యంతర న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ సూచించారు.
రాజ్యాంగం కాల పరీక్షకు తట్టుకుంటూ ప్రసాదించిన హక్కులకు భరోసా ఇవ్వడంలో న్యాయస్థానాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తమ స్వాగతోపన్యాసంలో అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ మైన న్యాయవ్యవస్థ ఇక్కడ ఉందని అన్నారు.