(‘JOY AND SORROW ‘ FROM ‘ THE PROPHET ‘ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
——————————–
అప్పుడు ఒక మహిళ ” మాకు ఆనందము మరియు దుఃఖముల గురించి చెప్పండి” అని అడిగింది.
ఆల్ ముస్తఫా ఇలా చెప్పాడు:
ముసుగు తీసిన నీ దుఃఖమే నీ ఆనందం.
నీలోని,
ఏ నూతి నుండి నీ ఆనంద బాష్పాలు పెల్లుబికి వస్తాయో
నీ దుఃఖాశృవులు కూడా అక్కడి నుండే వస్తాయి!
అదిగాక, మరి ఎలా ఉంటుంది ?
దుఃఖం నీలోకి తొలుచుకుంటూ పోయే కొద్దీ,
ఆనందం కూడా నీలో ద్విగుణీకృతమవుతుంది.
నీ మధుపాత్ర కుమ్మరి కొలిమిలో
కాల్చ బడినదే కదా!
నీ మనసుకు సాంత్వన చేకూర్చే వేణువు
కత్తితో రంధ్రాలు చేయబడినదే కదా!
నీవు ఆనంద పరవశుడవైనప్పుడు
నీ హృదయపు లోతుల్లోకి తొంగి చూసుకో!
ఏది నీకు దుఃఖాన్ని కలగజేసిందో
అదే ఆనందాన్నీ కలగజేస్తోంది
— అని తెలుసుకుంటావు!
నీవు దుఃఖభాజనుడివైనప్పుడు
నీ హృద్యంతరంగంలోకి తొంగి చూసుకో!
ఒకప్పుడు, నీకు ఆనందకరమైన దానికోసమే
ఇప్పుడు దుఃఖిస్తున్నావనే నిజాన్ని
తెలుసుకుంటావు!
మీలో కొందరు,
” విషాదం కన్నా ఆనందమే గొప్పది” అంటారు
మరికొందరు,
” కాదు. విషాదమే గొప్ప” అంటారు
కానీ, నా మాట ఏమిటంటే–
‘ రెండూ విడదీయరాని వే!‘ అని.
రెండూ కలిసే వస్తాయి.
‘ ఒకటి నీ ప్రాంగణంలో
నీతో ఒంటరిగా కూర్చుని ఉంటే
రెండోది నీ పడకపై విశ్రమిస్తుంది ‘
అని గుర్తుంచుకో!
నిజానికి నీవు,
దుఃఖానికి — ఆనందానికి మధ్య
త్రాసులా వేలాడ దీయ బడ్డావు.
నీవు శూన్య స్థితిలో ఉంటేనే
నిశ్చలంగా, నిలకడగా ఉంటావు!
నిధి సంరక్షకుడు వెండి బంగారాలు
తూయటానికి నిన్ను ఎత్తితే–
నీ దుఃఖానందాలు
ఎగుడుదిగుడులౌతాయి!
Also read: హింస నచణ —- ( ఒక) ధ్వంస రచన
Also read: కీచకుడు లేని “విరాట పర్వం”
Also read: ఎలుకా, పిల్లీ
Also read: రూత్ దొరసాని
Also read: శ్రమ