Sunday, December 22, 2024

కరోనా విపత్తులో జర్నలిస్టుల పాత్ర అమోఘం : కిషన్ రెడ్డి

కరోనా కష్టకాలంలో సమాచార సేకరణ కోసం  ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పాత్రికేయులను ఫ్రెంట్ లైన్ వారియర్స్ గా గుర్తించేలా కృషి చేస్తానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి  స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని టూరిజం ప్లాజా హోటల్ లో జరిగిన రెండు రోజుల ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో పాత్రికేయులు ఆస్పత్రుల్లోకి తనతో పాటుగా ఐసీయూ లోకి సమాచార సేకరణ కోసం వచ్చారని గుర్తు చేసుకున్నారు. దేశంలో అత్యధిక జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐజేయూ జాతీయ కార్యవర్గ  సమావేశంలో పాల్గొనే అవకాశం దక్కడం గర్వంగా ఉందన్నారు. ఈ సమావేశంలో జరిగిన  చర్చను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తింపు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా పెరగడంతో అసత్య ప్రచారాలు కూడా కొన్ని సందర్భాల్లో చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలను వార్తలుగానే రాయాలని విజ్ఞప్తి చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.

ఆం.ప్ర.ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నవరత్నాలు పథకం ద్వారా వివిధ వర్గాల సంక్షేమం ఎనలేని కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, జర్నలిస్టుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ శ్రీనాథ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ రావు, ఐజేయూ మాజీ అధ్యక్షులు ఎస్.ఎన్.సిన్హా, జాతీయ ప్రధాన కార్యదర్శి బల్విందర్ సింగ్ (జమ్ము) ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

     కోవిడ్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలి: ఐజేయూ

రెండు రోజుల పాటు హైదరాబాద్ లో జరిగిన ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశం పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించింది. దేశ వ్యాప్తంగా కోవిడ్ బారినపడి మృతి చెందిన దాదాపు 600 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.  ఈ ఏడాది వివిధ రాష్ట్రాల్లో హత్యలకు గురైన ఐదు జర్నలిస్టుల కుటుంబాలకు పరిహారం అందించాలని మరో తీర్మానంలో ఐజేయూ డిమాండ్ చేసింది. ప్రెస్ కౌన్సిల్ ఛైర్మెన్ జస్టీస్ సి.కె.ప్రసాద్ నియంతృత్వ, చట్ట వ్యతిరేక చర్యలను ఐజేయూ తీర్మానంలో తీవ్రంగా గర్హించింది. జాతీయ యూనియన్లకు 14వ కౌన్సిల్ లో ప్రాతినిధ్యం లేకుండా చేసిన జస్టీస్ ప్రసాద్ చర్యలపై న్యాయపోరాటాన్ని సాగించాలనే తీర్మానాన్ని ఆమోదించారు.

దేశంలో జర్నలిస్టులపై, మీడియా సంస్థలపై సంఘ వ్యతిరేక శక్తులు, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను సమావేశం తీవ్రంగా ఖండించింది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన మీడియా రంగాన్ని బలహీనపరిచే చర్యలకు స్వస్తి పలకాలని సమావేశం డిమాండ్ చేసింది. కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చేంత వరకు వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని కొనసాగించాలని సమావేశం డిమాండ్ చేసింది.

ప్రకటనలు సేకరించాల్సిందిగా టార్గెట్లు విధిస్తూ జర్నలిస్టులను వేధిస్తున్న యాజమాన్యాలు తమ వైఖరిని మార్చుకోవాలని ఐజేయూ కార్యవర్గ సమావేశం హెచ్చరించి. ఇటీవల మెదక్ జిల్లా నర్సాపూర్ లో విలేఖరి ప్రవీణ్ కుమార్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఐజేయూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి సదరు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖను ఐజేయూ డిమాండ్ చేసింది.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles