When pain drives its deadly screw into your veins, ripping open your petal-like skin, you will ‘see’ the angel of darkness who is darker than the darkness.
All the innocent oceans lining the earth, perhaps, take micro forms and flow softly into my body to sooth the pain; the pain smiles mischievously and digs deeper into my left foot.
‘The saga of pain’ అంటూ దేవిప్రియ గారు సెప్టెంబర్ 18న నాకు పంపించిన ఇంగ్లిష్ కవితలోని వాక్యాలివి. అమాయక సముద్రాలన్నీ సూక్ష్మ ప్రవాహాలుగా మారి సాంత్వన చేకూర్చుతుంటే, నొప్పి వెటకారంగా నవ్వుతూ మరింత లోతుకు దిగబడిందని రాసుకున్న ఆ వాక్యాలు చూడగానే నేను చెదిరిపోయాను.
జీవన సహచరి రాజ్యలక్ష్మిగారు వెళ్ళిపోయిన తరువాత దోసిళ్ల నిండా అనంతమైన ప్రేమను మోస్తూ ఆమె జ్ఞాపకాల మీద చల్లుకుంటూ కాలాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు దేవిప్రియ. ఆమె ఉన్నప్పుడే “ఒంటరి యిద్దరు” కవిత రాశారాయన. ఆమె వెళ్లిపోయాక మరీ ఒంటరైపోయారు.
నిజానికి, మనిషి ఎప్పుడూ ఒంటరి కానే కాదు. ఒంటరితనంలో, ఏకాంతంలో మనిషి, అజంతా చెప్పినట్లు మృత్యువుతో రహస్య సంభాషణ కొనసాగిస్తూనే ఉంటాడు. You will ‘see’ the angel of darkness who is darker than the darkness అని దేవిప్రియ అంటున్నది ఆ రహస్సంభాషణలోంచే కదా అని దిగులుపడిపోయి, ‘it is painful, following like a shadow that can be seen in the darkest nights too.’ అని బదులిచ్చాను లోతుల్లో కంపిస్తున్న ఒక personal toneతో. దానికి, ఆ కవి ఏమన్నాడో చూడండి. చీకటి శిలను శిల్పంగా చెక్కేవాడా… ఏ దృశ్యాలను ఆవిష్కరించుకుంటావో నీ ఇష్టమని కవ్విస్తూ, ‘You can chisel and sculpt images from the rocks of darkness. Pain is mine and the art is yours.’
కవిత్వమై జీవిస్తున్నవాడు మాత్రమే అలాంటి వాక్యాలకు జన్మనివ్వగలడు. ‘I can’t abandon poetry, to embrace gallery’ అని నిశ్చయముగ చెప్పగలిగన వాడికే ఆ లోతు తెలుస్తుంది. నిజమే కదా, బాధ అంతా ఆయనది, కళ-కవిత్వం అంతా ప్రజలది గత యాభయ్యేళ్లుగా… ఇంకా మున్ముందు కూడా.
My pain is mystical
It exists in non-existence
Plays ball with planets
Goes filling the vacuum in the Rigvedic
Rhyme of Nasadiya
అదే కవితలో మరో స్టాంజా. అక్కడ “ఉన్నదీ” లేదు. “లేనిదీ” లేదని మొదలైన నాసదీయ సూక్తంలో శూన్యంలో ఏ ఖాళీలను పూరిస్తుందో ఈ గాయం? ప్రజాకవులైనా, ఉద్యమ కవులైనా తమను తాము ప్రకృతిలో దర్శించుకోకుండా గొప్ప కవిత్వం రాయలేరు. తాను నమ్మిన ఉద్యమ కాంక్షను సజీవంగా అక్షరాల్లో మండిస్తూనే, సిద్ధాంతాల నుంచి కవికి అవసరమైన ఒక aesthetic distance పాటించిన సృజనశీలి దేవిప్రియ. Conscious rebel గా ఉంటూనే Unselfconscious humilityని ఈ మార్మిక కాస్మిక లోకాల ముంగిట ప్రదర్శిస్తాడు సవినయంగా.
‘బాల సరస్వతి
సౌమ్య కంఠ మురళిలోంచి
తేలుతూ వచ్చి రాలిన రంగుల రాగాల మీద
గద్దర్ కాలి గజ్జెలు ఆడిఆడి అలసిపోతాయి’ (అమ్మచెట్టు – వెదురుపాట).
ఈ fusion కవుల మీద, కవిత్వం మీద జెండాలు పాతే అహంకారాలకు అర్థం కాకపోవచ్చు. Multitudes in solitude అని Walt Whitman చేసిన ఆత్మగాన రహస్యాలు తెలిసిన వారికి బాగా అర్థమవుతుంది. వ్యక్తి జీవితంలోని అనంతానంత పార్శ్వాల స్పర్శను అనుభూతించాలనుకునే హృదయాలకు దేవిప్రియ యాభై ఏళ్లుగా ఇచ్చిన poetical contradictions పరిపూర్ణంగా, పరిరపూర్ణత్వంగా అర్థమవుతాయి.
కవులు ప్రేమిస్తారు
నిజానికి,
వాళ్ళకు చేతనైంది అదొక్కటే.
అని చెప్పిన దేవిప్రియ ప్రేమించడం కోసమే జీవితాన్ని ఖర్చు చేశారు. చివరి క్షణం దాకా మనుషుల్ని ప్రేమించిన క్షణాల్ని ఇంకా ఇంకా మూటగట్టుకుని వెళ్లిపోవాలనే పరితపించారు. ‘రహస్యంగా లోలోపల జరిగే అపురూప ప్రక్రియ’ను పిడికిట్లో పట్టి చూపేందుకే ప్రయత్నించారు. ఆయన సమూహంగా ఎంత విస్తరించారో, వైయక్తికంగా అంత లోతుకు ప్రయాణించారు.
‘చివరికి చిక్కింది జింక’ అనే కవితను ఆయన అక్టోబర్ 12న పంపించారు. దేవిప్రియ నుంచి నాకు అందిన చివరి కవిత అది. బహుశా అదే చివరిదేమో! కాకపోవచ్చు కూడా.
‘వాన కురిస్తే
నాలో కూడా కురిసేది
ఉరుము ఉరిమితే
నాలోపల కూడా ఉరిమేది
మెరుపు మెరుస్తే
నా లోపల కూడా మెరిసేది…
అపుడు నేను వేరు
తాను వేరు కానట్టుండేది
ఇపుడేమిటి ఇలా?’
సంధ్యా తీరాలలో ఎగసి పడుతున్న సందేహాలు బంధ విముక్తుడ్ని చేస్తున్నందుకేనా ఆయన ఆ కవితను ఇలా ముగించారు:
మిగిలిందేమున్నది ఇంక,
పులి నోటికి పూర్తిగా
చిక్కినట్టే ఉంది ఈ జింక!
కవిత్వాన్ని ఇలా జీవితంగా నిలబెట్టడం చివరి క్షణం దాకా… అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఊపిరి ఆగిపోతున్న క్షణాల్లో కూడా ఆయన కవిత్వాన్నే శ్వాసించారు. మృత్యు పరిష్వంగంలోనూ వాక్యాలుగా పెనవేసుకుపోతూ మురిసిపోయారు.
Pain is eternal
It has no beginning
And it has no end.
ఇక్కడ ఒక దేహం మాయమైన జాడలే తప్ప ఒక కవి చేజారిన దిగులేమీ లేదు. అయినా, నా భుజం మీద కవిత్వంలా చేయి వేసి… శ్రీ అని ఆప్యాయంగా పలకరించే ఆ ఆత్మిక స్పర్శను స్మరించుకున్నప్పుడల్లా..
ఎవరితోనూ పంచుకోలేని క్షణం ఒకటి
అనంతంలా వ్యాపిస్తున్నట్లు
ఏనాడూ ఎరగని కొత్త వ్యాకులత ఏదో తీగ సాగుతోంది…
ఏమిటో కనుకొలకుల్లో
రెండు అతిశీతల సూక్ష్మ బిందువులు (ఇం…కొకప్పుడు – శీతల బిందువులు)
(పసునూరు శ్రీధర్‌బాబు – సీనియర్ జర్నలిస్ట్)