Thursday, November 7, 2024

బుధజన బాంధవుడు బూదరాజు

నన్నయ, తిక్కన్న, యర్రాప్రగడ వంటి ఋషితుల్య మహాకవులకు, పోతన్న  వంటి పుణ్యకవితామూర్తులకు, శ్రీనాథకవి సార్వభౌమ, అల్లసాని పెద్దన వంటి రసప్రసిద్ధులకు, తిరుపతి వేంకటకవులు, కొప్పరపు కవులు వంటి అవధానకవి యుగపురుషులకు, విశ్వనాథ,జాషువా, శ్రీ శ్రీ వంటి వైతాళికులకు, అనంతామాత్యుడు, చిన్నయసూరి వంటి ఛందో వ్యాకరణ నిర్ణేతలకు ,టంగుటూరు ప్రకాశం పంతులు, కాశీనాథుని నాగేశ్వరావుపంతులు,  కొమర్రాజు లక్ష్మణరావు వంటి నవభారత నిర్మాతలకు మాత్రమే ఆయన  విధేయుడిగా ఉంటారు.

బుద్ధిజీవుల పట్ల విధేయత

ప్రతిభ,ప్రయోజనం,  ప్రవర్తనలతో పరమ ఆకర్షకులైన చారిత్రక పురుషులు ప్రాచీనులైనా, ఆధునికులైనా, నవ నవీనులైనా….ఆ  బుధజనులందరి పట్ల  విధేయుడుగా ఉంటారు. ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్నవారు, ఆయనతో జ్ఞానవ్యాపారం చేసినవారు కూడా ఆయనపట్ల అంతే  విధేయులుగా ఉంటారు. బుద్ధిజీవుల పట్ల విధేయత కల్గిన బుధజన విధేయుడు.ఆయన జీవన యానంలో సిద్ధులు, రససిద్ధులు,ప్రసిద్ధులు, బుద్ధులు, ప్రబుద్ధులు, బుద్ధిహీనులు, హీనబుద్ధులు  అందరూ తారసపడ్డారు…. చాలామంది పెద్దల జీవితాల్లాగానే. ప్రతిజన విధేయుడు కాడు,కేవలం బుధజన విధేయుడు బూదరాజు.  అంతేకాదు,  పరమ హాస్య,  చమత్కార భాషణా కోవిదుడు  కూడా. “మా వాడ్ని మీ దగ్గరకు పంపించా కదా ! వాడికి  ఏమైనా విద్యా బుద్ధులు వచ్చాయా? “అని ఒక ప్రసిద్ధ నాయకుడు బూదరాజుగారిని అడిగారు ఒక సందర్భంలో. దానికి బూదరాజుగారి స్పందన ఇలా ఉంది. ” వాడికి విద్య ఎలా ఉన్నా?  నా బుద్ధులన్నీ వచ్చేశాయి. రోజుకు 10ప్యాకెట్లు సిగరెట్లు తాగుతున్నాడు”.  అదీ వారి సరస వాక్ఝరి.

పద్యం కోసం పలవరింపు

 పైకి మాట ఘాటుగా ఉండి ఉండవచ్చు. కొట్టినట్టు నిర్మొహమాటంగా ఆ తీరు సాగవచ్చు. కానీ ఆయన హృదయం ఎరిగినవారికి “శిష్యవాత్సల్యంబు చెలువ తీరినమూర్తి”. చిన్నారి పొన్నారి చిరుతకూకటినాడే పద్యం కోసం పలవరించిన వ్యక్తి.రాధాకృష్ణగారి మాతామహులు పంగులూరివారు.సుప్రసిధ్ధ జంటకవులు కొప్పరపు సోదరకవులు వేటపాలెం, చీరాల ప్రాంతాలలో అవధాన, ఆశుకవిత్వ  సభలు చేసినప్పుడు పంగులూరివారింట్లో విడిది చేసేవారు. తెల్లవారుఝామున అన్నదమ్ములిద్దరూ భాగవత పద్యాలు చదువుతూ ఉండేవారు. అవి పోతనగారి పద్యాలు కావు. కొప్పరపువారి భాగవత పద్యాలు. ఈ విషయాలన్నీ తాతగారి నుండి విని, ఆ ప్రేరణతో  బూదరాజుగారు పద్యాలపట్ల ఆకర్షితులయ్యారు.  తిరుపతివేంకటకవుల ప్రభావం కూడా బూదరాజుపై చాలా ఎక్కువ.

ఆధునిక కవుల పట్ల ఆదరణ

సంప్రదాయ పద్యకవులను ఎంత ఆరాధించాడో, ఆధునిక కవిమూర్తులను అంతే ప్రేమించాడు. మహాకవి శ్రీ శ్రీ కవితా,జీవితాలను  అటు ఇంగ్లిష్ లోనూ, ఇటు తెలుగులోనూ కూడా  బూదరాజే రాశారు. కేంద్ర సాహిత్య అకాడెమీవారి కోరికపై “భారతీయ సాహిత్య నిర్మాతలు” అనే శీర్షిక కోసం ఆయన రాసిన పుస్తకాలు శ్రీ శ్రీ గురించి తెలుసుకోడానికి పరమ ప్రామాణికాలు. గ్రంథాలయ  ఉద్యమానికి పూనిక, ఏలిక,  విజ్ఞాన సర్వస్వం నిర్మాత, చారిత్రక పురుషుడు కొమర్రాజు లక్ష్మణరావుపై కూడా సాధికారికమైన రచన చేసినవారు రాధాకృష్ణ. ఇది కూడా  కేంద్ర సాహిత్య అకాడెమి ప్రచురణ. పాత్రికేయ రంగంలో ఉన్న వారికి పాత్రికేయ గురువు, భాషా శాస్త్రవేత్తలకు గురుపండితుడు, చరిత్ర, సాహిత్య పరిశోధకులకు మార్గదర్శి. పుస్తకప్రియులకు, భాషా ప్రేమికులకు తలలో నాలుక. సాహిత్యం, చరిత్ర, భాషాశాస్త్రం, పరిశోధన, జర్నలిజం.. ఇలా అనేక రంగాలకు వెలుగుదివ్వె బూదరాజు. పట్టుదలే ఆయనకు ఇవన్నీ నేర్పింది. ప్రతిభే ఆయనకు ఇవన్నీ చేర్చింది.

అర్భకంగా కనిపించే అగస్త్యుడు

పైకి అర్భకంగా కనిపించినా, లోపల  అగస్త్యుడు.నువ్వు తెలుగు పంతులివి, నీకు ఇంగ్లీష్ ఎందుకు? అని ఎవరో గేలి చేస్తే, ఇంగ్లిష్ భాష లోతులు చూశాడు. అకాడెమీలో పుస్తకాలు వేసుకునేవాడికి నీకు జర్నలిజం ఏం తెలుసు?  అని మరొకరు తక్కువచేసి మాట్లాడితే, జర్నలిజాన్ని మధించి పాత్రికేయ గురువయ్యాడు. తన సహజ జ్ఞాన తృష్ణకు, ఇటువంటి ఉద్రేకపు మాటలు ఉత్ప్రేరకాలుగా పనిచేశాయి. ఆ ప్రేరణలు బూదరాజులోని ప్రతిభను తట్టిలేపాయి. కలం ఝుళిపించాడు. తెలుగు జగతికి బోలెడు మాటల మూటలు  దక్కాయి. మనం లాభ పడ్డాం. తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్ భాషల్లో సాధికారం అయన సంపద. 3 మే 1932న అప్పటి గుంటూరు, ఇప్పటి ప్రకాశం జిల్లా వేటపాలెంలో పుట్టారు. తెలుగు భాషాశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించాడు. కొంతకాలం చీరాల వి. ఆర్. ఎస్. &  వై. ఆర్. ఎన్ కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. తర్వాత, తెలుగు అకాడెమీలో చాలాకాలం సేవలు అందించారు.1988 ప్రాంతంలో  డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు.

‘ఈనాడు’ జర్నలిజం స్కూల్ లో సేవలు

“ఈనాడు స్కూల్ అఫ్ జర్నలిజం”లో ప్రిన్సిపాల్ గా దశాబ్దంపైగా ఉన్నారు. 6 జూన్ 2006న మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ  బోలెడు పుస్తకాలు బహుమతిగా ఇచ్చి, వెళ్ళిపోయాడు. 74 ఏళ్ళు జీవించాడు. టూకీగా చెప్పాలంటే ఇది. ఇక అయన గురించి చెప్పాల్సింది చాలా ఉంది.పరిశోధన(పి హెచ్ డి ) కోసం బూదరాజు రాధాకృష్ణగారు ఎంచుకున్న అంశం సామాన్యమైంది కాదు. చాలా క్లిష్టమైంది. “నన్నయ్య యుగానికి ముందున్న తెలుగు శాసనభాష తీరు తెన్నులు” పై పరిశోధనా పత్రం సమర్పించారు. ఇది ఒక మహాయజ్ఞం. క్రీస్తు శకం 575 వ సంవత్సరం నుండి 11 వ శతాబ్దం వరకూ అప్పటి వరకూ అందుబాటులో ఉన్న శాసనాలన్నీ మధించారు. ఆ 500 సంవత్సరాల్లో వచ్చిన  భాషా పరిణామాలన్నీ విస్తృతంగా అధ్యయనం చేశారు.

భాషను పోసన పట్టిన మేటి

వాక్యశిల్పం, పదాలు, పదబంధాలు, పేర్లు, జాతీయాలు, ఛందస్సు, వ్యాకరణం  అన్నింటినీ ఆపోసన పట్టారు. కొన్ని వందల, వేల శాసనాలు దుర్భిణీ బట్టి వెతికారు. పరిశోధన కోసం ఈ అంశం ఎంచుకోవడమే ఒక సాహస మయితే, అద్భుతమైన పరిశోధనా పత్రం సమర్పించి, పి హెచ్ డి పొంది, అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తెలుగు భాషా శాస్త్రాల పరిశోధనల్లో ఇది గొప్ప గ్రంథం. భాషా శాస్త్ర గుగ్గురువు ఆచార్య గంటి జోగిసోమయాజులు, అంతర్జాతీయ స్థాయి భాషాశాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి బూదరాజుగారికి ఆచార్యులు. అధ్యాపక వృత్తి తర్వాత ఎక్కువకాలం తెలుగు అకాడెమిలో సేవలు అందించారు. పరమ ఉదాత్తమైన, విశిష్టమైన  పుస్తకాలు వెలుగులోకి తెచ్చారు. ముఖ్యంగా మాండలీకాలపై విశేష కృషి చేశారు.అక్కడ పదవీ విరమణయిన తర్వాత ఈనాడు లో ఆయన చేసి కృషి సామాన్యమైంది కాదు.

పాత్రికేయ ప్రముఖులకు గురువు

జర్నలిజం స్కూల్ కు ప్రిన్సిపాల్ గా దశాబ్దంపైగా ఎందరికో శిక్షణ ఇచ్చారు. పాత్రికేయ వృత్తిలో మెరికల్లాంటి యోధులను తయారుచేశారు. ఈరోజు చాలా పత్రికలలో, న్యూస్ ఛానల్స్ లో, వివిధ మీడియాల్లో, వివిధ కమ్యూనికేషన్ విభాగాల్లో ఉన్నతమైన పదవుల్లో ఉన్న చాలామంది బూదరాజు శిష్యులే. ప్రత్యక్ష శిష్యులే కాక ఎందరో ఏకలవ్య శిష్యులు కూడా ఉన్నారు. ఆయన గొప్ప ఉపాధ్యాయులు. ఒక్కసారి   ఆ  పాఠం విన్నా, ఆ ఉపన్యాసం విన్నా అది నాటుకుపోతుంది. అరటి పండు వలిచి పెట్టినట్టు అంత సరళత, స్పష్టత ఆయన అధ్యాపనా శిల్పం. వారి రచనలు కూడా అంతే సరళ సౌందర్య శోభితాలు. బూదరాజు కదిలే జ్ఞానరథం. ఆయన పాఠం చెబుతుంటే, సమయం అట్టే తెలియకుండా గడిచిపోతుంది. చమత్కార, హాస్య ప్రవాహంగా సాగుతుంది. అంతటి అపారజ్ఞాన సంపదను సరళీకరణ చేసి పాఠం చెప్పేవారు. ఒక పక్క నవ్వులు పూయిస్తూ, ఇంకొక పక్క అనంతమైన జ్ఞానాన్ని విద్యార్థికి అందించేవారు.

విద్యార్థి స్థాయిని బట్టి బోధన

విద్యార్థి స్థాయిని ఇట్టే గ్రహించి, తన ఉపన్యాస శిల్పం మలుచుకునేవారు. విద్యార్థికి చాలా సులువుగా అర్ధమయ్యేట్టు బోధన సాగించేవారు. విద్యార్థి  జ్ఞానస్థాయిని పెంచడానికి అహరహం తపించేవారు. పత్రికలో రాసే భాషలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. చాదస్తపు రచనా బంధనాలను తెంచిపారేశారు. వార్తా రచనంటే కవితా సృష్టి కాదు. సమాచారం సామాన్యుడికి చేరవెయ్యడం. సంఘటనను కళ్లకు కట్టినట్టు పాఠకుడికి చూపించడం. సంపాదకీయమైనా, ప్రత్యేక వ్యాసమైనా (కాలమ్ ),  కథనమైనా జ్ఞానభాండాగారంగా, సమాచార సర్వస్వంగా, ఆలోచనా ప్రబోధకంగా , పరిష్కార మార్గంగా, రసరంజితంగా, సులభ, సుందరశైలిలో ఉండాలన్నది ఆయన సిద్ధాంతం. చదివిన వాడి జ్ఞాన చక్షువులు వికసించాలి. ఇవీ, పాత్రికేయ విద్యార్థులకు  బూదరాజు చూపించిన మార్గాలు. ఈనాడులో జర్నలిజం బోధనతో పాటు ఇంకా ఎన్నెన్నో చేశారు. వారం వారం పుస్తక సమీక్ష చేసేవారు.

పుణ్యభూమి ధర్మారావు

పుణ్యభూమి అనే శీర్షికతో  ఎడిటోరియల్ పేజీలో కాలమ్ రాసేవారు. ధర్మారావు అనే కలంపేరుతో ఆ రచనలు చేసేవారు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు నవల్లో ధర్మారావు, అనే పాత్ర ఉంటుంది. బహుశా ఇదే కలంపేరుగా బూదరాజు పెట్టుకొని ఉంటారు.  రసగుళికల్లాంటి పొలిటికల్ సెటైర్లు వేసేవారు. బూదరాజుగారి వ్యంగ్య రచనా విధానం హాస్య ప్రవాహం. అంతే, సమగ్ర సమాచార శోభితం కూడా. ఎన్నో పుస్తకాలు రాశారు. భాష, సాహిత్యం, పాత్రికేయం… ఇలా అనేక విషయాలపై ఆయన రచనలు పుస్తకాలుగా వచ్చాయి. జర్నలిజం పరిచయం, మంచి జర్నలిస్ట్ అవ్వాలంటే, ఈనాడు వ్యవహార కోశం మొదలైనవి పాత్రికేయులకు కరదీపికలు. తెలుగు సంగతులు, తెలుగు జాతీయాలు, మాటలూ -మార్పులూ, మరవరాని మాటలు, మాటలమూటలు, మాటల వాడుక -వాడుక మాటలు, ఆధునిక వ్యవహార కోశం…మొదలైన పుస్తకాలన్నీ  తెలుగుభాషా వికాసానికి సోపానాలు. అవధానాలలో సమస్యా పూరణలు, పురాతన నామకోశం, తెలుగు శాసనాలు, వ్యావహారిక

విన్నంత-కన్నంత

భాషా వికాసం వంటి గ్రంథాలు పండిత రంజికాలు.  ఆయన వాస్తు,  సాగరశాస్త్రాలు  కూడా వదలలేదు.”విన్నంత -కన్నంత” పేరుతో తన ఆత్మకథ కూడా రాశారు.ఆనాటి సామజిక పరిస్థితులు, సాంస్కృతిక,సాహిత్య విశేషాలు, తన జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు అందులో నిక్షిప్తం చేశారు. ఎలా రాయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా అనువాదం చెయ్యాలి తెలియాలంటే బూదరాజు తెలియాలి. అయన పుస్తకాలు చదవాలి. ఈ యాభైఏళ్ళ కాలంలో,  తెలుగు భాష,  సాహిత్యం, జర్నలిజంలో బూదరాజు రాధాకృష్ణ అగ్రశ్రేణి వ్యక్తి.  ఈ తెలుగు  కృషీవలుడి  జ్ఞాపకార్ధం తెలుగు ప్రభుత్వాలు   శాశ్వతమైన స్మృతిచిహ్నంగా  ఏదైనా చెయ్యాలి. కిరీటాలు, భుజకీర్తులు లేకపోయినా,   సుకవి జీవించు ప్రజల నాలుకలయందు, అని జాషువా అన్నట్లు, బూదరాజు సుకీర్తి అజరామరంగా వెలుగుతూనే ఉంటుంది……. తెలుగు ఉన్నంతకాలం…… ఈ బుధజన విధేయునికి వినయ వినమిత నమస్సులు సమర్పిస్తూ .

(ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్త, పాత్రికేయగురువు బూదరాజు రాధాకృష్ణగారి పుట్టినరోజు మే 3 వ తేదీ సందర్భంగా)

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles