- వివరాలు సేకరిస్తున్న నిఘా వర్గాలు !
జగిత్యాల జిల్లా కు చెందిన ఓ యువకుడి ఆచూకీ గత కొంత కాలంగా తెలియకపోవడంతో అతడు నిషేధిత నక్సల్స్ దళం లో చేరాడా ? లేక జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళా డా ? అనే వివరాలు పోలీసు నిఘా వర్గాలు సేకరిస్తున్నట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి.
ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి నేరెళ్ల గ్రామానికి చెందిన ఆ యువకుడు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజకీయ పార్టీ లోని ఓ వేదిక కార్యక్రమాల లో చురుకైన పాత్ర పోషించేవాడు అని, సాంకేతిక విద్యను కొంతమేరకు పూర్తిచేసి గత కొన్ని నెలలుగా అతడి ఆచూకి తెలియకపోవడంతో హైదరాబాద్ నుంచి పోలీస్ వర్గాలు నేరెళ్ల గ్రామంలో వాకబ్ చేసినట్టు తెలిసింది అతడి ప్రవర్తన, నడవడిక, జీవన విధానం, కుటుంబ నేపథ్యం, తదితర వివరాలు నిఘా వర్గాలతో పాటు, జిల్లాకు చెందిన పోలీస్ విభాగం సైతం గ్రామంలో కొందరిని కలిసి వివరాలు సేకరించినట్లు సమాచారం.
Also Read: నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం జువ్వాడి రత్నాకర్ రావు
ఆ గ్రామంపై నిఘా ఇందుకే కావచ్చు ?
గతంలో నక్సలైట్ పార్టీ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య సమకాలికుడు ఆయన సహచరుడు, ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో,పోలీసు వర్గాలు యువకుడి ఆచూకీ పట్ల అప్రమత్తమైనట్లు చర్చ. గత రెండున్నర దశాబ్దాల క్రితం ఆ సహచరుడు ,ప్రభుత్వానికి లొంగి జన జీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నారు. దీనికితోడు ఇదే గ్రామానికి చెందిన మరో ఆరుగురు నక్సల్ పార్టీలో చేరి ప్రభుత్వానికి లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిశారు. ఒక్కరు మాత్రం ఇదే మండలం తుమ్మినాల నీలగిరి తోటలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు.
సంచలనాలకు కేరాఫ్ ఆ గ్రామం !!
గత రెండు దశాబ్దాల క్రితం నక్సల్ ఉద్యమం ఉదృతంగా కొనసాగుతున్న సమయంలో నేరెళ్ల బట్టపల్లి రోడ్డుపై నక్సల్స్ మందుపాతర పేల్చిన సంఘటనలు ముగ్గురు పోలీసులు మృతి చెందారు. ఇదే గ్రామానికి చెందిన ఓ రాజకీయ పార్టీ కార్యకర్తపై నక్సల్స్ పట్టపగలు గ్రామంలో కాల్పులు జరుపగా అతడికి బుల్లెట్ గాయాలు తగిలి ప్రాణాలతో బయటపడ్డాడు. 1994 జూలై మాసంలో రాత్రి ఈ గ్రామానికి చెందిన పోలీస్ ఉన్నతాధికారి ఇంటిని నక్సల్స్ పేల్చివేశారు. ఆ సమయంలో పోలీసులు రాకుండా ఇంటి సమీపాన సెంట్రీ లుగా నక్సల్ తుపాకులతో కాపలా కాశారు. అదే సమయం రాత్రి వేళ అనారోగ్య బారిన పడిన ఓ వ్యక్తిని జగిత్యాల ఆస్పత్రి నుంచి అద్దె జీపులు గ్రామానికి వస్తుండగా పోలీస్ జీప్ గా భావించి నక్సల్స్ జీపు పైకి కాల్పులు జరపగా జగిత్యాలకు చెందిన జీపు డ్రైవర్ ఎం డి ఫాహిం బుల్లెట్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే వాహనం లో ఉన్న వెలుగొండ గ్రామానికి చెందిన వ్యక్తి కడుపులోంచి బుల్లెట్ దూసుకుపోయింది.
Also Read: ” రాతి ” బతుకును తిరగరాసిన డాక్టర్ రాయలింగు !!
ఇదే గ్రామానికి ఆనుకొని ఉన్న 63 వ నెంబర్ జాతీయ రహదారి ఆక్సాయ్ పల్లె స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధం, బుగ్గారం స్టేజీ వద్ద నక్సల్స్ వాహనాలు నిలిపి సమావేశం ఏర్పాటు చేయడం జగిత్యాల నుంచి ధర్మపురి కి వస్తున్న అప్పటి ఎస్ ఐ మల్లారెడ్డి వాహనంపై కాల్పులు జరపడం పరస్పరంగా కాల్పులు జరిపి తృటిలో ఎస్ ఐ, పోలీసులు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డ విషయం ప్రస్తావనార్హం.దీనికితోడు ఇదే గ్రామ సమీపాన గల సాంబశివుని గుట్టపై ఉత్తర తెలంగాణ పీపుల్స్ వార్ కార్యదర్శి రజిత, ఉరఫ్ పద్మక్క పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందడం ఆమెతో పాటు మరో నలుగురు నక్సల్స్ జిల్లా కమిటీ సభ్యులు మృతి చెందారు.
ఈ సంచనల సంఘటనల నేపథ్యంలో పోలీసు నిఘా వర్గాలు, డేగ కన్నుతో ఈ గ్రామ పరిసర ప్రాంతాలపై నిఘా పెట్టినట్లు సమాచారం. దాదాపు గత రెండు దశాబ్దాల కాలంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు, జగిత్యాల జిల్లాలో నక్సల్స్ గాని , వారి కార్యకలాపాలు గాని ఉనికి గాని అగుపించడం లేదు. అయితే యువకుడి అదృశ్యం ఆచూకీ వివరాల కోసం పోలీస్ వర్గాలు అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నట్టు సమాచారం. ఆ యువకుడు దళం లో చేరాడా ? జీవనోపాధి కోసం ఇతర ప్రాంతానికి వెళ్ళాడా.? అనే విషయం మాత్రం ఖచ్చితంగా తెలియడం లేదు అనే చర్చ నెలకొంది.
Also Read: ధర్మపురి నరసింహుడి ఆలయంలో అపచారం