పెద్దపల్లి జిల్లా కుక్కల గూడూరు లో పుట్టి పెరిగి బతుకు తెరువు కోసం బొగ్గుబావుల్లో ఉద్యోగానికి చేరి నల్లనేల కే అంకితమైన జీవితం సుంకరి రాజయ్యది. రాజయ్య ను అందరూ కమ్యూనిస్టు రాజయ్య గా ఆప్యాయంగా పిలిచే వారు. మందమర్రి లోని కేకే5 ఎ గని నుంచి 2001 లో పదవీ విరమణ చేసిన రాజయ్య తన81వ ఏట మoదమర్రి లోని బస్టాండ్ ప్రాంతం లోని తన స్వంత ఇంటిలో శుక్రవారంనాడు గుండె పోటుతో మరణించారు.
రాజయ్య ఒక నిబద్ధతగల సీపీఐ ఏఐటీయూసీ నాయకుడు. పార్టీ లో రాష్ట్ర సమితి సభ్యులు గా ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ సహాయ కార్యదర్శి గా యూనియన్ లో బ్రాంచ్, కేంద్ర కమిటీ కార్యదర్శిగా పలు ప్రజా సంఘాల ఇంఛార్జి గా పనిచేశారు. స్థానిక భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పలు పోరాటాలలో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఒక హత్య కేసు తోపాటు పలు కేసులలో పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి జైలు జీవితం కూడా గడిపారు. ఉద్యోగంలో ఉన్నపుడు రిటైర్డ్ అయిన తరువాత కూడా ఎస్. రాజయ్య పార్టీ యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సీనియర్ నాయకుడిగా ఉద్యమ కారుడిగా ఆయనకు పేరుంది. నిరంతరం పార్టీ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించే వారు. సింగరేణి కార్మికుల యోగక్షేమాలు తెలుసుకొని పరిష్కరించేందుకు ముందుండేవారు.
సారా, మద్యం వ్యతిరేక పోరు లో ఆయన కీలక పాత్ర పోషించారు. కుక్కల గూడూరుకు చెందిన రాజయ్య ఆప్రాంత భూ పోరాటాలు, భూస్వాముల దాష్టికాల గురించి చెప్పేవారు. కమ్యూనిస్టులకు కష్టాలు తప్పవు అని ఎప్పుడు చెబుతుండేవారు. ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, జిల్లా సీపీఐ కార్యదర్శి కళావేణి శంకర్, ఇప్పకాయల లింగయ్య, బి.సుదర్శన్, ఆర్. వెంకన్న, ఎం.పౌలు, మాజీ ఎంపిపి వజిర్ సుల్తాన్, కాంగ్రెస్ నేత ఎస్. సుదర్శన్ తో పాటు పలువురు రాజయ్య భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ఎస్ రాజయ్య అమర్ రహే