- ఆయుధాలతో ప్రదర్శనకు ట్రంప్ అభిమానుల ప్రయత్నం
- ఏదైనా జరగవచ్చని వదంతులు
- దేశవ్యాప్తంగా అప్రమత్తం
అమెరికాకు కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ ఈ నెల 20వ తేదీ నాడు అధికార పీఠాన్ని అధిరోహించనున్నారు. బైడెన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దేశాధినేతలకు, పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ప్రమాణ స్వీకార రిహర్సల్ ప్రణాళిక అమలు చేశారు. రిహార్సల్ జరగడం అనేది ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ.
ఉద్రిక్త వాతావరణం
ప్రస్తుతం అమెరికాలో ఉద్రిక్తవాతావరణం నెలకొని వుంది. ఈ నెల 6వ తేదీ నాడు క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి జరిపినప్పటి నుంచీ నిఘా విభాగాలు మరింత అప్రమత్తమయ్యాయి.ఇప్పటికే రాజధాని వాషింగ్టన్ డిసిలో ఈ నెల 24వ తేదీ వరకూ ఎమర్జెన్సీని విధించారు. అమెరికా దేశ రాజధానితో పాటు 50 రాష్ట్రాల రాజధానుల్లో నిరసనకారులు ఆయుధాలతో అల్లర్లకు పాల్పడే అవకాశముందని ఫెడరల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బి ఐ) సమాచారాన్ని అందించింది. ఈ నేపథ్యంలో, ప్రమాణ స్వీకార రిహర్సల్ కార్యక్రమం అసలు జరుగుతుందా? వాయిదా వేస్తారా? అనే అనుమానాలు ఉన్నాయి.
Also Read : భద్రతా వలయంలో అమెరికా
ఎన్నడూ లేనంత కట్టుదిట్టంగా భత్రత
అమెరికాలో భద్రతను గతంలో ఎన్నడూ లేనంతగా కట్టుదిట్టం చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా రక్షణ విభాగం పెంటగాన్ 20వేలమంది నేషనల్ గార్డ్స్ ను ఆయుధాలతో క్యాపిటల్ భవనం చుట్టూ మోహరిస్తోంది. ఎఫ్ బి ఐ తో పాటు హోంల్యాండ్ సెక్యూరిటీ కూడా అల్లర్ల విషయంపై హెచ్చరిక చేసింది. రాళ్లు రువ్వడం దగ్గర నుంచి బాంబు పేలుళ్ల వరకూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలైనా జరిగే అవకాశాలు ఉన్నాయనే వార్తలతో అమెరికా వేడెక్కిపోయింది.
అన్ని రాష్ట్రాలలో ఎమర్జెన్సీ
ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల గవర్నర్లు ఎమర్జెన్సీని ప్రకటించారు. వాషింగ్టన్, మిషిగన్, వర్జీనియా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, అరిజోనా రాష్ట్రాల్లో ఎక్కువ అల్లర్లు జరిగే అవకాశముందని సమాచారం. ఇక్కడ ఫెడరల్ బలగాలు మోహరించాయి. అమెరికాలోని అతివాదులే దుశ్చర్యలకు పాలుపడతారని, రోడ్లపైకి వచ్చి ట్రంప్ కు మద్దతుగా ర్యాలీలు చేపడతారని సమాచారం. ఆయుధాలతో కూడిన ర్యాలీకి ఫార్ – రైట్ ఆన్ లైన్ ఫోరమ్ పిలుపుఇచ్చినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.
Also Read : బైడెన్ ప్రవేశించనున్న శ్వేతసౌధం
బైడెన్ ప్రమాణానికి ట్రంప్ హాజరు కారట
ఎన్నికల ప్రక్రియపై, ఫలితాలపై మొదటి నుంచీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ బైడెన్ ప్రమాణస్వీకారానికి హాజరుకానని ఇప్పటికే ప్రకటించారు. ట్రంప్ పై డెమోక్రట్లు పెట్టిన అభిశంసన తీర్మానం ఇంకా తేలాల్సి వుంది. జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ -అమెరికా బంధాలు మరింత పెరుగుతాయనే ఆశాభావంలో రెండు దేశాలూ ఉన్నాయి. ఈ దిశగా ఎన్నికల ప్రచార సమయంలోనే జో బైడెన్ స్పష్టం చేశారు. అమెరికాకు 46వ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టబోతున్న బైడెన్ తన బృందాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.
భారతీయ సంతతికి పెద్దపీట
బైడెన్ యంత్రాంగంలో ఇప్పటికే 20మంది భారత సంతతికి చెందిన అమెరికన్లకు చోటు దక్కింది. సాక్షాత్తు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భారత మూలాలు కలిగిన మహిళా నాయకురాలు. అమెరికా జనాభాలో భారత సంతతి వాటా స్వల్పమే అయినప్పటికీ, వారి పాత్ర, ప్రాముఖ్యత అనల్పం.మనవాళ్ళల్లో ఎక్కువమంది డెమోక్రాటిక్ పార్టీకి మద్దతుదారులే కావడం విశేషం. నిన్నటి ఎన్నికల్లోనూ ఇది మరొకసారి రుజువైంది. ఆర్ధికంగానూ మనవాళ్ళు అండగా నిలిచారు.
Also Read : అమెరికా రక్షణ వ్యవస్థ ఇంత బలహీనంగా ఉందా?
అమెరికా చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలు
అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ కూడా 20వ తేదీనాడు ప్రమాణస్వీకారం చేస్తారు. అమెరికా చరిత్రలోనే తొలి మహిళా అధ్యక్షురాలు కావడం, అందునా ఆసియన్ అమెరికన్ కావడం, భారతమూలాలు కలిగిఉండడం గొప్ప చారిత్రక సందర్భం. ఈ ఎంపికైన 20మందిలో 17మంది వైట్ హౌస్ లో శక్తివంతమైన పాత్ర పోషించనున్నారు.ఆమెరికాలో కొత్త ప్రభుత్వం రాక ఇరు దేశాలకు ఉభయతారకమై వర్ధిల్లుతుందని ఆకాంక్షిద్దాం. కొత్త సంవత్సరంలో సరికొత్త బంధాలు చివురిస్తాయని విశ్వసిద్దాం. అమెరికాలో శాంతి పునఃస్థాపన జరగాలని అభిలషిద్దాం.