Sunday, December 22, 2024

బైడెన్-కమలా హ్యరీస్ కి స్వాగతం

అమెరికాకు డోనాల్డ్ ట్రంప్ స్థానంలో,  కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ సింహాసనాన్ని అధీష్ఠించడం ఇక లాంఛనమేనని తేలిపోయింది. 2021జనవరి నుండి అధికారికంగా జో బైడెన్ పాలకపగ్గాలు చేపడతారు. ట్రంప్ శకం ఇక ముగిసినట్లేనని భావించాలి. ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ కు, కమలా హ్యారిస్ కు మన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు కూడా తెలిపారు. గతంలో భారత్ -అమెరికా సంబంధాలను బలోపేతం చెయ్యడంలో మీ పాత్ర అమూల్యమైందంటూ జో బైడెన్ కు మోదీ ప్రశంసా పూర్వకంగా నిన్నటి బంధాలను గుర్తు చేశారు.

బైడెన్ కు నరేంద్రమోదీ  స్నేహహస్తం, కమలా హ్యరీస్ విజయం పట్ల హర్షం

కలిసి పనిచేసేందుకు, ఇరు దేశాల బంధాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకూ ఎదురు చూస్తున్నామంటూ, నరేంద్ర మోదీ స్నేహ హస్తం సాచి, అభినందనలు తెలిపారు. కమలా హ్యారిస్ గెలుపును భారతీయ అమెరికన్లందరికీ గర్వకారణంగా మోదీ అభివర్ణించారు. భారత్ – అమెరికా బంధాలు మరింత బలపడతాయనే  విశ్వాసాన్ని  వ్యక్తం చేశారు. ఈ అభినందనలతో,  అమెరికా కొత్త అధినేతలతో,  భారత అధినేత  పలకరింపులు ప్రారంభమయ్యాయి. ఇక,  రెండు దేశాలూ కలిసి మరింత ముందుకు సాగడమే మిగిలివుంది. డోనాల్డ్ ట్రంప్ తో నరేంద్ర మోదీ వ్యక్తిగత స్నేహాన్ని కూడా ఏర్పరచుకున్నారు. ఆయన గెలుపునకు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. అందుకు “హౌడీ మోదీ” ఒక ఉదాహరణ. దాని తర్వాత కూడా,  ట్రంప్ ను భారత్ కు ఆహ్వానించి మహాసభ ఏర్పాటు చేశారు. అమెరికా ఎన్నికల్లో,  భారతీయ అమెరికన్ ఓటర్లపై దీని ప్రభావం ఎంతో కొంత ఉండే ఉంటుంది. ఆ ఎన్నికల ప్రహసనం ముగిసింది.

దేశాధినేతలతో మోదీ సాన్నిహిత్యం

నరేంద్ర మోదీ సహజంగానే వివిధ దేశాధినేతలతో ఒక స్నేహితుడుగా మెలుగుతారు. పేరు పెట్టి పలుకరిస్తారు. ఇది మోదీ స్టైల్ అనుకోవాలి. ఏ దేశ ప్రధానికైనా తమ దేశ ప్రయోజనాలే ప్రధానం. మన ప్రధానికి కూడా అంతే. వ్యవహార శైలి భిన్నం కావచ్చునేమో కానీ, ద్వైపాక్షిక బంధాలు మరింత బలోపేతం కావడం కోసం చాకచక్యంగా నెగ్గుకు రావడం రాజనీతిజ్ఞతలో భాగమే. రెండు దేశాల అధినేతలు ఇంతకాలం చేసింది అదే, చెయ్యాల్సింది కూడా అదే. జో బైడెన్ -కమలా హ్యారిస్ ద్వయం రాకతో,  రెండు దేశాల మధ్య బంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరుగుతాయనే విశ్వాసంతో అందరూ ఉన్నారు.

భారత్ పట్ల బైడెన్ సుహృద్భావం

జో బైడెన్ మొదటి నుండీ,భారత్ పట్ల  సుహృద్భావంతో  ప్రవర్తించిన వైఖరి ఒక ప్రధాన కారణం. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష పదవిలో కూర్చోబోవడం మరో ముఖ్య కారణం. భారతదేశ ప్రగతి ప్రయాణంలో అమెరికాతో సమున్నతమైన సంబంధాలను కలిగి ఉండడం, పెంచుకోవడం చారిత్రక అవసరం. ప్రపంచంలోని మరో బలమైన దేశం చైనా మనపై కోరలు చాచి కూర్చుంది. సరిహద్దు దేశాలతో పాటు, అమెరికాను కూడా మనకు దూరం చెయ్యాలనే దుష్ట ఆలోచనలతోనే ఉంది. అమెరికా-చైనాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ట్రంప్ పాలనా సమయంలో,  రెండు దేశాల మధ్య విభేదాలు బాగా పెరిగాయి. చైనా మరో ఐదేళ్లల్లో అమెరికాను కూడా మించి పోయే అవకాశాలు ఉన్నాయనే  వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు సాధ్యమన్నది ఎట్లాగూ కాలంలోనే తెలుస్తుంది.

చైనా-అమెరికా పోటీ కొనసాగుతుంది

అమెరికా ఇప్పటికీ అగ్రరాజ్యమే.ఆర్ధిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో అగ్ర స్థానంలో కూర్చొని ఉంది.తన స్థానాన్ని పదిలంగా కాపాడుకోవడం తనకు చారిత్రక అవసరం. ఈ నేపథ్యంలో, చైనా, అమెరికాల రేసు కొనసాగుతూనే ఉంటుంది. ఆట ఎవరు బాగా ఆడితే వారు ముందంజలో ఉంటారు. ఈ పోటీలో భారత్ తన ఉనికిని, తన ప్రగతిని, ప్రయోజనాలను చూసుకుంటూ  సాగడమే ముందున్న బాధ్యత. అమెరికా ఈ ఆటలో  ఇండియా సాయాన్ని తప్పక తీసుకుంటుంది. జనాభా పరంగా, సహజ వనరులు, మానవ వనరులు, మార్కెట్ పరంగా ఇండియా ప్రపంచంలోనే పెద్ద దేశం. ఈ వ్యాపార, వాణిజ్య సూత్రాలతో అమెరికా భారత్ వైపే ఉంటుంది.

క్వాడ్ దేశాలలో భారత్

ఇప్పటికే,  క్వాడ్ దేశాల్లో (క్వాడ్రీ లేటరల్ సెక్యూరిటీ డైలాగ్) అమెరికా, భారత్  సభ్యులుగా ఉన్నాయి.ఇందులో ఉన్న నాలుగు దేశాలకూ ఒకటే లక్ష్యం: చైనాను తొక్కివేయడం.ఈ వ్యూహంలో ఇప్పటి వరకూ ప్రధాన పాత్రదారి అమెరికా. చైనా విషయంలో ఆ పాత్ర అలాగే కొనసాగుతుందని భావించవచ్చు. జో బైడెన్ అధ్యక్షుడుగా వస్తే, చైనాతో అమెరికా బంధాలు పెరుగుతాయనే వార్తలు నిన్నటి వరకూ వినిపించాయి. షీ జిన్ పింగ్ తీరు తెలిసిన ఏ వ్యక్తీ  అతన్ని నమ్మరు. పైపెచ్చు, అమెరికాను దాటిపోవాలి, ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే సామ్రాజ్య కాంక్షతో రగిలి పోతున్న జిన్ పింగ్ కు జో బైడెన్ స్నేహ హస్తం అందిస్తాడా? అందిస్తే, అమెరికన్లు ఊరుకుంటారా?

అమెరికాకు బైడెన్ చెక్

మాటతీరులో , వ్యవహార శైలిలో ట్రంప్ లాగా మొరటుగా, మూర్ఖంగా ఉండకపోయినా, జో బైడెన్ తనదైన శైలిలో చైనాకు చెక్ పెడతారు. చైనా, అమెరికాల తీరు తెన్నులను గమనిస్తూ, అడుగులు వెయ్యడమే భారత్ కున్న ఏకైక మార్గం. డోనాల్డ్ ట్రంప్ సమయంలో అమెరికాకు చైనాతో విభేదాలు పెరిగినట్లే, భారత్ తో బంధాలు పెరిగాయి. 2016లో నరేంద్రమోదీ అమెరికా పర్యటించినప్పుడు జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇద్దరికీ పరిచయాలు ఉన్నాయి. ట్రంప్ వ్యాపారం నుండి రాజకీయాల్లోకి వచ్చినవాడు. జో బైడెన్ చిన్నప్పటి నుండీ రాజకీయాల్లోనే  ఉన్నాడు. మోదీ కూడా ఎప్పటి నుండో రాజకీయాల్లో ఉన్నారు. ఇద్దరికీ రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలు తెలుసు. అమెరికాలో ఓటు హక్కు ఉన్న భారతీయులు ఎక్కువమంది మొదటి నుండీ డెమోక్రాటిక్ పార్టీకి  మద్దతుదారులుగానే ఉన్నారు.

బైడెన్ వైపు నిలిచిన భారతీయ అమెరికన్లు

నేటి ఎన్నికల ప్రచారం లోనూ, డొనేషన్ల లోనూ జో బైడెన్ వైపే ఎక్కువమంది నిలిచారు. వైట్ హౌస్ లో కూడా భారతీయుల ప్రాబల్యం బాగానే ఉంది. ఒబామా బరాకా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన బృందంలో భారతీయ అమెరికన్ల  సంఖ్య ఎక్కువగా ఉండేది. జో బైడెన్ ను మొదటి నుండీ బాగా బలపరిచిన నాయకుడు బరాకా. బైడెన్ బృందంలో,  భారతీయుల సంఖ్య గతంలో కంటే ఎక్కువగా ఉండవచ్చనే ఊహాగానాలు బయలుదేరాయి. అవి నిజమయ్యే అవకాశాలూ  లేకపోలేదు. ప్రస్తుతం,  ఉపాధ్యక్ష స్థానంలో కూర్చోబోయే భారత సంతతి మహిళ, కమలా హ్యారిస్ వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష రేసులో ఉంటారు.

భారత్ – అమెరికా బంధాలు బలోపేతం

ఈ నేపథ్యంలో, 2021 నుండి భారత్ -అమెరికా బంధాలు, గతంలో ఎన్నడూ లేనంతగా బలపడే వాతావరణం కనిపిస్తోంది. రక్షణ,వ్యూహాత్మక బంధాలు, వాణిజ్యం, విదేశాంగ విధానం మొదలైనవి కీలకం. ఈ వ్యవహారాల్లో మరింత ప్రగతి సాధించాల్సిన అవసరం ఉంది. హెచ్ -1బీ వీసాల విషయంలో బైడెన్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇండో-పసిపిక్ వ్యూహం, మానవ హక్కులు మొదలైన విషయాల్లో జో బైడెన్ ఎలా వ్యవహరించబోతాడో వేచి చూడాల్సిందే. కొన్ని అంశాలను  ఇంత ముందుగానే (టూ అర్లీ) మాట్లాడుకోవడం సరియైన ఆలోచన కాదు.ఏది ఏమైనా, భారత్ -అమెరికా బంధాలు సవ్యంగా,నవ్యంగా, ప్రగతి పథంలో సాగుతాయని ఆశిద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles