Thursday, November 21, 2024

నేను నాది అనే ఆలోచనలను వదులుకుంటే జ్ఞానం

తిరుప్పావై- 20

మాడభూషి శ్రీధర్

4 జనవరి 2024

ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్ఱు
కప్పమ్ తవిర్ క్కుమ్ కలియే తుయిలెజాయ్
శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్, శెట్రార్ క్కు
వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెజాయ్
శెప్పన్న మెన్ ములై శెవ్వాయ్ శిఱు మరుంగుల్
నప్పిన్నై నంగాయ్ తిరువే తుయిలెజాయ్
ఉక్కముమ్ తట్టొళియుమ్ తందు ఉన్ మణాళనై
ఇప్పోదే ఎమ్మై నీరాట్టేలో రెంబావాయ్

తెలుగుభావార్థ గీతిక

ముక్కోటి దేవుళ్లు ముప్పు వచ్చెనంచు విన్నవించకమున్నె

దానవ వైరుల తరిమికొట్టెడు సత్య బల పరాక్రముండు

పోయిన రాజ్యాల కట్టబెట్టు, మేము ముక్కోటికన్నతక్కువనా

 మృతిని జయింప సురలు తాగినసుధ మాకుత్త ఉప్పునీరు

భగవదనుభవమే అమృతమ్మురాజ్యాలు గీజ్యాలు అడగబోము

మమ్ముబాధించువారుగాక నీకు వైరులెవరు వేరె వైకుంఠనాథ

మధురాధరి కలశస్తని తలోదరి నీళ నీవె మా లక్ష్మివమ్మ

అద్దము వింజామర కన్నయ్య స్నాన సాంగత్యమీయవమ్మ

నీకంటూ వేరు శత్రువులు లేరు. కాని నీ భక్తులకు శత్రువులు నీ శత్రువులే అని భావించి వారినుంచి రక్షిస్తావు.

గోపికలకు నీళాదేవికి మధ్య వాగ్వాదం జరిగిన తరువాత శ్రీ కృష్ణుడు మౌనంగా ఉన్నాడు. గోపికలు నిష్ఠూరాలు ఆడారు. నీళాదేవీ మాట్లాడడం లేదు. గొల్ల పడుచులు శ్రీ కృష్ణుడిని, ఆ తరువాత నీళాదేవిని మరోసారి అర్థిస్తున్నారు. నేను నాది అనే ఆలోచనలను వదులుకుంటే జ్ఞానం కలుగుతుంది, అదే భక్తికి వైరాగ్యానికి దారితీస్తుంది. అప్పుడే బ్రహ్మానందానుభవ స్నానం లభిస్తుందని చాటిచెప్పే పాశురం ఇది.అజ్ఞానమే మరణం అనే జ్ఞానభక్తి పాశురం

అమరులు లేదా దేవతలు అంటే మరణం లేని వారు. మరణం అంటే బ్రహ్మ జ్ఞానం లేకపోవడం. అవిద్యారూపమగు శత్రువు ఆక్రమించకముందే విజృంభించి అవిద్యా భయమును రూపుమాపడం ఆర్జవము, పరాక్రమము. దేవతలు అంటే జ్ఞానులు, వారికి భయం ఏమిటి. భగవంతుడిని నిరంతర ధ్యానంలో ఏదైనా విఘాతం కలుగుతుందేమోనన్నదే జ్ఞానుల భయం. భగవద్విషయ స్మృతిని కలిగించేవాడు భగవంతుడే. అదే స్వామితో స్నాన సంశ్లేషం, నిరంతర సాన్నిహిత్య భావన. అదే అడుగుతున్నారు ఈ పాశురంలో. ఇది జ్ఞానభక్తి.

నిన్నటి (19వ) పాశురంలో నీళాదేవితో నిష్టూరాలడతారు. ఏం ఒక్కక్షణమైనా స్వామిని విడువకపోవడం న్యాయమా ఇది నీకు తగునా అని అలుగుతారు. ఆలస్యమైందని ఓపలేక మాట్లాడుతున్నారు లే అని నీళాదేవి సర్దిచెప్పుకుని తగిన సమయం చూసి స్వామికి చెప్పి వీరిని ఆదుకుందాం అని ఆలోచిస్తూ మౌనంగా ఉందట. ఇదేమిటి అమ్మ మౌనంగా ఉంది. సరే అయ్యను అడుగుదాం. నీవైనా మమ్ముఆదుకోకపోతే దేవతలందరినీ కాపాడతావనే నీ కీర్తికి భంగం ఏర్పడుతుంది అని క్రిష్ణయ్యను ప్రార్థిస్తున్నారు. అయినా స్వామి బదులు పలకడం లేదు. నీళాదేవిని నిష్టూరాలాడినందుకు స్వామికి కోపం వచ్చిందేమో అని మళ్లీ అమ్మ గుణాలను అందాలను ప్రశంసిస్తున్నారు గోపికలు, గోదమ్మ. నీ అందంతో స్వామిని ఆకర్షించి మమ్ముకావమని చెప్పడానికి సందర్భంకోసం చూస్తున్నావు కదూ అని ఆమెతో అంటున్నారు.

ముక్కోటి దేవుళ్లు ముప్పు వచ్చెనంచు విన్నవించకమున్నె

“ముప్పత్తు మూవర్ అమరర్కు” ముప్పై మూడు వర్గాల దేవతలను “మున్ శెన్ఱు” ఆపదరావడానికి ముందే వెళ్ళి కాపాడే “కప్పం తవిర్కుం కలియే!” గొప్ప బలం కలవాడివే “తుయిల్ ఏరాయ్” లేవవయ్యా. “శెప్పం ఉడైయాయ్! ” సత్య పరాక్రమశాలీ, ఆడిన మాట తప్పని వాడా, నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి, మాట ఇచ్చి, ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా, ఏమైంది నీ మాట. ” తిఱలుడైయాయ్” సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా!, “శేత్తార్కు వెప్పమ్కొడుక్కుం విమలా!” శత్రువులకు దుఖాఃన్ని ఇచ్చే నిర్మలుడా, ఏదోషం అంటని వాడా. “తుయిల్ ఎరాయ్” నిద్ర లేవయ్యా. నిన్న అమ్మను కొంచం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తారు ఇలా. “శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్” సమమైన అంగ సౌష్టవ సౌందర్యం కల్గి, “నప్పినై” స్వామి సంబందంతో ‘నంగాయ్’ పరి పూర్ణమైన అందం కలదానా! “తిరువే!” సాక్షాత్తు నీవే లక్ష్మివి “తుయిలెరాయ్” మేల్కోవమ్మా. అమ్మ ఏంకావాలని అడిగింది. “ఉక్కముమ్” స్నానానికి తర్వాత పట్టిన స్వేదాన్ని వదిలించే విసనకర్ర కావాలి, “తట్టొళియుమ్”స్నానం తర్వాత అలకరించు కోవడానికి ఒక నిలువుటద్దం కావాలి, ” తందు” ఈ రెండు ఇచ్చి “ఉన్మణాళనై” నీ స్వామిని ‘ఇప్పోదే’ ఇప్పుడే ‘ఎమ్మై’ మాతో కలిపి “నీరాట్టు” నీరాడించు.

పన్నిద్దరు (పన్నెండు మంది) ఆళ్వారులు

మనకు 33 కోట్ల మంది దేవతలు. వారికి ఆపదలు వస్తాయని చూచాయగా తెలిసినా ముందు తానే వెళ్లి నారాయణుడు వారి కష్టాలను తొలగిస్తాడట. మిత్రులను ఆదుకుంటూ శత్రువులను భయభీతులను చేసే మహాబలుడు, పరాక్రమ విక్రముడు. మరి ఇదేమిటి ఈ రోజు పానుపు పైనుంచి లేవడమే లేదు. గోపికలు అప్పుడు మళ్లీ నీళాదేవిని ప్రార్థిస్తారు. ఎరుపైన పెదాలు, ఎత్తయిన వక్షస్థలం, సన్నని నడుముతో నీళాదేవి, విష్ణుపత్ని శ్రీదేవి వలె అతిలోక సుందరి. మీరిరువురూ లేవండి మా సిరినోముకు కావలసిన అద్దమూ, ఆలవట్టమూ, మీ శ్రీనాథుడిని ఇవ్వండి. శ్రీకృష్ణుడితో కలిసి స్నానాలు చేసేమహాభాగ్యం మాకు కల్పించడమ్మా అని నప్పిన్న పిరాట్టి నీళాదేవిని వేడుకుంటున్నారు.

Also read: కాటుక కన్నుల నీళమ్మా కృష్ణులశృంగారగీతం

మనం ముక్కోటి దేవతలు అన్నా 33 కోట్లు అన్నా అతిశయోక్తి అనిపిస్తూనే ఉంటుంది. గోదాదేవి 33 అన్నారా ఇంకా ఎక్కువ మంది ఉన్నారన్నారా? పరమాత్ముని మనసునుండి చంద్రుడు, నేత్రముల నుండి సూర్యుడు, ముఖము నుంచి ఇంద్రాగ్నులు, శ్వాసనుంచి వాయువు జన్మించారని చంద్రమా మనసో జాతః..అనే వేద వాక్యం వివరిస్తుంది. వేద దేవతల లెక్క 33 మంది. వీరిలో 11 మంది భూమిమీది వారు. 11 మంది అంతరిక్షపు వారు, 11 మంది ద్యులోకపు వారు. ఇదొక లెక్క. మరొక పద్ధతిలో 11 మంది రుద్రులు, 12 ఆదిత్యులు, 8మంది వసువులు, 1 ద్యావ, 1 పృథ్వి = మొత్తం ముఫ్పది ముగ్గురు దేవతలు. వీరంతా స్వామి సృష్టించిన వారే.  ఆయన ఆజ్ఞానువర్తులే. దాశరథి రంగాచార్యుల వివరణ ప్రకారం వేద దేవతలు వేరు, ఇతిహాస పురాణాల్లో కనిపించే దేవతలువేరు.  తపస్సుచేసి బ్రహ్మరుద్రులనుంచి అలవి కాని వరాలు సంపాదించి శత్రువులైన రాక్షసులనుంచి దేవతలను రక్షించడానికి నారాయణుడు అరి భయంకరుడు అవుతాడు. ఆయనకు సొంతంగా శత్రువులు లేరు. కాని తనను ఆశ్రయించిన దేవతలు, భక్తులకు కలిగే శత్రువులనే తన శత్రువులుగా భావించి అరిషడ్వర్గాల మీద అరిభయంకరుడవుతాడు.  గోపికలు ఈ పాశురంలో స్వామిని ఏమీ అడగడం లేదు. అమ్మను అడుగుతున్నారు. విసన కర్ర అంటే జనన మరణాలతో అలసినపుడు విసురుకోవడానికి. అద్దం ఆత్మదర్శనానికి ఉపకరణం. స్వామితో కూడి స్నానం చేయడానికి సాయం చేయమంటున్నారు. స్నానం ద్వారా స్వామి సాన్నిధ్యం సాయుజ్యం కోరుకుంటున్నారు.

ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్ఱు కప్పమ్ తవిర్ క్కుమ్ కలియే తుయిలెజాయ్ 33 కోట్ల ముంది దేవతలకు ఆపద కలగకముందే వెళ్లిరక్షించిన వాడా. దేవతలు 33 కోట్ల మంది, గొల్లపిల్లలమైన మా సంఖ్య తక్కువ. 33 కోట్లకు తక్కువగా ఉంటే నీవు కాపాడవా? వారికి బలం ఎక్కువ, పురుషులని అహంకారం- మేం పురుషులం కాదు, అబలలం. బలంలేని వారిని కాపాడాలి కదా. గొల్ల పడుచులం, నీ చరణాలే నమ్ముకున్నాం. వారికి పదవులు కావాలి, రాజ్యాలు కాపాడుకోవాలి- మాకు ఆ అవసరమే లేదు. అటువంటి వేరే ప్రయోజనాలేవీ లేవు. ఇంకేదైనా ఆశించే వారినే ఆదుకుంటారా? మాకు నీవిచ్చేది ఏదీ లేదు. మేమేదీ అడగడం లేదు. కఠినులైన ఘోర రాక్షసులపైకి శ్రీకృష్ణుడిని పంపే దేవతల వలె మేము నిర్దయులం కాదులే. వారు ఉప్పు నీళ్ల వంటి అమృతం తాగిన వారు. మేం భగవదనుభవం అనే అసలైన అమృతం తాగదలుచుకున్నాం. చంపినా మరణం లేని దేవతలు బలయుతులు, వారినే ఆదుకుంటావా, నిన్ను ఒక్క క్షణం ఎడబాసినా వియోగదుఃఖంతో మరణించే మాకు, శక్తియుక్తులేవీ లేని అమాయకులమైన మాకు నీరక్షణ లేదా? పోనీ దేవతలనే రక్షించడం మీవ్రతం అని భావిస్తే మమ్మల్ని దేవతలమనే అనుకొని రక్షించవచ్చు కదా. మీ క్షేమమే మాక్కావలసింది. శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్, శెట్రార్ క్కువెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెజాయ్ నీకంటూ వేరు శత్రువులు లేరు. కాని నీ భక్తులకు శత్రువులు నీ శత్రువులే అని భావించి వారినుంచి రక్షిస్తావు. ద్రౌపది వంటి ఆశ్రితులకు అభయంకరమైనవి, దుర్యోధనాది శత్రువులకు భయంకరమైనవీ అయిన పంచాయుధాలు ధరించిన వాడివి మమ్మల్ని రక్షించవా అంటూ గోపికలు అడుగుతున్న పాశురం ఇది.

Also read: బలరాముడు లేచినా శ్రీకృష్ణుడు మేల్కొనలేదు?

ఎంత వేడినా మౌనం వీడకపోతే, గోపికలు మళ్లీ జగదేక సుందరి నీళాదేవినే ఆదుకొమ్మని కోరుకుంటున్నారు. శెప్పన్న మెన్ ములై శెవ్వాయ్ శిఱు మరుంగుల్ నప్పిన్నై నంగాయ్ తిరవే తుయిలెజాయ్ అందమైన స్తనములు, అధరములు, సన్నని నడుము గల మహాలక్ష్మీ లేవమ్మా, నీ అందమునకు మోహించి సప్తవృషభములను లొంగదీసుకునే నియమాన్ని పాటించి నిన్ను శ్రీకృష్ణుడు చేపట్టేట్టు చేసుకున్నావు.

నీవు పరిపూర్ణురాలివి నజ్ఞాయ్

నీవు పరిపూర్ణురాలివి ‘నజ్ఞాయ్’ లేవమ్మా అన్నారు. ‘నేను మేలుకునే ఉన్నాను. మీకేం సాయం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏమివ్వాలి’ అని నీళాదేవి అడిగారు. అద్దమూ వింజామరతోపాటు శ్రీకృష్ణుడినే మాకు ఉపకరణంగా వెంటనే ఇవ్వండి. మమ్మల్ని మీ దయావృష్ఠిలో స్నానం చేయించు తల్లీ’ అని వేడుకుంటున్నారు.

నీళాదేవి అంతటి జ్ఞాన సౌందర్య పరిపూర్ణసుందరి. పెదాల ఎరుపు సంతానంపట్ల ప్రేమకు నిదర్శనం. ఎదపై రెండు బంగారు కలశ స్తనాలు జ్ఞానము, భక్తి కి ప్రతీకలు. అది వైరాగ్యానికి దారి తీయాలి. ఉందోలేదో తెలియనంత సన్నని నడుము వైరాగ్యానికి ప్రతీక. ఈ బహిరంతర సౌందర్యాలకోసమే నీళాదేవిని కట్టుకున్నాడు కృష్ణుడు. స్వామిని వశం చేసుకుని పిల్లలను రక్షింపచేయడమే సంపూర్ణత్వం. నీవే లక్ష్మీదేవివి. లేవమ్మా అంటున్నారు.

Also read: అమ్బరమే వస్త్రములు, తణ్ణీరే చల్లని నీరు, శోఱే అన్నము


నీవే లక్ష్మీదేవివి. లేవమ్మా అంటున్నారు.
ఇది మార్గశీర్ష స్నాన వ్రతం. ఉక్కముమ్ తట్టొళియుమ్ తందు ఉన్ మణాళనై ఇప్పోదే ఎమ్మై నీరాట్టేలో రెంబావాయ్ నీస్వామిని మాకిచ్చి స్నాన మాడించు అంటున్నారు. నీవు అనుభవించిన స్వామిని మాకిమ్మని అడగడం ఏమిటి? ఈ సకల లోకాలకు ఏకైక పురుషుడు పరమాత్ముడే. అందరూ ఆబ్రహ్మానందాన్ని అనుభవించవలసిన స్త్రీమూర్తులే అవుతారు. మా అందరికి జీవన ముక్తి . మీవారితో మాకు స్నానం ఆడించు అంటే పూర్తిగా భగవధ్యానంలో మునిగిపోయే స్నానం అడుగుతున్నారు గోపికలు. ముందు పరిపూర్ణురాలైన తల్లి నీళాదేవి తన జ్ఞానభక్తి వైరాగ్యాలద్వారా స్వామిని అనుభవించి, పురుషాకారం వహించి, తన సంతానమైన జీవులందరికీ పరమాత్మైకానందాన్ని అనుభవింపచేయాలని అర్థం.

(ఆండాళ్ పూజించిన దేవుడు, మూల వరులు, వటపత్రశాయి, ఉత్సవ విగ్రహములు, శ్రీవిల్లిపుత్తూర్)

నమః అనే పదం అహంకారాన్ని వదిలించేది.

  • స్నానానికి అవసరమైనవి రెండు.
  • ఒకటిఅద్దం. ముఖం చూసుకోవడానికి.
  • రెండువింజామర, స్నానం తరువాత పుట్టే చిరుచెమటను, స్వేదాన్ని తొలగించడానికి. గోపికలు మూడు వస్తువులు అడుగుతారు.
  • అద్దం వింజామర తరువాత మూడో వస్తువు వస్తువు కాదు పరమాత్మే. పరమాత్మనే కోరుతున్నారు. అద్దంలో మనస్వరూపం చూసుకుంటాం. అది స్వస్వరూప జ్ఞానం.
  • అది ఓం కారం. అది చూసుకోగానే కొంత అహంకారం వస్తుంది.
  • అదే చెమట. ఉక్కొమం (విసనకర్ర) తట్టొళియం (అద్దం).
  • గోపికలు అడుగుతున్నది, నేను కాదని, నాది లేదని తెలుసుకునే జ్ఞానాన్ని కలిగించాలని, స్వేదమనే అహంకారాన్ని వెంటనే తొలగించుకోవడానికి వింజామర ఇవ్వాలని వారి అభ్యర్థన.
  • నమః అనే పదం అహంకారాన్ని వదిలించేది.
  • అందుకే ప్రతి స్తోత్రం లో నామాలు ఓం తో మొదలై నమః తో ముగుస్తాయి.
  • ప్రతి సారీ నాది కాదు నాదికాదు అంటూ అనుకుంటూ ఉండాలి. అప్పుడే అహంకారపు చెమట వదిలిపోతుంది.
  • ఓం పక్కన నమః చేరుతుంది.
  • మధ్యలో చేరాల్సిందిక నారాయణ నామమే.
  • నమః నుంచి నారాయణ దాకా వస్తే అదే అష్ఠాక్షరి.
  • జ్ఞాన భక్తుల ద్వారానే భగవంతుడు లభిస్తాడని ఈ పాశురంలో గోదాదేవి వివరిస్తున్నారు. నేను నాది అనే ఆలోచనలను వదులుకుంటే జ్ఞానం కలుగుతుంది, అదే భక్తికి వైరాగ్యానికి దారితీస్తుంది.
  • అప్పుడే బ్రహ్మానందానుభవ స్నానం లభిస్తుందని చాటిచెప్పే పాశురం ఇది.

అసంఖ్యాకములైన జీవాత్మలకు జ్ఞాన సంకోచము కలగకముందే వారి సంసారబంధాలను నివర్తనంచేసే వాడా, ఎవరూ అడగకపోయినా సకల ఉపనిషత్సారమైన గీతామృతమును బోధించిన కరుణామయుడివి, ఆశ్రితులకు అందిన వాడు, భాగవత విరోధులను నిరోధించి భక్తుల భయనివృత్తి చేసిన వాడివి, ఆచార్యుల విషయానికి వస్తే కుదృష్టి మతాలను నశింపచేసి, ఆశ్రితులకు మాశుచః అని అభయమిచ్చిన వాడు. భగవత్ వియోగము సహించలేనిదీ, జ్ఞాన భక్తి వైరాగ్యములు కలిగిన మహాలక్ష్మీ మేల్కొనుము. అహంకార మమకారాలను తొలగించి స్వస్వరూపజ్ఞానమును ప్రసాదించి నీకు వశుడైన సర్వేశ్వరునితో మమ్ము కలిపి మీ ఉభయులను సేవించే భాగ్యం ప్రసాదించవమ్మా. భగవంతుని లోబరుచుకునే వాడు ఆచార్యుడనీ, విసనకర్ర అంటే అష్టాక్షరీ అనీ, అద్దం అంటే ద్వయమని ఆచార్యపరమైన అన్వయం.

దాశరథి రంగాచార్యుల వివరణ

పరమాత్ముని మనసునుండి చంద్రుడు, నేత్రముల నుండి సూర్యుడు, ముఖము నుంచి ఇంద్రాగ్నులు, శ్వాసనుంచి వాయువు జన్మించారని చంద్రమా మనసో జాతః శ్లోకం వివరిస్తుంది. వేద దేవతలు 33 మంది. వీరిలో 11 మంది భూమిమీది వారు. 11 మంది అంతరిక్షపు వారు, 11 మంది ద్యులోకపు వారు. ఇదొక లెక్క. మరొక పద్ధతిలో 11 మంది రుద్రులు, 12 ఆదిత్యులు, 8మంది వసువులు, 1 ద్యావ, 1 పృథ్వి = మొత్తం ముఫ్పది ముగ్గురు దేవతలు. వీరంతా స్వామి సృష్టించిన వారే.  ఆయన ఆజ్ఞానువర్తులే. దాశరథి రంగాచార్యుల వివరణ ప్రకారం వేద దేవతలు వేరు, ఇతిహాస పురాణాల్లో కనిపించే దేవతలువేరు.  తపస్సుచేసి బ్రహ్మరుద్రులనుంచి అలవి కాని వరాలు సంపాదించి శత్రువులైన రాక్షసులనుంచి దేవతలను రక్షించడానికి నారాయణుడు అరి భయంకరుడు అవుతాడు. ఆయనకు సొంతంగా శత్రువులు లేరు. కాని తనను ఆశ్రయించిన దేవతలు, భక్తులకు కలిగే శత్రువులనే తన శత్రువులుగా భావించి అరిషడ్దర్గాల మీద అరిభయంకరుడవుతాడు.  గోపికలు ఈ పాశురంలో స్వామిని ఏమీ అడగడం లేదు. అమ్మను అడుగుతున్నారు. విసన కర్ర అంటే జనన మరణాలతో అలసినపుడు విసురుకోవడానికి. అద్దం ఆత్మదర్శనానికి ఉపకరణం. స్వామితో కూడి స్నానం చేయడానికి సాయం చేయమంటున్నారు. స్నానం ద్వారా స్వామి సాన్నిధ్యం సాయుజ్యం కోరుకుంటున్నారు. దాశరథి ఈ పాశురంలో అంతరార్థాన్ని చిన్న పదాలతో అద్భుతంగా వివరించారు.

Also read: పదిమంది మహాజ్ఞానులను మేల్కొల్పిన గోదమ్మ

వాక్కుఅర్థం కలిస్తేనే,ఏకమే, అదే విశిష్టాద్వైతం

సర్వ ఖల్విదం బ్రహ్మ అంటే అంతా ఒక్కటే. రెండు లేవు. ఈశావాస్యమిదం సర్వం అంటే ఇది సాంతం ఈశ్వరుడే. విశిష్టాద్వైతంలో ప్రకృతి వేరు పురుషుడు వేరు. పరమాత్మ వేరు. పిరాట్టి వేరు, తల్లి వేరు, తండ్రి వేరు, ఆత్మవేరు పరమాత్మ వేరు.  అయితే రెండు రెండు ఉన్నా అవి అనన్యములే. అంటే వాక్కు అర్థం వేరుగా చెప్పుకున్నా వాటిని విడదీయగలమా? రెండు కలిసి ఒక్కటి అని చెప్పేదే విశిష్టాద్వైతం. పురుషుడు స్త్రీ విడివిడి అన్నట్టు నీళాదేవిని శ్రీకృష్ణుని ప్రకృతి పురుషులుగా విడిగా ప్రస్తావిస్తున్న గోపికలు ఇద్దరూ ఒకటే అని కూడా భావిస్తున్నారు. పురుషుడు అమితపరాక్రమవంతుడు, జగదేక వీరుడు. 33 కోట్ల మంది దేవతల కష్టాలు కూడా అడగకుండా తీర్చగల వీరుడు. ఇక తల్లి జగదేక సుందరి. అంతటి స్వామిని ఆకట్టుకున్న సౌందర్యరాశి. ఆ దేవతలను ఆ ప్రకృతిని ఆ జగత్తును ఆ సౌందర్యాన్ని అన్నీ సృష్టించింది ఆ స్వామి వారే.  శ్రీదేవితో కూడిన నారాయణుడిని అర్థిస్తున్నారు. తల్లి ద్వారా తండ్రిని కోరుకుంటున్నారు.

నిన్నటి (19వ) పాశురంలో నీళాదేవితో నిష్టూరాలడతారు. ఏం ఒక్కక్షణమైనా స్వామిని విడువకపోవడం న్యాయమా ఇది నీకు తగునా అని అలుగుతారు. ఆలస్యమైందని ఓపలేక మాట్లాడుతున్నారు లే అని నీళాదేవి సర్దిచెప్పుకుని తగిన సమయం చూసి స్వామికి చెప్పి వీరిని ఆదుకుందాం అని ఆలోచిస్తూ మౌనంగా ఉందట. ఇదేమిటి అమ్మ మౌనంగా ఉంది. సరే అయ్యను అడుగుదాం. నీవైనా మమ్ముఆదుకోకపోతే దేవతలందరినీ కాపాడతావనే నీ కీర్తికి భంగం ఏర్పడుతుంది అని క్రిష్ణయ్యను ప్రార్థిస్తున్నారు. అయినా స్వామి బదులు పలకడం లేదు. నీళాదేవిని నిష్టూరాలాడినందుకు స్వామికి కోపం వచ్చిందేమో అని మళ్లీ అమ్మ గుణాలను అందాలను ప్రశంసిస్తున్నారు గోపికలు, గోదమ్మ. నీ అందంతో స్వామిని ఆకర్షించి మమ్ముకావమని చెప్పడానికి సందర్భంకోసం చూస్తున్నావు కదూ అని ఆమెతో అంటున్నారు.

అవిద్య శత్రువు

దేవతలు అంటే మరణ రహితులు. మరణం అంటే బ్రహ్మ జ్ఞానం లేకపోవడం. అవిద్యారూపమగు శత్రువు ఆక్రమించకముందే విజృంభించి అవిద్యా భయమును రూపుమాపడం ఆర్జవము, పరాక్రమము. దేవతలు అంటే జ్ఞానులు, వారకి భయం ఏమిటి. భగవంతుడిని నిరంతర ధ్యానంలో ఏదైనా విఘాతం కలుగుతుందేమోనన్నదే జ్ఞానుల భయం. భగవద్విషయ స్మృతిని కలిగించేవాడు భగవంతుడే. అదే స్వామితో స్నాన సంశ్లేషం, నిరంతర సాన్నిహిత్య భావన. అదే అడుగుతున్నారు ఈ పాశురంలో. ఇది జ్ఞానభక్తి.

Also read: బాలకృష్ణుడి భక్తి సేవించ రారమ్మ గొల్ల భామలారా!

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles