Sunday, December 22, 2024

సమాజ సేవలో తరించిన ఈశ్వరీబాయి

పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో సామాజిక సేవారంగంలో గణనీయమైన కృషి సలిపిన వారిలో ఒకరు జెట్టి ఈశ్వరీబాయి. తరతరాల నుంచి సమాజంలో పీడనకు గురి అవుతూ, బానిసత్వంలో మగ్గుతూ అణగారిన ప్రజలకు విముక్తి కలిగించడానికి ఆమె చేసిన కృషి చిరస్మరణీయం.

ఆమె బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అడుగుజాడలలో నడిచిన ధీరవనిత. రాజకీయాలలో నైతిక విలువల కోసం ఉద్యమించిన నిజాయితీ పరురాలు. ఉత్తమ శాసన సభ్యురాలు, నిరాడంబరతకు, నిస్వార్థ సేవకు ప్రతిరూపం.  దేశభక్తి, ప్రజాసేవ, మహిళాభ్యుదయం ఆమె దృక్పథం. లంచగొండి అధికారులకు సింహస్వప్నం. భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలిగా, అంబేద్కరు వాదిగా, దళిత సంక్షేమకర్తగా. సమాజ సేవకురాలిగా సుపరిచితులు. ఆమే జెట్టి ఈశ్వరీబాయి. ఆమె పోరాట పటిమ చరిత్రలో అద్వితీయం, అనితర సాధ్యం. 

ఉద్యమశీలి

ఈశ్వరీబాయి తన బాల్యం నుంచి   స్త్రీ, పురుషుల మధ్య కులాలు, మతాల మధ్య ఈ అంతరాల గురించి ఆలోచించేవారు, మదన పడేవారు. ఉద్యమించకుండా, పోరాడకుండా, ఆత్మగౌరవంతో ప్రజలకు ఏదీ దక్కదని అర్థం చేసుకుని ప్రజలను అందుకు సన్నద్ధం చేసేవారు. చిన్న, సన్నకారు రైతుల సమస్యలు, రైతు కూలీల కనీస వేతనాలు, ఎస్సీ, ఎస్టీలకు బంజరు భూమితోపాటు ఇండ్ల స్థలాల కేటాయింపు, చేనేత, బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆర్‌పీఐ నాయకత్వంలో ఆమె అనేక ఉద్యమాలు నిర్వహించారు. 

ఈశ్వరీబాయి 1918, డిసెంబరు 1 వ తేదీన సికింద్రాబాదు లోని చిలకలగూడలో ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించారు. తల్లి రాములమ్మ, తండ్రి బల్లెపు బలరామస్వామి. ప్రాథమిక విద్య ఎస్.పి.జి. మిషన్ పాఠశాలలో,  అనంతరం  కీస్ హైస్కూలులో ఉన్నతవిద్య చదువుకున్నారు. ఆమె వివాహం 13వ ఏటనే పుణెలోని ఒక సంపన్న కుటుంబానికి చెందిన దంత వైద్యుడు జెట్టి లక్ష్మీనారాయణతో జరిగింది. ఆమెకు ఒక కూతురు పుట్టిన అనంతరం భర్త చనిపోగా, ఈశ్వరీబాయి కూతుర్ని తీసుకొని హైదరాబాదులోని పుట్టింటికి తిరిగి వచ్చారు. తన కాళ్ళపై తాను నిలబడి, సాంఘిక అభ్యుదయానికి కృషి చేశారు. చిలకలగూడా లోని మురికివాడలకి వెళ్లి వయోజనులకు చదువు చెప్తానని ఈశ్వరీబాయి అక్కడ ఓ బోర్డు పెట్టి, ఓ వరండాలో అందరినీ జమచేసి చదువు చెప్పేవారు.

విద్యాబోధన పట్ల ఆసక్తి

భర్త చనిపోయి పుట్టింట్లో ఉన్నా ఈశ్వరీబాయి ఎవరిమీదా ఆధార పడకుండా స్వతంత్రంగా జీవించారు. మెట్రిక్ పాసై పరోపకారిణి అనే ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా వృత్తి జీవితం ప్రారంభించారు. ఆ పాఠశాలలో పనిచేస్తూనే కొందరు సంపన్న కుటుంబాల పిల్లలకు బోధనా తరగతులను నిర్వహించేవారు. స్వంత డబ్బుతోనే గీతా ప్రైమరీ స్కూలు, గీతా మిడిల్ స్కూలు అనే విద్యా సంస్థలను ప్రారంభించారు. ఈశ్వరీబాయికి తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో మంచి పరిజ్ఞానం ఉండేది. హైదరాబాదు ప్రజలతో కలిసి పనిచేయడానికి బహుభాషా పరిజ్ఞానాన్ని ఆమె సద్వినియోగ పరుచుకున్నారు. ఎవరు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలోనే సమాధాన మిచ్చేవారు. అలా అందరికీ ఆత్మీయులయ్యారు. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తూనే, సాంఘిక సేవలో పాల్గొన్నారు. ఈశ్వరీబాయి రెడ్‌క్రాస్ సొసైటీ జీవిత కాలపు సభ్యురాలుగా, చాలా కార్యక్రమాల్లో పని చేశారు. 

స్వతంత్ర అభ్యర్థిగా విజయం

1951లో హైదరాబాదు – సికింద్రాబాదు నగర పురపాలక సంఘానికి ప్రజాస్వామ్య రీతిలో తొలిసారిగా ఎన్నికలు జరగగా. ఆమె చిలకలగూడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, విజయం సాధించారు. కౌన్సిలరుగా మురికివాడల్లో మంచినీటి సౌకర్యం, వీధి దీపాల ఏర్పాట్లు, మరుగుదొడ్ల నిర్మాణం ఇతర ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. కార్మికులకు ఇళ్లస్థలాలను ఇప్పించారు. మున్సిపల్ కౌన్సిలర్‌గా శక్తివంచన లేకుండా అహర్నిశలు శ్రమించారు. కౌన్సిలరుగా రెండు పర్యాయాలు పని చేశారు.  వెనుకటి హైదరాబాద్ రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల ప్రజల సంక్షేమానికి 1950లో షెడ్యూల్డు కులాల ఫెడరేషన్ అనే కొత్త కమిటీ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఎ.పి. షెడ్యూల్డు కులాల ఫెడరేషన్ గా రూపొందింది. దీనికి ఈశ్వరీ బాయి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 1956 అక్టోబర్‌ 14న నాగపూర్‌లో ఐదు లక్షల మంది అనునాయులతో బౌద్ధ దమ్మ దీక్ష స్వీకారం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

సదాలక్ష్మి చేతిలో ఓటమి, విజయం

1962లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈశ్వరీబాయి నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడి, షెడ్యూల్డు కులాల వారికి రిజర్వు చేయబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర శాసనసభకు పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికలలో టి.ఎస్.సదాలక్ష్మి చేతిలో ఓడిపో యారు. 1967లో జరిగిన ఎన్నికలలో తిరిగి అదే స్థానం నుండి పోటీ చేసి దేవాదాయ శాఖమంత్రిగా పనిచేస్తున్న సదాలక్ష్మిపై విజయం సాధించారు. 

ప్రత్యేక తెలంగాణ పోరాటం

1969లో మొదలైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తొలిదశలో ఆమె చేసిన కృషి  ప్రశంసనీయం. తెలంగాణ ఉద్యమం కోసం సెపరేట్ తెలంగాణ పోరాట సమితి (ఎస్‌టిపిఎస్) అనే పార్టీని స్థాపించారు. 1972లో తిరిగి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి సెపరేట్ తెలంగాణ పోరాట సమితి అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నంది ఎల్లయ్యపై గెలిచి రెండవ సారి  శాసన సభలో అడుగు పెట్టారు. ఆనాటి రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకులలో తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాల కృష్ణయ్య, జి. శివయ్యల వరుసలో ఈశ్వరీబాయి కూర్చునే వారు. పది సంవత్సరాల పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకులలో ముఖ్యమైన పాత్ర వహించారు. 

అంబేడ్కర్‌ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని తెలంగాణను దళిత, బహుజన దృక్పథంతో అర్థం చేసుకొని పాలకులను ప్రజా క్షేత్రంలో ప్రశ్నించిన ధీరవనిత ఈశ్వరీబాయి. 

టీపీఎస్ లో కీలక పాత్ర

తెలంగాణ ప్రజా సమితిలో ఆమె కీలక పాత్ర పోషించారు. దానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గణాంకాలతో సహా వివరించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆమె ఉధృతం చేశారు. 1970లో తెలంగాణ ప్రజాసమితికి 10 లోక్‌సభ స్థానాలను కట్టబెట్టిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రజాసమితి నాయకులు పదవులకు ఆశపడి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేశారు. ఆ సందర్భంలో ఈశ్వరీబాయి ‘సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి’ని స్థాపించి తెలంగాణ వాదాన్ని, ఉద్యమాన్ని నిలబెట్టిన నిఖార్సైన తెలంగాణ వాది ఈశ్వరీబాయి. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా పోరాడే తత్వం ఆమె సొంతం. తెలంగాణ అంశంపై సభలో జరిగిన చర్చలలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలపై గణాంకాలతో వివరించేవారు. ముల్కీ రూల్స్ ఉల్లంఘనను గర్హించారు.

ఎమర్జెన్సీకి ప్రతిఘటన

ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని సైతం వ్యతిరేకించి శాసనసభ నుండి వాకౌట్‌ చేసి ఈశ్వరీబాయి సంచలనం సృష్టించారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉపేక్షించడాన్ని దుయ్యబట్టారు. తెలంగాణలో అమలవుతున్న నిర్బంధం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కాల్పులలో మరణించిన అమరుల గూర్చి, ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణ ప్రాంతానికి చేస్తున్న అన్యాయం గురించి శాసన సభలో ఆమె సింహగర్జన చేశారు. సాంఘిక దురాచారాలైన జోగిని వ్యవస్థకు, రెండు గ్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా బొజ్జా తారకం, సౌడ కాంతయ్యలతో కలిసి ఆమె అలుపెరుగని పోరాటం చేశారు.

గీతారెడ్డి మాతృమూర్తి

ఈశ్వరీబాయి క్యాన్సర్ వ్యాధికి గురై 1991, ఫిబ్రవరి 24 వ తేదీన హైదరాబాదులో మరణించారు.

ఈశ్వరీబాయి కొంతకాలం మహిళా, శిశు సంక్షేమ బోర్డుకు అధ్యక్షురాలిగా ఉన్నారు. 1952 నుండి 1990 వరకు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాసేవా రంగంలో పనిచేస్తూ దళిత ప్రజలు, వెనుకపడిన, బలహీన, బడుగువర్గాల, మహిళల అభ్యు దయానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వాటిని అమలు జరిపారు. ఈశ్వరీబాయి జ్ఞాపకార్ధం ట్రస్టు, నర్సింగ్ కాలేజి నిర్వహించ బడుతున్నాయి.

ఈశ్వరీబాయి ఏకైక పుత్రిక జె. గీతారెడ్డి. ఆమెను వైద్య విద్యలో పట్టభద్రురాలను చేసి, విదేశాలలో ఉన్నత చదువులు చదివించి డాక్టర్ని చేశారు. తన వలెనే తన కూతురు కూడా సమాజసేవలో పాల్గొనాలని ఆమె అభిలషించారు. గీతారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు. రాష్ట్ర మంత్రిణిగా పనిచేశారు.

(డిసెంబర్ 1 జె.ఈశ్వరీబాయి జయంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles