• ఛైర్మన్ గా ఎన్నికైన జేసీ ప్రభాకర్ రెడ్డి
• నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ విజయం
ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఉత్కంఠ రేపిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు ఎట్టకేలకు తెరపడింది. అనూహ్య పరిణామాల మధ్య ఈ మున్సిపాలిటీని ప్రతిపక్ష తెలుగుదేశం దక్కించుకుంది. పురపాలక ఛైర్మన్ గా టీడీపీ కౌన్సిలర్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్ గా సరస్వతిని ఎన్నుకున్నారు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇవ్వడంతో ప్రభాకర్ రెడ్డి ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. మూడు రోజుల క్రితం ఎమ్మెల్సీల ఎక్స్ అఫీషియో ఓట్లను మున్సిపల్ కమిషనర్ తిరస్కరించినప్పటి నుండి ఛైర్మన్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికవ్వడంతో ఉత్కంఠకు తెరపడింది.
Also Read: ఏపీలో కొత్త ఒరవడికి సీఎం జగన్ శ్రీకారం
అధికార, ప్రతిపక్షాల వ్యూహ, ప్రతివ్యూహాలు:
ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అధికార, ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నించాయి. తాడిపత్రి పురపాలికలోని 36 వార్డులకు గాను అధికార వైసీపీకి రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 34 వార్డులకు ఎన్నికలు జరగ్గా టీడీపీ 18 వార్డులు, వైసీపీ 14 వార్డులు గెలుచుకోగా సీపీఐ ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించారు. ముందు నుంచీ సీపీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థి టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. వైసీపీకి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి, ఎంపీ రంగయ్యలు నమోదు చేసుకున్నారు. దీంతో అధికారపార్టీ బలం కూడా 18కి చేరింది. టీడీపీ తరపున ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో ఆ పార్టీ బలం 19 అవుతుందని అంచనా వేయగా దీపక్ రెడ్డి ఓటును తిరస్కరించారు.
జేసీ క్యాంపు రాజకీయం:
అంతకుముందు ఎన్నికల్లో నెగ్గిన టీడీపీ అభ్యర్థులతో పాటు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థిని ప్రలోభాలకు గురికాకుండా జేసీ బ్రదర్స్ కాపాడుకోగలిగారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. టీడీపీతో సహా ఇద్దరు సభ్యులను తన శిబిరంలో ఉంచుకుని ప్రభాకర్ రెడ్డి కీలకంగా వ్యవహరించడంతో టీడీపీ రాష్ట్రంలో ఒకే ఒక మున్సిపాలిటీని దక్కించుకోగలిగింది.
Also Read: చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు