కరోనా వైరస్ వ్యాప్తి ఎట్లా ఉన్నా, తెలుగు భాషా సాహిత్యాలు, సంగీత, కళా సంస్కృతులు ప్రపంచవ్యాప్తంగా జయకేతనం ఎగురవేస్తున్నాయి.
సాంకేతికత సహకారం
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని వివిధ సంస్థలు, వ్యక్తులు అంతర్జాలంలో చేస్తున్న సారస్వత ఉత్సవాల ద్వారా అవధానం, కవిత, పద్యం, పాట, గేయం, ఉపన్యాసాలు, పుస్తక ఆవిష్కరణలు, జయంతులు, మహాకవి పండిత, వాగ్గేయకార, కళాకారుల స్మృతులు శరపరంపరగా లోకాన్ని మొత్తం చుట్టేస్తున్నాయి. మొన్న 5వ తేదీ నుండి 7వ తేదీ వరకూ సుప్రసిధ్ధ పంచ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ చేసిన శతావధానం ప్రపంచమంతా మారుమ్రోగింది. ఈ వేడుకలను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభారంభం పలికారు. ఈ ఉత్సవాన్ని శ్రీకృష్ణ దేవరాయ సత్సంగ్ నిర్వహించింది. సెప్టెంబర్ 10వ తేదీన జరిగిన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జయంతి వేడుకలు కూడా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.విశ్వనాథ ఫౌండేషన్ ఈ వేడుకను జరిపింది. ఇటీవల, శ్రీ విశ్వనాథ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో సంస్కృతాంధ్ర్రాలలో అష్టావధానం జరిగింది.అమెరికా నుండి లలితాదిత్య సంస్కృతంలో, రాజమండ్రి నుండి తాతా సందీప్ తెలుగులో ఒకే వేదికపై అంతర్జాల సహకారంతో విజయవంతంగా అవధానం నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రుచ్చకులు
పృచ్ఛకులు ప్రపంచంలోని నలుమూలల నుండి పాల్గొన్నారు. మామూలు రోజుల్లో ఒక సారస్వత సభ నిర్వహించాలంటే చాలా కష్టం. అనువైన సమావేశమందిరం అందుబాటులో ఉండాలి, అందుబాటులో ధరలో ఉండాలి. ఆవిష్కరించడానికి సెలబ్రిటీ స్టేటస్ కలిగిన అతిధులు రావాలి. వారికి సమయం కుదరాలి. సుప్రసిధ్ధ సాహిత్యవేత్తలు ప్రయాణం చేసి కార్యక్రమాల్లో పాల్గొనే వెసులుబాటు ఉండాలి. సభా ప్రాంగణం ప్రేక్షకులతో నిండాలి. ఇలా ఎన్నో సవాళ్లు ఉన్నాయి.సభలు నిర్వహించడమంటే ఎన్నో వ్యయప్రయాసలతో కూడి వుంటుంది.
సభ నిర్వహణ మాటలు కాదు
పెద్ద పెద్దవారితో సభ చెయ్యాలంటే అది ఇంకా కష్టం. అభిలాష ఉన్నా, ఇన్ని కష్టాలు, ఇబ్బందులు, అవరోధాల మధ్య సభలు చెయ్యడం, చేసి విజయవంతం చెయ్యడం ఆషామాషీ కాదు. కొన్ని సంస్థలు మాత్రమే చేయగలుగుతున్నాయి, భారీ స్థాయిలో సభలు చేసే సంస్థలు ఇంకా చాలా తక్కువగా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో, కరోనా కాలంలో సాంకేతికత పెద్ద వరంలా, అంతర్జాలం గొప్ప వేదికగా కలిసివస్తున్నాయి.చిన్న సంస్థలు, సామాన్యమైన వ్యక్తుల నుండి ఎవరైనా సభలు నిర్వహించగలుగుతున్నారు. వి ఐ పి, వివిఐపి అప్పాయింట్ మెంట్లు దొరకడమే చాలా కష్టం.
సారస్వత సభలో ఉపరాష్ట్రపతి
అటువంటిది ఉపరాష్ట్రపతి కూడా సారస్వత సభల్లో పాల్గొనే వెసులుబాటు ఆధునిక సాంకేతికత ఇస్తోంది. దీన్ని ప్రగతి ప్రయాణంగా భావిద్దాం. గవర్నర్లు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతులు రాజధాని కదిలి రావాలంటే చాలా నియమనిబంధనలు ఉన్నాయి. అంతర్జాలం వల్ల, వారి భవనాల నుండే పాల్గొనగలుగుతున్నారు. ఇందరు పెద్దలు హాజరవడంతో సభలు శోభాయమానంగా సాగుతున్నాయి. చిన్నా పెద్దా అందరూ హాయిగా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. కరోనా వాతావరణంలో, ఇటువంటి కార్యక్రమాలు మానసిక ఉత్సాహాన్ని కలుగజేస్తున్నాయి, ఒంటరితనం అనే భావనల నుండి దూరం చేస్తున్నాయి. మన చారిత్రక, సాంస్కృతిక మూలాల్లోకి తొంగి చూసి, సాగే ప్రచోదక శక్తుల్లా పనిచేస్తున్నాయి.
మెదడుకు పదును
మెదడుకు పనిపెడుతూ మానసిక ఆరోగ్యాన్ని పెంచుతున్నాయి. వంగూరి చిట్టెన్ రాజు ఆధ్వర్యంలో వంగూరి ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన 7వ ప్రపంచ సాహితీ సదస్సులో ఐదు ఖండాల నుండి వందలాదిమంది సాహిత్యవేత్తలు పాల్గొని అద్భుతంగా జయప్రదం చేశారు.విశాఖపట్నంకు చెందిన శ్రీ వాగ్దేవీ కళాపీఠం నిర్వహించిన పద్యానికి పట్టాభిషేకం కార్యక్రమంలోనూ ప్రపంచవ్యాప్తంగా, నాలుగేళ్ళ చిన్నారి నుండి 90ఏళ్ళ వృద్ధుల వరకూ వందలాది మంది పాల్గొన్నారు. విజయనగరంకు చెందిన గురజాడ సాంస్కృతిక సమాఖ్య నిర్వహించిన సదస్సు ఎంతో వైభవంగా జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ సూర్యప్రకాశరావు బృందం ఆధ్వర్యంలో నడిచే నవసాహితీ సంస్థ అద్భుతమైన వేడుకలు చేస్తోంది. విశ్వజనీన విపంచి పేరుతో చేసిన సదస్సు ఆద్యంతం రసవత్తరంగా సాగింది. సాహిత్యమేకాక, వాగ్గేయకార ఉత్సవాలు, సంగీత సభలు,సినీ గీతాలు కూడా అదే రీతిన సాగుతూ హోరెత్తుతున్నాయి. ఇది చాలా మంచి పరిణామం. ఇంకా ఎందరో సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకు సాగాల్సి వుంది. మనచేతిలో వున్న ఈ అంతర్జాలాన్ని అంతర్జాతీయంగా సద్వినియోగం చేసుకోవచ్చు. పేస్ బుక్, యూట్యూబ్ వేదికల నుండి విరివిగా ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతున్నాయి. గ్లోబల్ విలేజ్ అనేమాట ఇక్కడా అక్కరకు వస్తోంది.ఈబుక్, పిడిఎఫ్ ల ద్వారా పఠనం పెరుగుతోంది.డిజిటల్ మీడియా ద్వారా దృశ్యం, వీక్షణం కూడా పెరుగుతున్నాయి.
సాంస్కృతికంగా సాన్నిహిత్యం
ఇటువంటి కార్యక్రమాల ద్వారా, భౌతికంగా దూరంగా ఉన్నా, సాంస్కృతికంగా దగ్గరవుతున్నారు. దగ్గరవ్వడమే కాదు, ఏకమవుతున్నారు. పిల్లలను, యువతను ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చెయ్యడం చాలా అవసరం. ఆన్ లైన్ విద్యాభ్యాసం లాగానే, అంతర్జాల సహాయంతో సంస్కృతి, చరిత్రను తెలిపితే, లలిత కళల వైపు ఆకర్షితులవుతారు. మామూలు విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు రేపటి తరానికి చేరువవుతాయి. ఆధునిక సామాజిక నిర్మాణంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. ఆధునిక సాంకేతికతకు జే కొడదాం, సాంస్కృతిక ప్రచారానికి జేజేలు కొడదాం. జయహో!తెలుగు సంస్కృతి.