24 గోదా గోవింద గీతం
అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోర్ట్రి
శెన్ఱంగు త్తెన్-ఇలంగై శెత్తాయ్ తిఱల్ పోర్ట్రి
పొన్ఱచ్చకడం ఉదైత్తాయ్ పుగర్ పోర్ట్రి
కన్ఱుకుణిలా వెఱిందాయ్ కరిల్ పోర్ట్రి
కున్ఱుకుడైయా వెడుత్తాయ్ కుణమ్ పోర్ట్రి
వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోర్ట్రి
ఎన్ఱెన్ఱుమ్ శేవకమే యేత్తి ప్పఱైకొళ్వాన్
ఇన్ఱు యాం వందోం ఇరంగ్-ఏలోర్ ఎంబావాయ్
తెలుగు భావార్థ గీతిక
ఆనాడు రెండడుగుల లోకాల గొలిచిన పాద యుగళికి జయము జయము
వెడలి లంకాధీశు దునిమిన శ్రీరామ శౌర్యమునకు జయము జయము
శకటాసురుని దన్ని శిథిలమ్ముజేసిన శౌరికీర్తికిని జయము జయము
వత్సము విసిరి కపిత్థము కొట్టు పాదభంగిమకు జయము జయము
అరివీరుల ధైర్యమల్ల హరించు హరి శూలమునకు జయము జయము
కొండగొడుగు జేసి గోవులగాచిన గోవిందుదయకు జయము జయము
పోరునపరులతలలు తెంచి కేలనొప్పు చక్రమునకు జయము జయము
పరము వరమునిచ్చిమానోము నిల్పిన వరదునికి జయము జయము
ప్రతిపదార్థం:
అన్ఱు=ఆనాడు, ఇవ్వులగం=ఈ లోకమును, అళన్దాయ్! =కొలిచితివే! అడి =ఆ నీ శ్రీపాదమునకు, పోర్ట్రి (లేదా పోత్తి) =మంగళము, శెన్ఱు=వెళ్ళి, అంగు=అక్కడ, తెన్=అందమైన దక్షిణదిశయందున్న, ఇలంగై=ఆ లంకానగరమును, శెత్తాయ్!=నశింపచేసితివితిఱల్=ఆ బలమునకు, పోర్ట్రి=మంగళము, పొన్ఱ=కపట వేషము దాల్చిన, శకటం=శకటాసురుని, ఉతైత్తాయ్ =తన్నితివి, పుగర్ = ఆ నీ కీర్తికి, పోత్తి=మంగళము, కన్ఱు= దూడవేషం దాల్చిన వత్సాసురుని, కుణిలా = గోటీబిళ్ళవలె, ఎరిన్దాయ్ = విసరివేసితివి, కరల్ = నీ పాదభంగిమకు, పోత్తి = మంగళము,కున్ఱు = పర్వతమైన గోవర్ధనగిరిని, కుడైయా = గొడుగువలె, ఎడుత్తాయ్! = ఎత్తితివి, కుణం = ఆ నీ సహన గుణమునకు, పోత్తి = మంగళము, వెన్ఱు = జయించి, పగై = శత్తువులను, కెడుక్కుం = నశింపచేయు, నిన్ = నీయొక్క, కైయిల్ = చేతియందలి, వేల్ = బల్లెమునకు, పోత్తి = మంగళము, ఎన్ఱెన్ఱు = ఈ విధముగా, ఉన్ = నీ యొక్క, శేవగమే = వీర చరితలనే, ఏత్తి = స్తుతించి, పఱై కొళ్వాన్ = పఱై అను వాయిద్యవిశేషమునుఇన్ఱు = ఈ వేళ, యాం = మేము, వన్దోం= వచ్చితిమి, ఇఱంగు = దయ చూపుమా!ఏల్+ఓర్+ఎం+పావాయ్ = ఇదియే మా గొప్ప వ్రతము.
తాత్పర్యం: తమ కోరికపైన శయనాగారం నుంచి సభాభవనంలోకి నడిచి వచ్చిన శ్రీకృష్ణుడి పాదాలకు శ్రమ ఇచ్చామే అని గోపికలు నొచ్చుకున్నారు. గతంలో ఎన్నో సందర్భాలలో పరమాత్ముడు భక్తులకోసం కష్టాలు పడిన సందర్బాలలోఎవరూ మంగళం పాడలేదని, దృష్టి తీయలేదని గోపికలు అనుకుంటున్నారు. ఆ లోపం తీర్చాలని భావిస్తున్నారు.అది వారి భక్తి పారవశ్యం.
Also read: వేదగుహలలో పరమాత్మ ప్రకాశం
లక్ష్మీదేవి సుతి మెత్తగా పాదాలు ఒత్తినందుకే కందిన శ్రీహరి పాదాలు ఆనాడు వామనుడై ఆకాశ, పృథ్వీ లోకాలను రెండడుగులతో కొల్చినపుడు ఎత్తు పల్లాలు తాకి ఎంత కందిపోయాయో, క్రూరులైన రాక్షసులు, మృగాలతో నిండిన అడవులలో నడిచిన రామా నీ పాదాలు ఎంత బాధలు పడ్డాయో. పుట్టిన ఏడో రోజునే శకటాసురుడిని తన్నినప్పుడు క్రిష్ణయ్య పాదాలు ఎంత నొచ్చుకున్నాయో. వృత్రాసురుని రెండు చేతులతో ఎత్తి వెలగపండు రూపంలో చెట్టుకు వేలాడుతున్న మరో రాక్షసుడిమీదకు విసరడానికి నేలపైన కాళ్లు గట్టిగా నిలబెట్టినపుడు కన్నయ్య కాళ్లకెంత శ్రమ కలిగిందో, వారంరోజుల పాటు గోవర్ధన పర్వతం ఎత్తిన ఆ బాలుడిని వేలు ఎంతగా వత్తిడికి గురైందో, అప్పుడు ఆ నారాయణుడి దివ్యపాదారవిందాలకు మంగళం ఎవరు పాడారు. ఏమో, పాడారో లేదో, కనుక మేమంతా ఈ రోజు నీకిదే మంగళం పాడుతున్నాము. సముద్రమధ్యంలో దుర్భేద్యమైన కోట, దారి మధ్య బంగారు నగరాన్ని నిర్మించుకుని తనను ఎవరూ ఏమీ చేయలేరనే దురహంకారంతో సీతను ఎత్తుకు పోతే, అక్కడకి చేరి రావణుడి స్థానబలిమికి భయపడకుండా పరాక్రమించి రావణుని సంహరించడం ఎంత సాహస కార్యం? అంతపనిచేసిన శ్రీరాముడికి మంగళం పాడుతున్నారు. శత్రువులను జయించే నీ వేలాయుధానికి మంగళం అన్నారు గోపికలు. నిజానికి వారికి కావలసింది కేవలం శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించడమే. ఊళ్లో వారి కోసం పైకి వారు పఱై అనే వాయిద్య పరికరం ఢక్కాను అడుగుతున్నారు.
Also read: సింహగతిలో సింహాసనం చేరినకృష్ణ సింహము
సింహాననప్పాట్టు తరువాత మంగళాశాసనప్పాట్టు ఈ24 వ పాశురం. అద్భుతమైన మంగళ హారతి ఈ గోదా గీత గోవిందమ్.
గోపికలు రమ్మని పిలువగానే శ్రీకృష్ణుడు శయనాగారం నుంచి సింహం వలె ఒక్కోసారి గజరాజు వలె గంభీరంగా నడిచి వచ్చి సింహాసనమ్మీద కూర్చున్నాడు. నీళాదేవి ద్వారము వరకు వచ్చి మంగళాశాసనం చేసి, ఆ తరువాత ఆయన తోపాటు సింహాననం మీద కూర్చున్నారు. ఒకపాదము పాదపీఠిపైనుంచి మరొకటి తొడమీద పెట్టుకున్నప్పుడు స్వామి పాదం ఎర్రగా కందినట్టు కనిపించిందట. అయ్యో స్వామిని ఎంత శ్రమ పెట్టాము?
భక్తులకోసం ఆయన తన శ్రమను లెక్క చేయడట. ఆనాడు కురుక్షేత్రంలో అర్జునుడు చెప్పగానే ఉభయ సైన్యముల మధ్య రధాన్ని నిలిపిన సారథి వలె భక్తుల ఆజ్ఞ శిరసావహించి భగవంతుడు శ్రమపడుతున్నాడు. నిజానికి వ్రతఫలం అడుగుదామని గోపికలు వచ్చారు. కాని వచ్చిన పని మరిచి గోపికలు, గోదాదేవి పరమాత్ముడి పాదాలకు రక్ష కట్టి మంగళం పాడుతున్నారు ఈ పాశురంలో. జగద్రక్షకుడిని తాము రక్షకట్టి కాపాడుకోవాలనుకుంటున్నారు. ఇది ప్రేమ తప్ప మరొకటి కాదు.
Also read: భాగవతం ఇవ్వలేదని పోతన్న మీద రాజద్రోహనేరం మోపిన రాజెవరు?
పెళ్లికొడుక్కు, వధువుకు, వటుడికి, పుట్టిన రోజు జరుపుకున్న పిల్లలకు, కొత్త దుస్తులు వేసుకున్న వారికి అమ్మమ్మ దిష్టి తీయడం మనకు తెలుసు. చెడుచూపుల ప్రభావాలను తొలగించడానికి చూపుదోషాలను తొలగించడానికి దిష్టి తీస్తారు. భగవంతుడి అర్చామూర్తికి ఉత్సవాలలోనూ మూలవిరాట్టుకు నిర్ణీత సందర్భాలలోనూ మంగళాశాసనం చేస్తారు హారతులిస్తారు. కీర్తనలలో మంగళ హారతి కీర్తనలు ఉంటాయి. ముఖ్యంగా ఆడపడచులు ముత్తైదువలు హారతి పాటలు పాడుతూ ఉంటారు. అందులోనూ హరికీర్తనే ఉంటుంది. అసలు ద్వయమంత్రానుసంధానమే దిష్టి తీయడమంటే అని కూడా పెద్దలు చెబుతారు.
అయితే భగవంతుడై అద్భుత కార్యాలను సాధించి మోహనరూపుడూ మనోహరుడూ అయినప్పుడు హారతులు ఇవ్వడం, మంగళం పాడడం ఎవరి బాధ్యత? ఆచార్యులు, అర్చకులు, ఆళ్వారులు ఆ పని చేస్తుంటారు. ఆళ్వారులు మంగళం పాడిన సన్నిధానాలను దివ్యదేశాలని పిలుస్తారు. భారత్ నేపాల్ లో కలిసి ఇటువంటి శ్రీవైష్ణవ దివ్య క్షేత్రాలు 108 ఉన్నాయి.
గోదాదేవి గోపికలతో కలిసి తిరుప్పావు లో మంగళం పాడే బాధ్యతను స్వీకరించిన ఆళ్వారులలోకి వస్తారు. యశోద, దేవకీదేవి, కౌసల్య, అదితి తదితర తల్లుల బాధ్యతను గోదాదేవి స్వీకరించారు. ఎప్పుడెప్పుడో పాడవలసిన మంగళ హారతులు ఎవరూ పాడలేదే అనే ఆవేదనతో, ఆర్తితో భక్తితో పరమాత్ముడి పాదాలకు పదపదాన మంగళ కరమైన పదాలతో మంగళం పాడుతున్నారు గోదాదేవి ఈ పాశురంలో.
Also read: చీమకైనా బ్రహ్మకైనా అహంకారం సమానమే