హిందూ స్త్రీల దాస్య విముక్తికి, సమానత్వ సాధనకు కృషిచేసి సంఘ సంస్కరణ కర్తగా, స్వతంత్ర భారతావని సాంప్రదాయాలు, విధానాల రూపశిల్పిగా, నవభారత నిర్మాతగా పేరెన్నిక గన్నారు చాచా నెహ్రూ. వివాహం కనీస వయస్సును 12 నుండి 15 కి పెంచడం, సతులు పతుల నుండి విడాకులు తీసుకుంటే ఆస్తి వారసత్వ హక్కు పొందడం, వరకట్న పద్ధతిని చట్టవిరుద్ధం చేయడం, దేశ తొలి ప్రభుత్వాధినేతగా, సమాజ సంస్కరణలలో సఫలీకృతులయ్యారు జవహర్ లాల్. న్యాయవాదిగా పరిపూర్ణ రాజకీయవేత్తగా, రచయితగా, దేశ స్వాతంత్ర్యానంతరం తొలి ప్రధానిగా, భారత రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన నెహ్రూ – గాంధీ కుటుంబ మూలపురుషుడిగా సుపరిచితుడు అయిన నెహ్రూ నేటి ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ నగరంలో
సంప్రదాయ శిష్ట కుటుంబం కాశ్మీరీ బ్రాహ్మణ వంశంలో, ధనిక కుటుంబంలో, ప్రముఖ న్యాయవాది మోతిలాల్ నెహ్రూ, స్వరూప రాణిల తొలి సంతానంగా 14 నవంబర్ 1889న జన్మించారు.
అలహాబాద్ లో, లండన్ లో విద్యాభ్యాసం
సోదరీమణులైన కృష్ణ, విజయలక్ష్మి పండిట్ లతో పాటు, “ఆనంద భవన్” లో ఆంగ్ల సాంప్రదాయ శిష్ట పద్ధతులలో పెరిగారు. బాల్యంలోనే హిందీ, సంస్కృతాలు, భారత సారస్వత గ్రంథాల పఠనా సక్తులు అయినారు. ఇండియన్ సివిల్ సర్వీసులో అర్హత పొందాలన్న తండ్రి కోరికను అనుసరించి, ఇంగ్లాండ్ నందలి హార్రో స్కూల్ కి వెళ్ళాడు. పాఠశాల విద్య అక్కడ పూర్తిచేసి, 1907లో, కేంబ్రిడ్జ్ లో ప్రవేశ పరీక్ష రాసి, జీవశాస్త్ర అధ్యయనానికి కళాశాలకు వెళ్లి, 1910లో పట్టా పొందారు. అనంతరం న్యాయశాస్త్ర అధ్యయనానికి ఇన్నెర్ టెంపుల్ వెళ్లి, 1912లో ఉత్తీర్ణుడై అక్కడే న్యాయవాద వృత్తి చేపట్టాడు. వెనువెంటనే భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. 1919లో జలియన్వాలా బాగ్ దుర్ఘటనకు ప్రభావితుడై, కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ స్వాతంత్ర్య సంగ్రామానికి ఆకర్షితుడై, సంగ్రామంలో తన శక్తులు ఒడ్డుటకు ఉద్యుక్తుడయ్యాడు. మొదట మోతిలాల్ నెహ్రూ కుమారుని నిర్ణయాన్ని వ్యతిరేకించినా, తర్వాత ఆయన సైతం సంగ్రామంలో భాగస్వామి అయినాడు.
గాంధీ నమ్మిన బంటు
అనంతరం మహాత్ముని నమ్మిన బంటుగా నెహ్రూ గుర్తింపు పొందాడు. ఆ సమయంలో 9 ఏళ్ళు జీవితం అనుభవించాడు. జైలుజీవిత సమయంలోనే 1334 లో “గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’, 1936 లో తన జీవిత చరిత్ర, 1946లో “ది డిస్కవరీ ఆఫ్ ఇండియా” రచనలు పూర్తిచేశాడు. తొలిసారిగా గాంధీ నాయకత్వ పోరాటంలో 1929 లో భారత జాతీయ కాంగ్రెస్ నేతగా, లాహోర్ సమావేశాలకు నాయకత్వం వహించాడు. 1936,1937,1940 లలోనూ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైనాడు. యువకునిగా ఉన్న నాటి నుండే జాతీయ కాంగ్రెస్ లో, వామపక్ష భావజాల ప్రభావితుడై, సంపూర్ణ స్వాతంత్ర్య సముపార్జన ఆసక్తుడై, గాంధీ సలహాలతో, ప్రజాకర్షణ గల నేతగా, సంస్కరణవాదిగా, స్వాతంత్ర్య సంగ్రామంలో ముఖ్య భూమిక నిర్వహించి గాంధీ అనంతరం, రెండవ అగ్రశ్రేణి నాయకుడిగా గుర్తింపు పొందారు.1916లో కాశ్మీరీ బ్రాహ్మణ వంశస్థులు రాలైన కమలా కౌల్ ను పెళ్ళి చేసుకున్నారు. కుమార్తె ఇందిరా ప్రియదర్శిని 19 17 నవంబర్ 19న జన్మించింది. కమలా నెహ్రూ 19 46 లో క్షయ వ్యాధితో మృతి చెందగా, కుమార్తె ఇందిర, సోదరి విజయలక్ష్మిలపై ఎక్కువగా ఆధార పడడం జరిగింది.
17 ఏళ్ళు ప్రధానిగా
1947 నుండి 64 వరకు దేశ ప్రధానిగా ఉన్న నెహ్రూ, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు లో ప్రధాన పాత్ర పోషించారు. 1947 నుంచీ ప్రధానిగా ఉన్నప్పటికీ 1952 లో దేశ తొలి ప్రధాని గా ఎన్నికైనారు. 1947 ఆగస్టు 15న స్వతంత్ర్య భారత పతాకాన్ని ఎగరవేసిన తొలి భారతీయుడిగా గౌరవం దక్కించుకున్న ఘనత ఆయనది. పార్లమెంటరీ తరహాలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, స్వేచ్ఛావాదం, పేద, అణగారిన వారి పట్ల అనురాగం, ప్రధానిగా ఆయన రూపొందించిన విధానాలపై ప్రభావం చూపాయి.1964 మే 27న తన 74వ ఏట పరమపదించాడు. పంచశీల సూత్ర అనువర్తిగా, అలీనోద్యమ స్థాపనకులలో ఒకరిగా, రెండో ప్రపంచ యుద్ధానంతర కాల అంతర్జాతీయ ప్రముఖుడిగా, గౌరవసూచకంగా “పండిట్” గా పిలువబడిన నెహ్రూ, సుదీర్ఘ పదవీకాలం అనుభవాన్ని రంగరింప చేసుకున్న కూతురు ఇందిర, మనమడు రాజీవ్, ప్రధాని పదవులు పొందడానికి స్ఫూర్తి ప్రసాదించారనడంలో అతిశయోక్తి లేదు.
(నవంబర్ 14 నెహ్రూ జయంతి)