రామాయణమ్ – 89
జనులు నడిచే కాలి బాటలో దీనుడై నిస్సహాయముగా పడిఉండి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పక్షిరాజు జటాయువును చూడగానే రామునిలో శోకము వరద గోదావరి అయ్యింది.
‘‘అయ్యో ఎంత దురదృష్టవంతుడను నేను. రాజ్యము పోయినది. వనవాసము ప్రాప్తించినది. జీవన సహచరి జాడ లేకుండగా పోయినది. నా తండ్రికి మిత్రుడు, వృద్ధుడు, తండ్రి వంటి జటాయువు కూడా మరణించినాడు. ఆహా ఏమి నా దౌర్భాగ్యము! ఇది అగ్నిని కూడా కాల్చివేయగలదు. ఇప్పటికిప్పుడు నేను మహాసముద్రములో దూకినచో నా దౌర్భాగ్యపు వేడి సెగలు సంద్రాన్ని కూడా ఆవిరి చేయగలవు.’’
Also read: రాముడిని శాంతపరచడానికి లక్ష్మణుడి ప్రయత్నం
రక్తపు సరస్సులో తేలియాడుతున్న ఆ జటాయువు శరీరాన్ని కౌగలించుకొని ‘‘నా ప్రాణమైన సీత ఎక్కడ ఉన్నది?’’ అని మాత్రము పలికి నేలమీద పడిపోయాడు శ్రీ రాముడు.
‘‘లక్ష్మణా చూశావా? నాకోసము తన ప్రాణాలను తృణప్రాయముగా నెంచిన ఈ మహానుభావుడి దురవస్థ చూశావా? నాడి చాలా దుర్బలముగా నున్నది.కంఠస్వరము చాలా బలహీనముగా ఉన్నది. ఓ జటాయూ, నీకు మాటాడగలిగే శక్తి ఉన్నట్లైన ఒక్కసారి సీత విషయము, నీ వధ విషయము మాకు ఎరిగింపుము.’’
‘‘ఏ కారణము చేత రావణుడు సీతను అపహరించినాడు? నేను అతనికి చేసిన అపకారమేమి? ఆ సమయములో నా సీత ఎలా ఉన్నది ?ఎట్లా అయిపొయింది ? నీతో ఏమి చెప్పినది ? ఆ రాక్షసుడెవ్వడు? ఆతని రూపమెద్ది? ఎట్టి పరాక్రమ వంతుడు? వాడు ఎచటివాడు? తండ్రీ నాకు సమాధాన మెరిగింపుము’’ అని ఆతురతతో, ఆవేదనతో జటాయువును ప్రశ్నిస్తున్నాడు రామచంద్రుడు.
Also read: రామచంద్రుని వ్యధాభరితమైన క్రోధావేశం
రాముని ప్రశ్నలను విన్న జటాయువు నెమ్మదిగా కళ్లువిప్పి రాముని వైపు చూస్తూ క్షీణించిన స్వరముతో, ‘‘రామా, రాక్షసరాజైన రావణుడు మాయామేఘాలను, అధికమైన గాలినీ సృష్టించి ఆకాశ మార్గాన అతివ సీతను అపహరించి తీసుకొనిపోయినాడు. సీతను రక్షించుటకోరకై నేను వానితో యుద్ధము చేయగా, నేను అలసిపోయిన సమయములో వాడు నా రెక్కలు తెగ నరికి సీతను తీసుకొని దక్షిణ దిక్కుగా వెళ్ళినాడు.
‘‘రామా ఇక నా ప్రాణములు ఎక్కువ సేపు నిలువవు. నా కంటికి బంగారపు చెట్లు అగుపడుతున్నాయి.( మృత్యువు ఆసన్నమైన వారికి బంగారపు చెట్లు కనపడతాయట) రావణుడు సీతను అపహరించిన ముహూర్తము” విందము.” ఈ ముహూర్తమందు పోయిన సంపదలు, ధనము యజమానికి తిరిగి లభిస్తాయి. ఈ విషయము ఆ రాక్షసుడు గమనించలేదు. రామా. నీకు శుభమగుగాక’’ అని అంటూ నోటినుండీ ముక్కునుండీ రక్తము స్రవిస్తూ ఉండగా తిరిగి మాటలాడాడు ‘‘రామా, ఆ రాక్షసుడు విశ్రవసుని కుమారుడు. సాక్షాత్తూ కుబేరుని సోదరుడు’’ అని చెపుతూ చెపుతూ ప్రాణములు వదలినాడు.
Also read: సీతమ్మకోసం రామలక్ష్మణుల వెదుకులాట
‘‘వినువీధులలో హాయిగా ఎగురుతూ నచ్చిన ఆహారాన్ని భుజిస్తూ క్రూర రాక్షసులకు నిలయమైన ఈ జనస్థానములో నివసిస్తున్నగృధ్రరాజు జటాయువు నా కొరకు తన ప్రాణాలర్పించాడుకదా! ఎప్పటివాడీయన? మనతండ్రి తాతల కాలము నాటివాడు. వృద్ధుడు. అయినా ధర్మము కోసము తన ప్రాణాలను తృణ ప్రాయముగానెంచినాడు కదా! ఆహా, ధర్మమార్గాన్ని అవలంబించువారు తిర్యగ్జంతువులలో కూడా ఉన్నారనడానికి ఈ జటాయువే నిదర్శనము. అయ్యో కాలాన్ని ఎవ్వరూ దాటలేరుకదా!
‘‘లక్ష్మణా, జటాయువు మరణము బాధించినంతగా సీతాపహరణము వలన కలిగిన దుఃఖము కూడా బాధించలేదు. మన తండ్రి నాకు ఎంత పూజ్యుడో, గౌరవింప తగినవాడో జటాయువు కూడా అంతే పూజింప తగిన వాడు, గౌరవింప తగినవాడు.
Also read: సీత క్షేమమేనా? రాముడిని మనసు అడుగుతున్న ప్రశ్న
లక్ష్మణా, వెంటనే చితిపేర్చు. అగ్ని మంధనము చేసి ఈయనకు దహన సంస్కారములు చేయవలె….’’అని చెప్పగా లక్ష్మణుడు అన్న ఆజ్ఞను పాటించి చితి పేర్చినాడు.
రాముడు జటాయువు శరీరమును చితిపై పరుండబెట్టి శాస్త్రోక్తముగా మంత్రములు పఠిస్తూ నిప్పంటించినాడు .
తన బంధువుకు జరిపినట్లుగా పిండప్రదానాది కార్యక్రమములన్నిటినీ, పితృ దేవతల కోరకై జపించవలసిన అన్ని మంత్రములనూ జపిస్తూ పూర్తిచేసినాడు.
ఈ విధముగా జటాయువుకు అంతిమ సంస్కారములు పూర్తిచేసి పడమర దిక్కుగా ప్రయాణము సాగించారు రామలక్ష్మణులు.
NB
ఇక్కడ మనకు రాముడి వ్యక్తిత్వము కనపడుతుంది.
మనకు నేటి ప్రపంచములో, తన బాధ ప్రపంచము బాధ అనుకొనే వ్యక్తులే ఎక్కువగా తారస పడుతున్నారు. అంత దుఃఖములో కూడా తన కర్తవ్యము మరచిపోలేదు రాఘవుడు. ఆ, ఇది పక్షే కదా దీనికేమిటి దహన సంస్కారములు చేసేది అని భావించలేదు. పైగా జటాయువును తన తండ్రితో సముడుగా భావించి ఆయనకు చేయవలసిన సంస్కారాలన్నీ శాస్త్రోక్తముగా పూర్తిచేశాడు. అదీ సకల భూత మనోహరుడు, సకల జీవ సంరక్షకుడు అయిన రాముని వ్యక్తిత్వము! తన బాధలో పడి తన కర్తవ్యాన్ని మరచిపోలేదాయన.
Also read: సీతమ్మకు గడువిచ్చి అశోకవనమునకు తరలించిన రావణుడు
వూటుకూరు జానకిరామారావు