రామాయణమ్ – 80
‘‘రామా రామా’’ అంటూ సీతమ్మ చేసే ఆక్రందనలు వనమంతా ప్రతిధ్వనిస్తున్నాయి.
ఓ లక్ష్మణా, మహాబాహూ! నన్ను రావణుడు అపహరించి తీసుకు వెడుతున్నాడు. చూడవయ్యా. రామా, ధర్మము కోసము జీవితాన్నీ సుఖాన్నీ సంపదలనూ విడిచివేసావు కదయ్యా. అధర్మాత్ముడు వీడు రావణుడు నన్ను అపహరించి తీసుకుపోవటం నీవు చూడటము లేదా? ఓ రామా ఎక్కడున్నావు. ‘‘ఓయీ రావణా, నీ పాప ఫలాన్ని నీవు కొంతకాలము తరువాత అయినా అనుభవించక తప్పదు. రావణా, ఎవరికైనా దుష్టకర్మ ఫలము వెంటనే అగుపడదు. పాపము అనే విత్తనాన్ని నీవు ఇప్పుడు నాటావు. త్వరలో అది పండగలదు.
Also read: సీతను రథములో బలవంతంగా ఎక్కించుకున్న రావణుడు
మృత్యువు అనే పంటను నీవు అనుభవిస్తావు.
అయ్యో! ఈ నాటికిగానీ కైక కోరిక,ఆమె బంధువుల కోరిక తీరినది.
ఓ కొండగోగు వృక్షములారా, రావణుడు నన్ను అపహరించాడని రామునికి తెలపండి.
ఓ ప్రస్రవణ పర్వతమా, నీకు నమస్కారము. నన్ను రావణుడు ఎత్తుకెళుతున్నాడని రామునికి తెలపండి.
తల్లీ గోదావరీ నన్ను రావణుడు అపహరించాడని రామునికి తెలుపమ్మా.
ఓ మృగములారా, పక్షులారా, రామునికి తెలపండి వీడు చేసిన దుష్కార్యము గురించి.
ఓ ప్రాణులారా, నీ ప్రాణాన్ని రావణుడు దొంగిలించి తీసుకు వెడుతున్నాడని రామునికి తెలపండి.
Also read: రావణుడికి సీతమ్మ హెచ్చరిక
దుఃఖార్తయై ,దీనముగా విలపిస్తున్న సీతాదేవికి ఒక చెట్టు మీద ఉన్న జటాయువు కనబడ్డాడు. ఆయనను చూడగానే ప్రాణము లేచివచ్చినట్లై ఒక్క పెట్టున అరిచింది సీతమ్మ.
ఓ జటాయూ, పాపాత్ముడైన రావణుడు నన్ను అనాధురాలిని వలే తీసుకు పోతున్నాడు.
జటాయూ, నీవు వీనిని ఎదిరింపలేవు. వీడు క్రూరుడు. దుష్టబుద్ది. నా అపహరణానికి సంబంధించిన విషయములన్నీ రామలక్ష్మణులకు నీవే ఎరిగింపుము’’ అని జాలిగొలిపేటట్లుగా రోదించే రామపత్నిని జటాయువు చూశాడు.
అడవంతా ప్రతిధ్వనించే సీతాదేవి ఆర్తనాదాలు జటాయువును నిద్రలేపాయి. అటూ ఇటూ ఒక్కసారి తలతిప్పిచూశాడు. రావణుడు, అతనిచేత బలాత్కారముగా కొనిపోబడుతున్న సీతాదేవి కనిపించారు.
Also read: రావణుడికి అమాకురాలైన సీత అతిథి మర్యాదలు
జటాయువు రావణుని ఉద్దేశించి, “రావణా, నేను సనాతన ధర్మాన్ని పాటించే గృధ్రరాజును. నాపేరు జటాయువు. నీవు ఇంద్రవరుణులతో సమానుడైన రాముని ధర్మపత్నిని అపహరించావు. ధర్మపరాయణుడైన రాజు పరులభార్యలను చేతితో తాకవచ్చునా? పైగా రాముడు రాజు. ఆయన భార్యను రక్షించవలెను గానీ ఈ విధముగా తాకి ఆవిడను అవమానించతగునా? నీ భార్యలను నీవు రక్షించుకొనునట్లే పరులభార్యలను రక్షించవలసిన బాధ్యత కూడా రాజువైన నీకు లేదా?
‘‘రావణా, ప్రజలందరు తమకు జీవనవ్యవహారాలలో ఏ విధమైన సందేహము తలెత్తినా వారు రాజునే అనుసరింతురు. వారికి రాజే ప్రమాణము. రాజే ఆదర్శము. పుణ్యమైనా పాపమైనా ధర్మమైనా వారికి రాజే ఆధారము! అట్టి రాజైన నీవు ఇట్టి పాపకార్యము చేయ తగునా? ఇంత పాపకార్యము చేసే నీకు అసలు రాజ్యాధికారము ఎలా ప్రాప్తించినది? రాముడు నీ దేశమునందుకానీ, నీ పురమునందుకానీ ఏవిధమైన అపరాధమూ చేయలేదుకదా! అట్టి రామునియందు నీవిట్టి అపకారము ఏల చేయుచున్నావు?
Also read: ఈటెల వంటి మాటలతో లక్ష్మణుడిని బాధించిన సీత
‘‘రాముని భార్యను చంపయత్నించి ఆ ప్రయత్నములో ముక్కుచెవులు పోగొట్టుకొని రాముని మీద ప్రతీకారము తీర్చుకొనుటకు తనంతతానే రాముని మీదకు ఖరుని ఉసిగొల్పిన శూర్పణఖ చేసిన తెలివిమాలినపనిలో రాముని దోషమేమున్నది? నీవు వెంటనే సీతాదేవిని విడిచిపెట్టుము లేనియెడల ఆవిడ నీపాలిట నిప్పుకణముగా మారి నిన్నుచుట్టుముట్టి నిన్నుదహించివేయగలదు. నీవు భయంకరమైన విషమును చిమ్ముతూ దారుణమైన కోరలు కలిగిన మహావిషసర్పాన్ని కొంగునకట్టుకున్నావు. నీ కంఠాన్ని సమీపించే యమపాశాన్ని గుర్తించలేకున్నావు!
‘‘రావణా, మనిషి తను మోయగలిగిన బరువును మాత్రమే మోయాలి. జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే భుజించాలి. సీతాపహరణము నీకు మోయలేని బరువు. అజీర్ణముచేయు ఆహారము.లోకమందు ఎవరైనా తమకు కీర్తిని కలుగచేసే పనులు చేస్తారు! అపకీర్తినిచ్చి, మృత్యు ద్వార ప్రవేశము కలిగించు పనులు చేస్తారా?
‘‘రావణా, నేను పుట్టి అరువది వేల సంవత్సరములయినది. నేను నా తండ్రినుండి తాతలనుండి సంక్రమించిన రాజ్యమును యధావిధిగా పాలించుచున్నాను. నేను ముసలివాడను. నీవు యువకుడవని అనుకుంటున్నావేమో. సీతను వదిలిపెట్టి వెళ్ళకపోతే నిన్ను ఇక్కడ నుండి అంగుళమైనా కదలనీయను. నీవు శూరుడవైతే రా! నాతో యుద్ధము చేయి’’ అని అంటూ ధర్మమూర్తి అయిన ఆ జటాయువు రావణుని హెచ్చరించాడు.
Also read: మారీచుడిని మట్టుపెట్టిన రాముడు
వూటుకూరు జానకిరామారావు