ఆదివారంనాడు కన్నుమూసిన వరిష్ఠ నాయకుడు జస్వంత్ సింగ్ బహుముఖ ప్రజ్ఞావంతుడు. అటల్ బిహారీ వాజపేయికి అంతేవాసిగా ఉంటూ జాతీయ రాజకీయాలలో ఉన్నత పదవులు అలంకరించిన వ్యక్తి ఆయన. రాజస్థాన్ రాజవంశానికి చెందిన జస్వంత్ దేశ రక్షణమంత్రిగా, విదేశాంగమంత్రిగా, ఆర్థిక మంత్రిగా పని చేశారు. దిల్లీ ఆర్మీ హాస్పిటల్ లో ఉదయం గం. 6.55కి గుండెపోటు వల్ల 82 ఏళ్ళ జస్వంత్ సింగ్ మరణించారు. ఆయన జూన్ 25 నుంచీ ఆస్పత్రిలోనే ఉన్నారు.
అజ్మీర్ మాయో కాలేజిలో చదువుకున్న జస్వంత్ సింగ్ 1950, 60లలో భారత సైన్యంలో అధికారిగా పని చేశారు. దేశంలో అత్యంత సుదీర్ఘంగా పార్లమెంటు సభ్యులుగా ఉన్నవారిలో ఆయన అగ్రగణ్యుడు. ప్రథమంగా సైనికాధికారిగానూ, అనంతరం రాజకీయ నాయకుడిగానూ జస్వంత్ సింగ్ దేశానికి ఎనలేని సేవలు అందించారంటూ ప్రధాని నరేంద్రమోదీ సంతాప సందేశంలో అన్నారు.
సంస్కరణల అనంతర కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసిన ఆర్థికమంత్రులలో జస్వంత్ సింగ్ ఒకరు. 1 మే 1998లో భారత్ అణుపరీక్ష పోఖ్రాన్ లో రెండో సారి నిర్వహించినప్పుడు విదేశాంగమంత్రిగా ఆయనే ఉన్నారు. లాహోర్ నుంచి దిల్లీకి బస్ ప్రయాణం ఏర్పాటు చేసినవారిలో ఆయన ఒకరు. 1999లో ఈ బస్సు ప్రయాణం భారత్- పాకిస్తాన్ ల మధ్య సంబంధాలను మెరుగుపరిచింది. చైనాతో భద్రతా వ్యవహారాలపైన చర్చలు జరపడంలో కూడా జస్వంత్ చొరవ ప్రదర్శించారు. యాభై రోజుల పాటు సాగిన కార్గిల్ యుద్ధాన్ని జయప్రదంగా ముగించడంలో సైతం జస్వంత్ సింగ్ పాత్ర కీలకమైనది.
అయితే, ఉగ్రవాదులు భారత విమానాన్ని కందహార్ కు హైజాక్ చేసి తీసుకొని వెళ్ళినప్పుడు వారి డిమాండ్ తీర్చే క్రమంలో జైలులో ఉండిన కరడుకట్టిన ఉగ్రవాదులను వెంటబెట్టుకొని కందహార్ వెళ్ళి హైజాకర్లకు అప్పగించి హైజాక్ అయిన విమానాన్ని సురక్షితంగా వెనక్కి తీసుకొని వచ్చిన కేంద్ర మంత్రి కూడా జస్వంత్ సింగ్. మంచి పార్లమెంటేరియన్ గా, సమర్థుడైన మంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెరమరుగైన నాయకులలో అడ్వాణీ, మురళీమనోహర్ జోషీతో పాటు జస్వంత్ సింగ్ ఒకరు. ప్రధానితో పాటు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, తదితర నాయకులు జస్వంత్ సింగ్ మరణం పట్ల సంతాపం వెలిబుచ్చారు.