- సూటిపోటి మాటలతో బుమ్రా, సిరాజ్ ల వేధింపు
- క్రికెట్ ఆస్ట్ర్రేలియాకు భారత టీమ్ మేనేజ్ మెంట్ ఫిర్యాదు
ఆస్ట్రేలియా క్రికెట్ ప్రధాన వేదికల్లో ఒకటైన సిడ్నీని తలచుకోగానే భారత క్రికెట్ అభిమానులకు ముందుగా అక్కడి మంకీగేట్ వివాదమే గుర్తుకు వస్తుంది. 13 ఏళ్ల క్రితం చోటు చేసుకొన్నఆ మంకీగేట్ ఉదంతం ప్రస్తుత 2021 సిరీస్ లోని మూడోటెస్టులోనూ మరో రూపంలో వెలుపలకు వచ్చింది.
ప్రస్తుత సిరీస్ లో భాగంగా సిడ్నీలో జరుగుతున్న మూడోటెస్ట్ మ్యాచ్ మూడోరోజుఆటలో భారత బౌలర్లు జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ల పట్ల కంగారూ అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలతో అనుచితంగా ప్రవర్తించడం పెద్దమనుషుల క్రీడ క్రికెట్ కే మరోసారి తలవంపులు తెచ్చింది.
Also Read : ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ నుంచి జడేజా అవుట్
అనుచిత ప్రవర్తన
కరోనా నిబంధనల కారణంగా సిడ్నీ స్టేడియంలోకి రోజుకి కేవలం 10వేల మంది అభిమానులను మాత్రమే అనుమతిస్తున్నారు. అయినా అక్కడక్కడ ఉన్న అభిమానుల్లో కొందరు భారత బౌలర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం ఆటకే మాయనిమచ్చగా మారింది. బుమ్రా, సిరాజ్ లపై జాత్యహంకార వ్యాఖ్యలతో వేధించారు. దారుణంగా అవమానపరిచారు. మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానుల్లో కొంతమంది డ్రింక్స్ సపోర్టర్స్ వర్ణ వివక్ష వ్యాఖ్యలకు పాల్పడ్డారు.
ఈ పరిస్థితిని గమనించిన భారత సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ అజింక్య రహానే, రవిచంద్ర అశ్విన్, రోహిత్ శర్మ ఈ అంశాన్ని మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఫీల్డ్ అంపైర్లు పౌల్ రైఫిల్, పౌల్ విల్సన్ అంపైర్లతో ఈ అంశంపై రహానే చాలా సేపు చర్చించాడు.
మ్యాచ్ రెఫరీకి ఫిర్యాదు
ఆట ముగిసిన 5 నిమిషాల తర్వాత కూడా ఈ అంశం గురించి అంపైర్లతో చర్చ కొనసాగించారు. ఆస్ట్ర్రేలియా క్రికెట్ బోర్డుకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి సైతం ఈ ఫిర్యాదును తీవ్రంగానే పరిగణించే ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.
Also Read : సిడ్నీటెస్ట్ మూడోరోజున అశ్విన్ ప్రపంచ రికార్డు
మూడోరోజు ఆటలో భాగంగా చోటు చేసుకొన్న ఈ ఘటన అంతర్జాతీయ క్రికెట్ వర్గాలలో కలకలం రేపింది. ఈ ఉదంతాన్ని నిర్వాహక సిడ్నీ క్రికెట్ సంఘం సైతం తీవ్రంగానే పరిగణించింది. భారత బౌలర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల గురించి సీసీ ఫుటేజీ ద్వారా ఆరా తీసి తగిన చర్య తీసుకుంటామని ప్రకటించింది.
ఇంగ్లండ్ ఆదర్శం
అంతేగాక వర్ణ వివక్షను వ్యతిరేకిస్తూ 2019 వరల్డ్ కప్ సాధించిన ఇంగ్లండ్ జట్టు గురించి ఒక వీడియోను సైతం విడుదల చేసింది. ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్ సాధించడంలో జోఫ్రా ఆర్చర్ కీలకపాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయడంతో ఆర్చర్ సూపర్ ఓవర్‌ను సూపర్‌గా వేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతను నల్ల జాతీయుడు. కానీ ఏనాడు అతన్ని ఇంగ్లండ్ జట్టు వేరుగా చేసి చూడలేదంటూ వివరించింది. క్రికెట్ అంటేనే పెద్దమనుషుల క్రీడ. తుది జట్టులో 11 మంది ఉంటే వారు విభిన్న వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. వైవిధ్యం లేకపోతే క్రికెట్ అనే పదానికి అర్థం లేదు. ఇలా వర్ణ వివక్ష వ్యాఖ్యలతో ఆటగాళ్లను మానసికక్షోభకు గురి చేయడం ఏవిధంగానూ సమర్థనీయం కాదంటూ ట్వీట్ చేసింది.
సోషల్ మీడియాలో వైరల్
కాగా సిరాజ్, బుమ్రాలపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా అభిమానులు సిడ్నీఅభిమానులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే సిడ్నీ మైదానంలో ఆసీస్ మాజీ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ , భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ ల మధ్య చోటుచేసుకున్న వివాదం మరోసారి గుర్తుకు వచ్చింది.
Also Read : సిడ్నీటెస్టుపై కంగారూ పట్టు