- యార్కర్ల కింగ్ కు రెస్ట్ అంటున్న బీసీసీఐ
- నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా 4వ టెస్ట్
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గురువారం నుంచి ఇంగ్లండ్ తో జరుగనున్న ఆఖరిటెస్టుకు భారత తురుపుముక్క, యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన మూడు టెస్టుల్లో రెండు మ్యాచ్ ల్లో మాత్రమే పాల్గొన్న బుమ్రా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. స్పిన్ బౌలింగ్ కు అనువుగా ఉన్న పిచ్ పై బుమ్రా చేయగలిగింది కూడా ఏమీ లేదని భావించి ఆఖరిటెస్టు కు విశ్రాంతి ఇవ్వాలన్ని ఎంపిక సంఘం నిర్ణయించింది. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read: పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ డింకీలు
27 సంవత్సరాల బుమ్రా తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 19 టెస్టుల్లోనే 83 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత సిరీస్ లో భాగంగా చెన్నైలో ముగిసిన తొలిటెస్టులో బుమ్రా 23 ఓవర్లు బౌల్ చేశాడు. అహ్మదాబాద్ లో ముగిసిన మూడోటెస్టులో బుమ్రా కనీసం ఒక వికెట్టూ పడగొట్టలేకపోయాడు. బుమ్రా టెస్టు జీవితంలో వికెట్ పడగొట్టకుండా ఓ టెస్టుమ్యాచ్ ముగియటం ఇదే మొదటిసారి. బుమ్రాకు విశ్రాంతి నివ్వడంతో ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ లలో ఎవరో ఒక్కరు తుదిజట్టులో చోటు దక్కించుకొనే అవకాశం ఉంది.
ఇంగ్లండ్ పై ఇప్పటికే 2-1తో పైచేయి సాధించిన భారత్…ఆఖరి టెస్టును డ్రాగా ముగించగలిగితే టెస్ట్ లీగ్ ఫైనల్స్ చేరుకోగలుగుతుంది. ఒకవేళ భారత్ ఆఖరిటెస్టులో ఓడితే మాత్రమే ఆస్ట్ర్రేలియాకు ఫైనల్స్ బెర్త్ ఖాయమవుతుంది. ప్రస్తుత సిరీస్ లోని ఆఖరిటెస్టులో పాల్గొనే భారత జట్టుకు విరాట్ కొహ్లీ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులోని ఇతర ఆటగాళ్లలో రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభ్ మన్ గిల్, చతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇశాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్.
Also Read: 400 వికెట్ల క్లబ్ లో అశ్విన్