“సుకవి జీవించు ప్రజల నాల్కల యందు..” అని ఆయనే అన్నట్లుగా,
‘నవయుగ కవిచక్రవర్తి’గా
గుఱ్ఱం జాషువా ప్రజల నాల్కల యందు నిత్యం నర్తిస్తూనే ఉన్నాడు.
ఆ కవికోకిల కుహుకుహు నాదాలు కర్ణప్రేయంగా తెలుగువాడికి వినిపిస్తూనే ఉన్నాయి.
కవితాసతి వరించిన
ఈ రసపురుషుడు యశఃకాయుడు.
“నరజాతి భవితవ్యాన్ని నడిపేదే ఆవేశం… పదిమందికి భవితవ్యాన్ని పంచేదే ఆవేదన… ” అన్నాడు దాశరథి.ఆవేశం,ఆవేదన నిండిన జీవితంతో కవన జీవనం సాగించిన కర్షకుడు ఈ సుకవి.
ఈ కవిది ఒట్టి ఆవేశం కాదు, తిక్కనగారన్నట్లు
భవ్య కవితావేశం.
అందులో నుంచి అఖండమైన కవితా ఖండికలు వెలుగుచూశాయి,
ఎందరికో వెలుగు చూపాయి.
దేశభక్తిని,దైవభక్తిని నిండుగా హృదయాన నిలుపుకొన్నాడు.
తన కవనం గెలుపు’గుఱ్ఱం’.
ఆ కవితాప్రతిభ ఆయనను
ఏనుగు అంబారీపై ఊరేగించింది,
ఘన గౌరవాలను కురిపించింది,
కవి దిగ్గజంగా చిరంజీవిని చేసింది.
ఇంతటి భుజకీర్తులు తనకు చేరినా,గతంలోని గతుకులను మరువలేదు,కృతజ్ఞతా సుమాలను వాడనివ్వలేదు.
ఒక్కొక్క పద్దియంబునకు
ఒక్కొక్క నెత్తురుబొట్టు మేనిలో తక్కువగా రచించి.. అన్నట్లు సహజాతమైన ప్రతిభతో, రక్తనిష్ఠమైన కవిత్వాన్ని రంగులు పూయించాడు.ఆ రంగుల్లో ఎరుపులున్నవి,తెలుపులున్నవి, నలుపులున్నవి,మెరుపులున్నవి, మైమరుపులున్నవి.
ఆధునిక కవులలో వస్తు వైవిధ్యంలో జాషువాది అగ్రశ్రేణి.
రుక్మిణీ కల్యాణం నుంచి క్రీస్తుచరిత్ర వరకూ,తెరచాటు నుంచి
ధ్రువవిజయం వరకు,కోకిల నుంచి గబ్బిలం వరకు,ఫిరదౌసి నుంచి కొత్తలోకం వరకు,కాందిశీకుడు నుంచి వివేకానంద వరకూ వికసించాయి.సాలీడు మొదలు భీష్ముడు వరకూ దర్శనస్పర్శనాలు చేయించాయి.ఆ కవితా వాటిక అనంత పదముల పేటిక.
అక్కడక్కడా అప్పుడప్పుడు గద్యము,వచనము,గేయము రాసినా.. జాషువా హృదయమంతా పద్యం చుట్టూనే ఉంటుంది.
ఆయన కవిత్వంలోని అగ్రభాగం పద్యమే.
ఆగ్రహమైనా,అనుగ్రహమైనా ఆయన పద్యాన్నే ఎంచుకున్నారు,
తన భావాలను అందులోనే పంచుకున్నారు.
కాళిదాసకవి విరచిత ‘మేఘసందేశం’ ప్రేరణగా తీసుకున్నా,దానికి పూర్తి వ్యతిరేకమైన దృక్పథంతో రాసిన కావ్యం ‘గబ్బిలం’ తెలుగు సాహిత్య చరిత్రలో అనర్ఘరత్నం.
బలిజేపల్లి లక్ష్మీకాంతకవి రాసిన “హరిశంద్ర” నాటకమంతా
ఒక ఎత్తు,కాటిసీనులోని జాషువా పద్యాలు ఒక ఎత్తు.
పామరుడు నుంచి పండితుడి వరకూ ఈ పద్యాలు రాని తెలుగువాడు దివిటీ వేసి వెతికినా కానరాడు.దేశం పట్ల ఎంత
భక్తి ఉందో,దేశభక్తుల పట్లా అంతే భక్తి వుంది.మహాత్మాగాంధీ,
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రస్తావన వచ్చినప్పుడు హృదయమంతా పరచి కవిత్వం చెప్పాడు.
కవులంటే చెప్పలేని ప్రేమ,
గుండెంత గౌరవం.
పూర్వకవులైన తిక్కన, రామరాజభూషణుడు,
కంకంటి పాపరాజు,
చేమకూర వేంకటకవి అంటే
ఎంత ఇష్టమో,
సమకాలీన ఆధునిక కవులు శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రి,
తిరుపతి వేంకటకవులు,
కొప్పరపు కవులన్నా అంతే ఇష్టం. తిరుపతి వేంకటకవులలో పెద్దవారు చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి
తన పాదం పట్టుకొని
కాలికి గండపెండెరం తొడిగిన సందర్భంలో జాషువా కృతజ్ఞతతో నిలువెల్లా వణికిపోయాడు.
ఆ కృతజ్ఞతను జీవిత చరమాంకం వరకూ గుండెల్లో నిలుపుకున్నాడు.
తను పద్యాలు రాస్తున్న
ప్రారంభ దశలో,
కొప్పరపు సోదరకవులలో అగ్రజుడైన వేంకటసుబ్బరాయకవిని కలిసి,తన ప్రేమను,గౌరవాన్ని చాటుకొని ఆశీస్సులు స్వీకరించాడు.జాషువాపై
కొప్పరపు సుబ్బరాయకవి అంతే వాత్సల్యం కురిపించాడు.
“బంగరు చిరుత గంటలు ఖంగన, హస్తంబు సాచి కాగలవాడు .. ” అంటూ అభినందనలు అందించిన ఆ దృశ్యాన్ని హృదయపద్మంపై జాషువా నిలుపుకున్నారు.
తన ఆత్మకథ ‘నా కథ’లో అక్షరాకృతి కావించాడు.
కొప్పరపు సుబ్బరాయకవి కుమారుడు సీతారామప్రసాదరావు (శతావధాని)తో జీవితాంతం స్నేహాన్ని కొనసాగించాడు. భరతభూమిపై ఎంతటి
భక్తి ఉందో,తన పలనాటిసీమపై తనకు అంతటి అనురక్తి.
తిరుపతి వేంకటకవులు,
కొప్పరపు కవుల ప్రేరణతో,
సఖుడు దీపాల పిచ్చయ్యశాస్త్రితో కలిసి జంటకవులుగా మారాలని అనుకున్నారు.పేర్లు అనుకూలంగా లేవని ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు.
ఒంటి చేత్తోనే కవితా సామ్రాజ్యంలో ఏక ఛత్రాధిపతిగా రాణకెక్కాడు.
ఈయన ప్రేమ కేవలం తెలుగు,సంస్కృత కవులపైనే కాదు,పారశీ కవులపైన కూడా ఉండేది.అందుకే,పర్షియన్ కవి ఫిరదౌసి కవిత్వానికి ఎంతగా సంస్పందించాడో,
ఆయన జీవితంలోని చేదు పార్శ్వం చూసి,అంతకు మించి చలించాడు.
ఆ శోకంలో ఒక శ్లోకం పలికే అన్న చందాన,ఆ వ్యధామయ గాథను కరుణరసరమ్య కావ్యంగా మలిచాడు,తోటి కవిపట్ల నిలిచాడు.దేశ స్వాతంత్య్రం కోసం ఎంత తపించాడో,స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వచ్చిన పరిస్థితులు చూసి,అంతగా దుఃఖించాడు, కోపించాడు.
“పరరాజ్యం పోయి,ప్రజారాజ్యమై పాముకున్నది లేదు.
కొందరికి ప్రజారాజ్యంగా,
కొందరికి మజారాజ్యంగా,
కొందరికి క్షుధారాజ్యంగా తయారై అష్టకష్టాలకు ఆలవాలమైంది… ” అంటూ ఆవేదన చెందాడు.
దేశ పరిస్థితి గురించి ఎప్పుడో 70ఏళ్ళ క్రితమే ఇలా చెప్పాడు. ఇప్పటి దేశ దుస్థితికీ అవి అక్షరాలా సరిపోతాయి.
జీవితంలో ఎన్ని కష్టాలు, అవమానాలు,ఛీత్కారాలు అనుభవించినా,జీవితంలో అజేయంగా అగ్రశ్రేణి కవిగా నిలిచాడు.ఈ కవితా విశారదుడిని వరించని బిరుదు లేదు,
పదవి లేదు,సత్కారం లేదు,
సత్కావ్యం లేదు.అత్యున్నతమైన పద్మభూషణ,అత్యుత్తమమైన కళాప్రపూర్ణ తన సిగలో చేరాయి.కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్ని గెలుచుకున్నాడు. శాసనమండలి సభ్యునిగా
పెద్దల సభలోనూ అడుగుపెట్టాడు.
తన కవిత్వంలో పదాలు సహజసుందరంగా వచ్చి చేరుతాయి.యతిప్రాసల కోసం వెతుక్కోకుండా
సరళ కుసుమాలుగా పద్యాలలో వదిగిపోతాయి.అంతటి సహజకవి గుఱ్ఱం జాషువాను స్మరిస్తే… తెలుగుపద్యాన్ని,తెలుగునాడును, మాతృభూమిని తలచినట్లే, కొలచినట్లే