- జపాన్ మహిళ సంచలనం
- జపాన్ సోషల్ మీడియా స్టార్ రిన్
మహిళకు కురులే అందం. ఎంత పొడవాటి జుట్టు ఉంటే అంత అందమని నిన్నటి తరాల కాలంలో భావించేవారు. అయితే నేటి ఆధునిక జీవన విధానంలో మహిళల కురులు కాస్త కురచగా మారిపోయాయి. ఉరుకుల పరుగుల ఆధునిక జీవన విధానానికి తోడు పోషకాహార లోపం, తీవ్రఒత్తిడి, విరులపై ప్రేమ తగ్గిపోడంతో వాలుజడ అన్నమాట బాపు సినిమాలలోని హీరోయిన్లకు మాత్రమే పరిమితమై పోయింది. నేటి మన సమాజంలో నిలువెత్తు కురులతో వాలుజడ వేసుకోడం ఓ అదృష్టంగా, అరుదైన విషయంగా మారిపోయింది. పాశ్చాత్య జీవనవిధానం ప్రభావంతో కూడా భారత మహిళల కురులు రానురాను కురచగా మారిపోతున్నాయి.
అయితే సాంప్రదాయాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే జపాన్ దేశంలోని యువతులు, మహిళలను తలచుకోగానే బాబ్డ్ హెయిర్ కటింగ్ క్రాపులున్నవారే మనకు కనిపిస్తారు. పొడవాటి జుట్టు ఉన్న మహిళలు అత్యంత అరుదుగా, వార్తల్లో వ్యక్తులుగా మాత్రమే కళ్లముందు కదలాడుతారు.
Also Read: క్రీడారంగంలో మహిళా తరంగాలు
రిన్ కాంబీ కురుల సోయగం…
రిన్ కాంబీ జపాన్ సోషల్ మీడియాలో అత్యంత ఆదరణ ఉన్న ఓ మహిళ. కేవలం ఆరడుగుల తన కురులతోనే 32 లక్షల 40వేల మంది అభిమానులను సంపాదించుకొంది. కేవలం పొడవాటి జుట్టుతోనే సోషల్ మీడియా పాపులర్ స్టార్ గా ఎదిగిపోయింది.జపాన్ బాలికల ఫుట్ బాల్ జట్టులో సభ్యురాలిగా ఉన్న సమయంలో రిన్ కాంబీ క్రాపుతోనే ఉండేది. దానికి తోడు తల్లిదండ్రుల క్రమశిక్షణ కారణంగా జుత్తుపెంచాలన్న కోరికను లోలోపల అణుచుకొంటూ వచ్చింది.
20 ఏళ్ల వయసు నుంచే…
20 ఏళ్ల వయసు నుంచి మాత్రమే రిన్ కాంబీ కురులను పెంచాలని నిర్ణయించుకొంది. తన జీవితంలో తొలిసారిగా అమ్మానాన్నలకు ఎదురుచెప్పి జుత్తు పెంచడం మొదలుపెట్టింది. గత 15 సంవత్సరాలుగా హెయిర్ స్టయిల్ చేయించుకోలేదని, కురులు ఆరోగ్యంగా పెరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకొన్నానని, ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉండేలా శ్రద్ధ తీసుకోడంతో పాటు కుంకుమ పువ్వు నుంచి తీసిన తైలాన్ని తలకు పట్టించేదానినని 35 సంవత్సరాల రిన్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.రిన్ కాంబీ నిలబడితే ఆరడుగుల పొడవున్న కురులు నేలను తాకుతూ ఉంటాయి.
ఆరోగ్యవంతమైన పొడవాటి జుట్టు ఉంటే దానివల్ల వచ్చే ఆత్మస్థైర్యమే వేరంటూ రిన్ పొంగిపోతోంది. జుత్తు పెంచడం అంటే మామూలు విషయం కానేకాదని ఓ తపస్సులాంటిదని తనకు తెలిసి వచ్చిందని, గత 15 సంవత్సరాలుగా తాను అదే చేస్తున్నానని 35 సంవత్సరాల వయసులోనూ ఆరడుగుల కురులే తనకు ఐశ్యర్యంలా అనిపిస్తున్నాయని ఈ సోషల్ మీడియా స్టార్ పొంగిపోతోంది.
Also Read: భారత అల్లుళ్లు విదేశీ క్రికెటర్లు
జుత్తు ఉన్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమేనన్న సామెత జపాన్ లో ఉందో లేదో తెలియదు కానీ కురులను ప్రాణప్రదంగా భావించే భారత మహిళలు చేయాల్సిన పనిని ఓ జపాన్ మహిళ చేయటం అభినందనీయమే మరి. దేశం ఏదైతేనేం కురులు పెంచేది మహిళే కదా అని సరిపెట్టుకోక తప్పదు.