• ఉపఎన్నికకు సమన్వయ కమిటీ ఏర్పాటు
• అభిమానులను ఓటు బ్యాంకుగా మలిచేందుకు యత్నాలు
తెలుగు రాష్ట్రాలలో బీజేపీ జనసేన లు మిత్ర పక్షాలుగా వ్యవహరిస్తున్నాయి. పొత్తుల సర్దుబాటులో భాగంగా ఇటీవల జరిగిన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు తెలిపింది. పొత్తు ధర్మంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలపకుండా బీజేపీ కి మద్దతు తెలపింది. జనసేన త్యాగానికి ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలనే రాబట్టగలిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ జనసేనలు కలిసి పనిచేస్తాయని గతంలోనే ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. అయితే జీహెచ్ఎంసీలో తన అభ్యర్థులను విరమించుకున్న జనసేనకు తిరుపతిలో తమ పార్టీ అభ్యర్థిని బరిలో దించుతారని దానికి బీజేపీ మద్దతు ప్రకటిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అభ్యర్థి ఎంపిక కోసం ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా ఇరు పార్టీలు ప్రకటించాయి. అభ్యర్థి ఎంపిక ఏకాభిప్రాయంతోనే జరుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే జరుగుతున్న పరిణామాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. బీజేపీ అభ్యర్థే తిరుపతిలో పోటీ చేస్తారని జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థికి ఓటేయాలని సోము వీర్రాజు ప్రకటించారు.
అప్రమత్తమైన జనసేన:
బీజేపీ నేతల వైఖరితో జనసేన ఖంగుతింది. హుటా హుటీగా పార్టీ నేతలతో చర్చించిన పవన్ కల్యాణ్ తిరుపతి ఉప ఎన్నిక కోసం ప్రత్యేక కమిటీని నియమించారు. దీని ద్వారా తాము పోటీకి దిగుతామని బీజేపీకి బలమైన సంకేతాలు పంపింది. ది మందితో కూడిని కార్యనిర్వాహక కమిటీని నియమించిన పవన్ కల్యాణ్ పార్టీ సిద్ధాంతాలు, ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు. ఉపఎన్నికలో పోటీచేసే జనేసన అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పవన్ పార్టీ శ్రేణులకు ఉద్భోద చేశారు. కమిటీ లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధినేతకు నివేదిక అందజేస్తారు.
బీజేపీ దూకుడును పవన్ అడ్డుకోగలరా?
రాష్ట్రంలో జనసేనకు అభిమానులు భారీ గానే ఉన్నారు. పైగా తిరుపతి నుంచి చిరంజీవి గతంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పవన్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపి పట్టు నిలుపుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అభిమానులను ఓటు బ్యాంకుగా మలచుకునేందుకు పవన్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో విజయం ద్వారా ఊపు మీదున్న బీజేపీ అదే పంథాను తిరుపతిలో కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో కూడా విజయం సాధించి వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి బలమైన ప్రత్యర్థిగా మారాలనుకుంటోంది. అందుకే జనసేన కంటే ముందుగానే క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రకటనలు చేస్తోంది. సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా బీజేపీ నేతల ముందస్తు ప్రకటనలకు కళ్లెం పడుతుందని జనసేన యోచిస్తున్నట్లు తెలుస్తోంది.