హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేయాలని జనసేన యువజన సైనికుల విజ్ఞప్తి మేరకు నిర్ణయించినట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారంనాడు ఇక్కడ ప్రకటించారు.
తెలంగాణలోనూ, హైదరాబాద్ లోనూ యువజనసైనికుల నుంచి అనేక విజ్జప్తులు వచ్చాయనీ, ఆ మేరకు గ్రేటర్ పోరులో పాల్గొనాలని పార్టీ నాయకులకూ, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిథిలోని కమిటీలకూ స్పష్టం చేశానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ ఎన్నికలలో పోటీ చేయాలని క్షేత్రస్థాయిలోని కార్యకర్తలందరూ కోరుతున్నారనీ, వారంతా ఎంతో కాలంగా పని చేస్తూ వచ్చారనీ, వారి అభీష్టం మేరకు ఎన్నికలలో పోటీ చేస్తున్నామనీ చెప్పారు.
ఎన్నికల తేదీలు ప్రకటించక పూర్వమే జనసేనతో బీజేపీ పొత్తు ఆంధ్రప్రదేశ్ కే పరిమితమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం వరకూ జనసేన పార్టీ నాయకులు బీజేపీతో పొత్తు ఉంటుందని చెబుతూ వచ్చారు. బీజేపీ రెండవ జాబితా విడుదల చేయడం కూడా ఆలస్యం కావడంతో బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ జనసేన తో పొత్తు ఉండదని సంజయ్ మరోసారి కుండబద్దలు కొట్టడంతో జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించారు.