వోలేటి దివాకర్
వారాహి పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలో ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. వేలాది మంది అభిమానులు ఎంతో ఉత్సాహంగా వారాహిని అనుసరిస్తూ సాగుతున్నారు. ముఖ్యంగా యువత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో పవన్ పర్యటనలో ఆద్యంతం జనసందోహం పోటెత్తుతోంది. ఆయన అభిమానుల తరహాలోనే ఆయన కూడా ఎంతో ఆవేశంగా రధంపై నుంచి ప్రసంగాలు చేస్తున్నారు.
ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన వారాహి యాత్ర ఈనెల 23వ తేదీ వరకు ఉభయ గోదావరి జిల్లాల్లోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగుతుంది. యాత్రలో భాగంగా పవన్ బహిరంగ సభల్లో ఆవేశపూరితంగా ప్రసంగించడంతో పాటు, జనవాణి కార్యక్రమంలో భాగంగా వివిధ వర్గాలతో సమావేశాలు జరుపుతున్నారు. ఎవరు రాసిస్తున్నారో కానీ ఆయన ప్రసంగాల్లో ఆవేశం తప్ప ఆలోచనలు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమ పార్టీ విధానాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పవన్ చెప్పులు చూపిస్తూ…. బట్టలు ఊడదీసి కొడతాం లాంటి మాటలతో అధికార పార్టీ నాయకులపై రెచ్చిపోతున్నారు.
ఒక వైపు ‘వారాహియాత్ర’ , ‘యువగళం’ పేరుతో నారా లోకేష్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మరోవైపు మొన్నటి వరకు మెత్తగా ఉన్న బీజేపీ మూకుమ్మడిగా అధికార వైఎస్సార్ సిపిని లక్ష్యంగా చేసుకుని తూర్పారపడుతున్నాయి. దీంతో అధికార పార్టీ నాయకులు సహనం కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. అధికార పార్టీ నాయకుల్లా స్థాయి దిగజారి మాట్లాడితే కొడాలి నాని, పేర్ని నానిలకు పవన్ కు మధ్య తేడా ఏమిటీ. పవన్ మాటలు అభిమానులకు ఆ కొద్ది సేపు ఆనందాన్ని కలిగిస్తాయోమే కానీ ఓట్ల రాజకీయాలకు పనికి రావు. ఇక టీడీపీ, బీజేపీతో పొత్తుల గురించి పవన్ మాటల్లో నిలకడ కనిపించడం లేదు. అయితే అది వ్యూహాత్మకం కావచ్చు. అలాగే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని… మరోసారి సిఎం పదవిని చేపడతానన్న పవన్ వ్యాఖ్యలు అభిమానులు, ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నాయి.
Also read: వైసీపీకి రాజమహేంద్రవరంలో సొంత కార్యాలయం!
వారాహి ఓట్లు కురిపిస్తుందా?
సముద్రంలో నీళ్లు ఎన్ని ఉంటే ఏం లాభం.. తాగడానికి పనికి రానప్పుడు. అలాగే జనసేనాని పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతమంది ఉంటే ఏమి లాభం ఓట్లు వేసి గెలిపించనపుడు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. మెగాస్టార్ చిరంజీవి రెండుసార్లు రాజమహేంద్రవరం వచ్చినప్పుడు అభిమానులు ఆయనకు ఊపిరి ఆడనీయలేదు. అంత అభిమానం చూపించిన జనం ప్రజారాజ్యం పార్టీని పెడితే చిరంజీవి సొంత ప్రాంతం పాలకొల్లులోనే ఓడించారు.
ఈ భయమే ఇప్పుడు పవన్ ను వెన్నాడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజల్లో ఎంతో కరిష్మా ఉన్న పవన్ లాంటి సినీనటుడు తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతున్నాడంటే అభిమానులపై ఏరకమైన ఆశలు పెట్టుకున్నారో అర్థం అవుతోంది. ప్రస్తుతం వారాహి యాత్ర సాగుతున్న 9 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో గెలిచిన ఎస్సీ రిజర్వుడు పి గన్నవరం సహా 8 నియోజకవర్గాల్లో పవన్ సామాజిక వర్గీయులు ప్రభావిత స్థాయిలో ఉన్నారు. గతంలో కన్నా ఎక్కువగా కాపు సామాజిక వర్గీయులు జనసేన వెంటే ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికల సమయంలో వారంతా జనసేన వెంటే ఉంటారా అన్నది చర్చనీయాంశం. ప్రస్తుతం టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే పవన్ పర్యటిస్తున్న 9 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులే బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీ చేసిన రెండుచోట్లా ఓడిపోయినా… పదేళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న పవన్ తన ప్రసంగాల్లో ఆవేశాన్ని తగ్గించుకుని, ఆచరణాత్మక వాగ్దానాలు చేస్తే ప్రస్తుత అధికార పార్టీ పాలనపై అసంతృప్తిగా ఉన్న ప్రజలు ఎన్నికల నాటికి జనసేన వైపు చూసే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పోల్ మేనేజ్మెంట్ తోడైతే జనసేన గౌరవ ప్రదమైన స్థానాలను సాధించే అవ కాశాలనూ కొట్టి పారేయలేము. రాజకీయాలలో నాయకుడికి ఆత్మవిశ్వాసం ప్రధానం.
Also read: మహా ఘనంగా మహానాడు! కానీ….