Sunday, December 22, 2024

హనుమ పుట్టుపూర్వోత్తరాలు వెల్లడించిన జాంబవంతుడు

రామాయణమ్ 121

గుబులుగా, దిగులుగా ఉంది వానరులందరికీ. ఈ సముద్రము దాటేదేట్లా? సీతమ్మను చూసేదేట్లా?  రామ కార్యము అయ్యేదేట్లా? అందరి మనసులో అదే ప్రశ్న.

యువరాజు అంగదుడు లేచాడు దిగులుగా ఉన్న ముఖాలు చూశాడు. అందరినీ ఉద్దేశించి ప్రోత్సాహ వచనాలు పలికాడు. విషాదము పనికిరాదు అని హితవు చెప్పాడు.

Also read: సంపాతి వృత్తాంతం

అసలు ఎవరెవరు ఎంతెంత దూరము లంఘించగల సమర్ధులో తెలుపండి అని అడిగాడు. అప్పుడు ఒక్కొక్కరు లేచి తమతమ సామర్ధ్యమెంతో తెలుపసాగారు. గజుడు నేను పది యోజనములు ఎగురగలను  గవాక్షుడు ఇరువది యోజనములు  ఎగురగలనన్నాడు. శరభుడు ముప్పై, ఋషభుడు నలభై, గంధమాదనుడు యాభై , మైందుడు అరవై, ద్వివిదుడు డెభ్భై, సుషేణుడు ఎనభై యోజనములు దూకగలము అని తెలిపారు.

అప్పుడు జాంబవంతుడు లేచి ‘‘నేను వయస్సులో ఉన్నప్పుడు త్రివిక్రముడైన వామనుడి చుట్టూ ప్రదక్షిణము చేసిన వాడినే, కానీ ఇప్పుడు వయసు మీరటము వలన ఒక తొంబది యోజనములు మాత్రము ఎగురగలను’’ అని అన్నాడు.

Also read: వానరులకు సీతమ్మ జాడ చెప్పిన సంపాతి

అందరి మాటలు విని అంగదుడు లేచి జాంబవంతునితో ‘‘నేను ఒక వంద యోజనములు ఎగురగలను. కానీ తిరిగి వచ్చుటకు నాకు శక్తి సరిపోవునో లేదో!’’ అని సంశయముతో పలికెను.

అందుకు జాంబవంతుడు అంగదునితో, ‘‘నీ సామర్ధ్యము నేను ఎరుగుదును. నీవు లక్ష యోజనములైనా అలసట లేకుండా వెళ్లి రాగలవు. కానీ నీవు మాకు అధిపతివి. నిన్ను మేము రక్షించుకొనవలెను. అది మా కర్తవ్యము. కావున నీవు వెళ్ళుటకు పూనుకొనరాదు.’’

అందుకు అంగదుడు మరల జాంబవంతునితో, ‘‘అయినచో ఈ కార్యము పూర్తి చేయుట ఎలా? సుగ్రీవుని వద్దకు ఉత్త చేతులతో తిరిగి వెళ్ళరాదు. ఇక మనకు ప్రాయోపవేశమే గతి. నీవే ఏదైనా మార్గము ఆలోచింపుము’’  అని పలికాడు.

Also read: అంగదుడికి హనుమ మందలింపు

అప్పుడు జాంబవంతుడు ‘‘నవ్వుతూ, వీరుడా! మన కార్యము చేయ గలవాడు మనలోనే ఉన్నాడు. అతనిని నేను ప్రేరేపించేదను.’’

జాంబవంతుడు ఆవిధముగా పలుకుతూ ఒక చోట ఏకాంతముగా ఏమీ పట్టనట్లుగా సుఖముగా కూర్చొని ఉన్న హనుమంతుని సమీపించాడు.

‘‘ఏకాంతములో మౌనముగా కూర్చుని ఉన్నావేమయ్యా! ఏమీ మాటలాడవు!

తేజస్సుచేత, బలముచేత వానర రాజైన సుగ్రీవునితోనూ రామలక్ష్మణులతోనూ నీవు సమానుడవయ్యా! ఓ హనుమా, వేగములో గరుత్మంతుడే నీకు సాటి. అటువంటి నీవు ఈ కార్యమునకు ఏల సిద్ధమగుట లేదు?

Also read: స్వయంప్రభ సందర్శనము

‘‘అప్సరస్త్రీలలో శ్రేష్ఠురాలు, ప్రసిద్ధురాలు అయిన పుంజికస్థల శాపవశమున వానర స్త్రీగా జన్మించి కేసరికి భార్య అయినది. ఒక రోజు ఆమె మానవ రూపము ధరించి అద్భుత సౌందర్యముతో ప్రకాశిస్తూ ఒక పర్వతశిఖరము మీద సంచరించుచుండెను. ఆమె అతిలోక సౌందర్యమునకు మోహితుడయ్యి వాయుదేవుడు తన కోరికను ఆపుకోలేక ఆమెను తన కౌగిలిలో బంధించెను. అంతర్హితుడయి ఆయన చేసిన ఈ పని ఆవిడ గుర్తించి ఎవరు నన్ను కౌగలించుకొన్నారు? ఎవరు ఎవరది? అని తత్తరపడుతూ ప్రశ్నించెను.

‘‘అప్పుడు వాయుదేవుడు ఆమెతో ‘‘ఓ సుందరవదనా, నీకు భయము వలదు. నేను వాయుదేవుడను. నీ పాతివ్రత్యమునకు ఎట్టి భంగము వాటిల్లదు. నీకు పరాక్రమవంతుడు, బుద్ధిమంతుడు అయిన కుమారుడు జన్మించును. బలములోనూ, తేజస్సులోనూ అతనికి సాటి రాగల వారు ఎవ్వరూ ముల్లోకములలో కనుపించరు. ఎగురుట, దుముకుటలోనూ, గమన వేగములోనూ అతను నాతో సరి సమానుడు కాగలడు.’’ అప్పుడు వాయుదేవుని మాటలకు సంతసించిన నీ తల్లి ఒక కొండ గుహలో నిన్ను కనెను.’’

‘‘తొట్టిలోని పసిబాలుడవైన నీవు ఉదయసూర్యుని చూసి ఫలమని భ్రమించి ఆ ఫలమును పట్టుకొనుటకై ఆకసమునకు ఎగిరితివి. మూడువందల యోజనములు ఎగిరి సూర్యుని తేజస్సు నిన్ను ఆక్రమించుకొనుచున్ననూ ఏ మాత్రము జంకలేదు. వేగముగా ఆకాశములోకి దూసుకొని వచ్చి సూర్యగమనమునకు అడ్డుతగిలిన నిన్నుచూసి కోపించి ఇంద్రుడు వజ్రాయుధము ప్రయోగించెను. ఆ వజ్రపు దెబ్బకు నీవు పర్వతశిఖరముపై పడిపోయితివి. అప్పుడు నీ ఎడమ హనువు (గడ్డము) విరిగిపోయెను . అందుచేత నీవు హనుమంతుడవైతివి.’’

Also read: హనుమపైనే అన్ని ఆశలు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles