వోలేటి దివాకర్
గతంలో జరిగిన వై ఎస్సార్సిపి ప్లీనరీ సమావేశంలో రాజమహేంద్రవరం గడ్డ తన అడ్డా అని ఎంపి మార్గాని భరత్ రామ్ ప్రకటించుకున్నారు. ప్రస్తుతం పార్టీ కోఆర్డినేటర్ గా ఎంపి మార్గాని గుడ్ మార్నింగ్, గడపగడపకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రాజకీయాల్లో ఎంపి హవాయే కొనసాగుతోంది. వైఎస్సార్సిపి జిల్లా అధ్యక్షుడైనా, నగరంలో బలం.. బలగం ఉన్నా రాజానగరం ఎమ్మెల్యే, దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు జక్కంపూడి రాజా నగర రాజకీయాల్లో వేలుపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఆయన ప్రమేయం లేకుండానే ఎంపి మార్గాని పలువురు నాయకులను పార్టీలో చేర్చుకుని, పార్టీ, నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం అధికార పార్టీ రాజకీయాలు, అభివృద్ధి పనులు ఎంపి కనుసన్నల్లో జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాజా సోదరుడు, మాస్ లీడర్ జక్కంపూడి గణేష్ ఎంపి అడ్డాలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే గణేష్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వై ఎస్సార్సిపి యువజన విభాగం జోనల్ ఇంచార్జిగా నియమితులయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రజాప్రతినిధుల వారసులు, తన అనుచరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విలేఖర్ల సమావేశమని ఆహ్వానించినా ఈ కార్యక్రమం చిన్న పాటి బలప్రదర్శన సభగా మారిపోయింది.
ఈసందర్భంగా వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సిఎం, వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ మిధున్ రెడ్డి, జక్కంపూడి రాజా, ఇతర నాయకుల ఫొటోలు వేశారు. భరత్ ఫొటోను మాత్రం పక్కన పెట్టినట్లు కనిపించింది. అయితే ఈ సభకు ఎంపి సన్నిహితులు ఇన్నమూరి దీపు, చిట్టూరి ప్రవీణ్ చౌదరి హాజరుకావడం విశేషం.
ఈ సభలో గణేష్ మాట్లాడుతూ ఏప్రిల్ 3,4,5 తేదీల్లో జయహో జగనన్న పేరిట యువ సమ్మేళనం సభలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇది శాంపిల్ మాత్రమే అన్నట్లు ప్రస్తుతం సన్నిహితులనే పిలిచానని, ఈ సమ్మేళనానికి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన యువతను సమీకరించి, తనదైన సత్తాను నిరూపించుకుంటానని వ్యాఖ్యానించారు. అంటే ఆ మూడు రోజులు గణేష్ బలప్రదర్శన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజమహేంద్రవరంలో తన దూకుడు పెంచుతానని కూడా చెప్పడం గమనార్హం. అవకాశం వస్తే పోటీకి కూడా సిద్ధమని కూడా విలేఖర్లకు చెప్పారు.
గణేష్ బలప్రదర్శనతో రాజమహేంద్రవరంలో అధికార పార్టీ రాజకీయాల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జక్కంపూడి రాజా, గణేష్ వర్గీయులు మళ్లీ రాజమహేంద్రవరం రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశాలున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య పరోక్షంగా సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుని నగరంలో రాజకీయ సందడి సృష్టిస్తారని భావిస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో ఈ పరిస్థితి అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైరిపక్షాలుగా ఉన్న ఇరు వర్గాల్లో ఎవరికి అసెంబ్లీ సీటు కేటాయించినా మరో వర్గం ఓడించే ప్రయత్నాలు చేస్తుందనడంలో సందేహం లేదు.