ఫొటో: 1972 నాటి జై ఆంధ్ర ఉద్యమంలో ఒక దృశ్యం
పాత్రికేయుడిగా నా తొలి సంవత్సరంలో తొలి మొదటి పేజీ పతాక శీర్షిక వార్త …
రాష్ట్ర చరిత్రను పెను మలుపు తిప్పిన సంఘటన రోజు …
పి.వి.నరసింహారావు వస్తున్నారు.
ఈ సమావేశానికి విలేకరులకు అనుమతి లేదు. నేను ‘విద్యార్థి ప్రతినిధిని’ అని చెప్పి లోపలకు దూసుకుపోయాను.
అప్పుడిలా జరిగింది…
“ముల్కీ నిబంధనల విషయంలో కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాము”
అని ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు హైదరాబాద్ లో ప్రకటించటంతో ఆంధ్ర ప్రాంతంలో అన్ని కళాశాలల విద్యార్థులు ఆందోళనలకు దిగారు.
ఈ ఆందోళనలకు మద్దతు – భూ సంస్కరణల బాధితులైన భూస్వాములు.
విద్యార్థులను శాంతింపజేయటం కోసం, ముఖ్యమంత్రి పి.వి స్వయంగా
ఏలూరుకి వచ్చి విద్యార్థి ప్రతినిధులను ఆహ్వానించారు.
విద్యార్థి ప్రతినిధిలాగా నేనూ వెళ్లి కూర్చున్నాను.
“ఆంద్ర ప్రదేశ్ షరతులతో ఏర్పడలేదు …” అంటూ పి.వి మాట్లాడారు.
విద్యార్థులు ఆయన చెప్పిందంతా విన్నారు.
ఆ రాత్రే విద్యార్థి సంఘాలు ఏలూరులో ప్రకటించేశాయి:
“ఈ అర్ధరాత్రి నుంచే విద్యార్థుల నిరవధిక సమ్మె.”
అంతే!
NGOs సంఘాలతో ప్రారంభించి,
GOs, Teachers, IV Class Employees దాకా, Judicial officers సహా ….
నెల తిరిగేలోపల అందరూ చేరిపోయి, (కరోనా కాలంలో లాక్ డౌన్ లాగా)
ఆముదాలవలస నుంచి అనంతపూర్ దాకా ‘జై ఆంధ్ర ఉద్యమం’ తో అన్ని జిల్లాలు అట్టుడికిపోయాయి.
ప్రజానాయకుడు అని ఒకప్పుడు జనం కీర్తించిన నీలం సంజీవ రెడ్డి విగ్రహం విజయవాడలో
నేలపాలయింది.
రైళ్లు స్తంభించాయి.
బస్సులు నిలచిపోయాయి.
చదువులు లేవు.
సినిమాలు లేవు.
ఆఫీసులు లేవు.
రైతు పండించిన ధాన్యం బయటకు
వెళ్లే మార్గం కూడా లేదు.
ఏలూరు సహా అనేక చోట్ల
లాఠీ ఛార్జీలు…. ఫైరింగ్ లు….
బాంబుల మోతలు ….
అనేక మంది ఉద్యమకారుల ప్రాణాలు బలిగొంది ఆ ఉద్యమం….
మూడు మాసాలకు పైగా – పి.వి చేత రాజీనామా చేయించి, రాష్ట్రపతి పాలన విధించేదాకా – సాగింది ఆ ఉద్యమం.
అప్పుడే రాష్ట్రాన్ని విభజించి ఉంటే,
ఈ పాటికి ఎలా ఉండేదో ….?