వోలేటి దివాకర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస కేసులతో బూస్ట్ లాంటి సీక్రెట్ ఎనర్జీ లాంటిది ఇస్తున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు అధికార వైసిపిని ఎదుర్కొనే సత్తా లేదని విశ్లేషించిన వైసిపి నాయకులే చంద్రబాబునాయుడు అరెస్టు, విడుదల తరువాత టిడిపి – జనసేన కూటమి బలం బాగా పెరిగిందని అంగీకరిస్తున్నారు. స్కిల్ డెలవలప్మెంట్ స్కామ్ లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సెప్టెంబర్ నెల్లో చంద్రబాబును అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ లభించకపోవడంతో 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రజల సానుభూతి కోసం రోడ్డుషో ద్వారా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఆ వెంటనే ఢిల్లీ నుంచి దిగ్గజ న్యాయవాదులను రప్పించి, ఏకంగా కేసే కొట్టివేయాలని విజయవాడ నుంచి ఢిల్లీ వరకు కేసులు వేశారు. అలాగే బెయిల్ పిటిషన్లు కూడా వేయించారు. ఏ కోర్టులోనూ ఆయనకు ఊరట దక్కలేదు. దీనితో ఈకేసులో ఏదో పస ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. చివరకు ఆరోగ్య కారణాలతో బెయిల్ పొందారు.
52 రోజుల రోజుల జైలు జీవితం తరువాత విజయవాడ వరకు, హైదరాబాద్ లోనూ టిడిపి శ్రేణులు ఉత్సాహంగా ఆయనకు స్వాగతం పలికాయి.
బాబు జైలులో ఉన్న సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జైలుకు వచ్చి బాబును పరామర్శించి, సంఘీభావం ప్రకటించడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని పొత్తు ప్రకటన చేయడంతో తెలుగుదేశం పార్టీకి కొండంత బలం లభించింది. టిడిపి జనసేన కలిస్తే వచ్చే ఎన్నికలు అధికార పార్టీకి అంత ఈజీ కాదని తెలిసే వైసిపి నాయకులు జనసేనను దమ్ముంటే సింగిల్ గా రావాలని సవాల్ చేసి, కవ్వించే ప్రయత్నం చేశారు. అయినా పవన్ టిడిపితో కలిసి నడవాలని నిర్ణయించుకోవడంతో అధికార వైసిపి లోలోన ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. వాటి పర్యావసనమే బాబుపై కేసుల పరంపర కొనసాగుతోందని టిడిపి, జనసేన నాయకులు అభిప్రాయపడుతున్నారు. జైల్లో ఉండగానే ఆయనపై అంగళ్లు కేసు, ఫైబర్ నెట్ స్కామ్, ఇన్నర్ రింగురోడ్డు కుంభకోణం నమోదు చేశారు. తాజాగా మద్యం పర్మిట్లు, ఇసుక విధానంలో అవినీతికి పాల్పడ్డారని కొత్త కేసులు నమోదు చేశారు. అంగళ్లు కేసును పక్కన పెట్టినా…ఫైబర్ నెట్, ఇన్నర్ రింగురోడ్డు, ఇసుక, మద్యం కేసులు చంద్రబాబుపై కక్ష సాధింపుగానే పెట్టినట్లు సామాన్య ప్రజలు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన స్కాముల పై వైసిపి అధికారంలోకి వచ్చిన దాదాపు నాలుగేళ్ల తరువాత కేసులు పెట్టడం ఏమిటన్న చర్చ సాగుతోంది. ఇన్నాళ్లూ అధికార పార్టీ ఎందుకు మౌనంగా ఉందన్న ప్రశ్న తలెత్తుతోంది. చంద్రబాబును కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసి, తద్వారా వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమిని ఇబ్బందుల పాలు చేయాలని అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యూహం ఎదురుతన్నేలా కనిపిస్తోంది. వరుస కేసులతో చంద్రబాబుపై సానుభూతికి ఆస్కారం ఏర్పడుతోంది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చంద్రబాబు అరెస్టు తరువాత జగన్ కక్ష సాధింపు విధానాలపై ఢిల్లీలోని బిజెపి పెద్దలకు వివరించేందుకు వెళ్లిన చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు చాలా రోజుల వరకు అపాయింట్మెంట్ లభించలేదు. ఎట్టకేలకు హోంమంత్రి అమిత్ షాను కలిసిన లోకేష్ జగన్ కక్ష సాధింపు ధోరణి గురించి ఆయనకు వివరించారు. అమిత్ షా సానుకూలంగా అంతా విన్నారని లోకేష్. చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో బిజెపి కనుసన్నల్లో నడుస్తున్న జగన్ కు ఒక మాట చెబితే సరిపోతుంది. ఆ పరిణామం తరువాత కూడా చంద్రబాబుపై కేసుల పరంపర కొనసాగడం గమనార్హం. దీన్ని బట్టి చంద్రబాబుపై కేసులకు డిల్లీ పెద్దలు పరోక్ష ఆమోదం ఉందన్న విషయం స్పష్టమవుతోంది. ప్రాధమిక ఆధారాలతో సహా సాంకేతిక అంశాలు బాబుకు వ్యతిరేకంగా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో సరిపెడితే ప్రజలు అర్థం చేసుకునే వారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న సెక్షన్ 17ఏ అంశంలో చంద్రబాబుకు వ్యతిరేక తీర్పు వస్తే టిడిపి, జనసేన కూటమి నైతికంగా కాస్త ఇబ్బందుల్లో పడేది. కానీ గత టిడిపి ప్రభుత్వ పాలనా విధానాలను ఇప్పుడు తిరగదోడటం చంద్రబాబుకు పరోక్షంగా మేలు జరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.