జాన్ సన్ చోరగుడి
నెల్లూరు జిల్లా రాజకీయాలు కారణంగా ‘సోషల్ ఇంజనీర్’గా జగన్మోహన్ రెడ్డి ‘ప్రొఫైల్’ దిగంతాలకు వ్యాపిస్తున్నది. ఈ మాట అనడం అతిశయోక్తి అనిపిస్తుంది… అనే ఎరుక ఉన్నా అనక తప్పడం లేదు. జగన్ కూడా ఈ పరిస్థితిని పూర్తిస్థాయిలో వాడుకోవడానికే నిర్ణయించుకున్నట్టుగా ఉంది. నిజానికి ఇప్పుడు జగన్ 2024 ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసాక, తనకు అవసరమైన సామాజిక- ‘ఎకో సిస్టం’ ఏర్పాటు చేసుకోవడం మీద ఇప్పుడే దృష్టి పెట్టినట్టుగా అర్ధమవుతున్నది.
ఎటూ మరో ‘టర్మ్’ తనదే ప్రభుత్వం అయినప్పుడు, తన ఎజెండాలోని- ‘సోషల్ బుల్డోజింగ్’ అమలు కోసం సమయం వృథా చేసుకోవడం ఎందుకని, ఇప్పటి నుంచే ఎన్నికల పేరుతో నెల్లూరును అందుకోసం ఆయన పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. ‘నెల్లూరు రెడ్లు’ అంటే వారు గతంలోని ఆంధ్ర చరిత్రలో రెడ్డి రాజుల కుటుంబీకులు. రెడ్లలో కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రెడ్డి వంశం ప్రభావం ఇప్పటికీ పనిచేస్తున్నది. ఇప్పటికీ తమ వంశం రెడ్ల ఓట్లు ఎక్కువ వున్న చోటనే తాము పోటీ చేయడానికి- ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్లు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే, అక్కడ సామాజిక నేపధ్యం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
Also read: ‘సౌత్’ పట్ల కేంద్రం వైఖరి నిరూపణకు ‘ఏపీ’ ఆఖరి ఆశ అయిందా?
అటువంటి జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే, అనిల్ యాదవ్ ను ఇరిగేషన్ మంత్రిని చేసి జగన్ తన ‘లైన్’ ఎటువంటిదో, అది ఎవరికి అర్ధం కావాలో వారికి అర్ధం అయ్యేట్టుగా చేసాడు. అనుమానం ఏమీ లేదు, అది ఎవరికి చేరాలో వారికి చేరింది. రెండున్నర ఏళ్ల తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా పరిస్థితిలో మార్పులేదు. సాంప్రదాయ రాజకీయాలు మాత్రమే తెలిసిన అక్కడి వైఎసార్సీపీ నాయకులకు ముఖ్యంగా నెల్లూరు రెడ్లకు జగన్ పరిపాలనలో ఏమి జరుగుతున్నదో మొదట అర్ధం కాలేదు. అదే సమయంలో కృష్ణా జిల్లాలో ‘కమ్మ’ వారికి మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ తర్వాత ఒక సరికొత్త- సోషియో – పొలిటికల్ ఎకో సిస్టం’ను జీర్ణం చేసుకోవడానికి జగన్ అందరికీ మరో రెండున్నర ఏళ్ళు ‘టైం’ ఇచ్చాడు. ఈ కాలంలోనే, ఒక్కొక్కరికి- ‘మీ పరిస్థితి బాగులేదు సరిచేసుకోండి’ అంటూ ‘సిగ్నల్స్’ ఇవ్వడం కూడా మొదలయింది.
అయితే, దీన్ని ‘లైట్’ తీసుకున్న వాళ్లలో నెల్లూరు రెడ్లు ముందు వరసలో ఉన్నట్టుగా ఇప్పుడు మనకు అర్ధం అవుతున్నది. వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి వంటి ‘హెవీ వెయిట్’ను వదిలించుకోవడం అనేది జిల్లా స్థాయిలో అది కేవలం ఒక ‘నెంబర్’ మాత్రమే అయితే, దాని ప్రకంపనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జగన్ ‘ప్రొఫైల్’ను ఏ స్థాయిలో ‘ఎలివేట్’ చేస్తాయో ఊహించడం కష్టం. నేను ‘స్పెషల్’ అనుకొనే ప్రకాశం జిల్లా బాలినేని ‘సైజ్’ తగ్గించాడు. బొత్స శాఖ మార్చాడు. ఇప్పుడు ‘సౌత్’ అంటే, ఎపి అన్నట్టుగా మనవైపు చూస్తున్న బిజెపి ముఖ్యులకు, ఈ ‘సీజన్లో’ ఇక్కడ నుంచి అందే- ‘ఇంటిలిజెన్స్ రిపోర్ట్స్’ చూసినప్పుడు, ఇక్కడి ఆ పార్టీ నాయకుల మాటల్ని వారు పరిగణనలోకి తీసుకునే అవకాశం తక్కువ.
Also read: జగన్ కు మేలుచేస్తున్న జాతీయ రాజకీయాలు
సామాజిక శాస్త్రాల అధ్యయనం ఎంత అవసరమో తెలియని ప్రతిపక్షం నాయకుడు, ఐదేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న మార్పు, ప్రభుత్వం ‘సోషల్ కేపిటల్’పై పెడుతున్న శ్రద్ద పైన కనీస అవగాహన లేక, దాన్ని అర్ధం చేసుకోవడం చేతకాక, ‘సైకో’ పాలన అనడం మొదలుపెట్టారు. పోనీ అదయినా ఎలా ‘సైకో’ పాలన అవుతుందో అదయినా ప్రజలకు చెప్పాలి కదా. జగన్ మోహన్ రెడ్డి సిఎం అయ్యాక, బెజవాడ సమీపంలో మొదటి కలెక్టర్ల సమీక్ష సమావేశం పెట్టిన ‘ప్రజావేదిక’ ను మర్నాడు అది అక్రమ కట్టడం అని దాన్ని కూల్చివేయించాడు. రెండున్నర ఏళ్ల క్రితం బెజవాడ నగరం మధ్య అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని మొదలుపెట్టి దాన్ని ఆవిష్కరించాడు. కొన్ని కూలుతుంటే కొన్ని కొత్త తలలు పైకి లేస్తుంటే, జరుగుతున్న ‘ప్రాసెస్’ ఏమిటో అర్ధంకాని వాళ్ళు గందరగోళపడి ‘సైకో’ అంటే ఎలా?
ఈ ప్రభుత్వంలో ‘పిరమిడ్’ స్థానంలోకి కొత్తగా ‘చతురస్రం’ నమూనా పాలన వచ్చాక, పైనుంచి క్రింది వరకు ఏకరీతిగా ఒక ‘సాలిడ్ సిస్టం’ ఏర్పడి పనిచేస్తున్నది. అర్హతలు పరిశీలించి ఒకసారి లబ్దిదారుడి పేరు ఖరారు అయ్యాక- ‘డి.బి.టి.’ ద్వారా ప్రభుత్వం అందించే ప్రయోజనం నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి చేరుతున్నది. దాంతో ప్రజాప్రతినిధులుగా తమకు మునుపున్న విచక్షణాధికారాలు ఇప్పుడు లేనట్లుగా కొందరు నొచ్చుకుంటున్నారు.
Also read: పాత ‘ వెర్షన్ ‘ సరుకును వదిలించుకుంటున్న జగన్
ఉదా: గతంలో మాదిరిగా హౌసింగ్ అధికారులు లబ్దిదారుడితో- ‘మీ ఎమ్మెల్యే గారు సిఫార్సు చేసిన లిస్టులో నీ పేరు లేదు…’ అనడానికి ఇప్పుడు ఆస్కారం లేదు. ఊళ్ళో రాజకీయాలతో ఒకవేళ తొలుత ఆపినా, ఆపడానికి కారణాలు ఏమిటో అదే ఊళ్ళో వున్న ‘సచివాలయం’ సిబ్బంది పిర్యాదుదారుడికి చెప్పాల్సి వస్తున్నది.. ఇటువంటి ఎమ్మెల్యేల ‘ప్రివిలేజ్’ కొత్తగా- ‘గ్రీన్ ఫీల్డ్ పాలిటిక్స్’ అమల్లోకి తెచ్చిన ఈ ప్రభుత్వంలో సాగక, తొలి ఉక్కపోతలు నెల్లూరు నుంచి ‘రికార్డు’ అయ్యాయి.
ఇప్పుడు కాదు, 2023 మార్చిలో ఏడాది క్రితం ఇది జరిగింది. నెల్లూరులో జరుగుతున్నది ఏమిటో ముందుగా అక్కడి ఎమ్మెల్యే ఒకరు దాచుకోలేక, అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగా పైకి అనేసారు. నెల్లూరు జిల్లా గూడూరు శాసనసభ్యుడు వెలగపల్లి వరప్రసాదరావు మాట్లాడుతూ- “పార్టీ ఎమ్మెల్యేగా కంటే, ఒక పౌరుడిగా జగన్ ను ఇష్టపడుతున్నాను” అన్నారాయన. ఈయన మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి కావడంతో వీరి పరిశీలనను ప్రత్యేకంగా చూడాల్సి వుంటుంది. ఇప్పుడీ మాజీ ‘బ్యూరోక్రాట్’ అయిన ఎస్సీ ఎమ్మెల్యే ఒక పౌరుడిగా తన పరిశీలనను దాచుకోలేక, ఉన్నది ఉన్నట్టుగా ‘మీడియా పాయింట్’ వద్ద పైకి అనేసారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియదు.
ఒక ఎమ్మెల్యేకి తమ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడి పట్ల ఉండేది విశ్వాసం, కానీ ఒక పౌరుడికి కాలక్రమంలో కలిగేది- ప్రేమ, దాన్ని ఐదేళ్లకు పరిమితం చేయలేము. కొంత కాలంగా ఈ రచయిత రాస్తున్న- ‘పవర్ పాలిటిక్స్’ స్థానంలో ‘ఫంక్షనల్ పాలిటిక్స్’ అంటున్నది, ‘పిరమిడ్’ స్థానంలో వచ్చిన ఈ ‘చతురస్ర’ నమూనాను దృష్టిలో ఉంచుకునే. అది తెచ్చిన- ‘సోషల్ కెమిస్ట్రీ’ కారణంగా నాలుగేళ్లకే పాతతరం నేతల్లో ‘ఉక్కపోత’ మొదలయింది. జగన్ కూడా ఏమాత్రం దాన్ని దాచుకోకుండా- ‘ఇది పెత్తందార్ల మీద పేదలు చేస్తున్న యుద్ధం’ అని పైకే అనేస్తున్నాడు!
Also read: ‘న్యూట్రల్’ ఓటరు కీలకం కానున్న 2024 ఎన్నికలు