కె. రామచంద్రమూర్తి
అమర గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకు భారత రత్న ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి లేక రాశారు. గొప్ప సంగీత విద్వాంసుడైన పీఎస్ బీ ఆంధ్రప్రదేశ్ లో జన్మించడం ఆంధ్రుల అదృష్టమనీ, ఆయన 25 సెప్టెంబర్ 2020 శుక్రవారంనాడు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళడం ఆయన ఆశేషమైన అభిమానులకూ, దేశంలోనూ, ఇతర దేశాలలోనూ నివసిస్తున్న సంగీతాభిమానులకూ, సంగీతరసజ్ఞులకూ హృదయవేదన మిగిల్చిందనీ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి తెలియజేశారు. యాభై సంవత్సరాలుగా 16 భారతీయ భాషలలో సినిమా పాటలు పాడుతూ సంగీతసంపదను పెంచుతూ కోట్లమంది అభిమానులను కూడగట్టుకున్నారనడానికీ, ఆయన ప్రభావం ఎంత గొప్పదో, బలమైనదో చెప్పడానికీ ఆయన మృతిపట్ల ఖేదం వెలిబుచ్చుతూ ప్రపంచ వ్యాప్తంగా సంగీత శిఖరాల నుంచి అశేషంగా వస్తున్న సంతాప సందేశాలే నిదర్శనమని అన్నారు.
‘బాలసుబ్రహ్మణ్యం తన సాటిలేని ప్రావీణ్యంతో సాధించిన అద్భుత విజయాల నిరంతర గాథలు సంగీత ప్రపంచపుటెల్లలు దాటిపోయాయి. ఆయన సంగీతాన్ని మానవాతీతమైన దివ్యానుభూతి స్థాయికి తీసుకొని వెళ్ళారు. తన మాతృభాష తెలుగులోనూ, తమిళంలోనూ, కన్నడ, మలయాళం, హిందీ, తదితర భాషలలోనూ 40 వేలకు పైగా పాటలు పాడారు. అత్యుత్తమ నేపథ్య గాయకుడిగా ఆరు జాతీయ ఫిలిం అవార్డులను అందుకున్నారు. తెలుగు సినిమాలలో చేసిన కృషి ఫలితంగా 25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది పురస్కారాలు స్వీకరించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అనేక అవార్డులు పొందారు. ఫిలింఫేర్ జాతీయ అవార్డునూ, దక్షిణభారతంలో అత్యుత్తమ గాయకుడిగా ఆరు ఫిలింఫేర్ అవార్డులనూ అందుకున్నారు. 2016లో అత్యుత్తమ భారత ఫిలిం పర్సనాలిటీగా సిల్వర్ పీకాక్ (వెండి నెమలి) అవార్డును అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులను స్వీకరించారు.
‘లోడగ లతామంగేష్కర్, భూపేన్ హజారికా, ఎంఎస్ సుబ్బులక్ష్మి, బిస్మిల్లాఖాన్, భీమ్ సేన్ జోషీ వంటి లబ్ధప్రతిష్ఠులను భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించింది. సంగీత ప్రపంచానికి విశిష్టమైన సేవలు అందించిన అసాధారణమైన ప్రతిభామూర్తికి సముచితమైన నివాళిగా స్వర్గీయ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకి ‘భారతరత్న’ అవార్డు ప్రకటించవలసిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అయిదు దశాబ్దాలపాటు ఆయన చేసిన గొప్ప కృషిని మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. అటువంటి అరుదైన ప్రతిభాశాలికి అత్యున్నతమైన పురస్కారం ఇచ్చి గౌరవించుకోవాలని కోరుతున్నాను,’ అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారు. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలలో పాల్గొనేందుకు నెల్లూరుకు చెందిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను చెన్నై పంపించడం, తాజాగా ప్రధానికి లేఖ రాసి భారతరత్న బిరుదాన్ని అమరగాయకుడికి ప్రకటించాలని కోరడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన రెండు మంచి పనులు. ఆంధ్రుల మనసు అర్థం చేసుకొని తీసుకున్న నిర్ణయాలు. అందుకు జగన్ మోహన్ రెడ్డిని అభినందించాలి. అత్యున్నత పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించేవరకూ ఈ అంశాన్ని పట్టించుకోవాలనీ, అవసరమైన కృషి దిల్లీలో శక్తివంచన లేకుండా జరగాలనీ బాలు అభిమానులు కోరుతున్నారు.