నందమూరి బాలకృష్ణ
- జగన్ ప్రభుత్వంపై నందమూరి బాలకృష్ణ ధ్వజం
- రైతులను ఆదుకోకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరిక
- మంత్రులకు రాజ్యాంగంపట్ల గౌరవం లేదన్న బాలకృష్ణ
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రైతుల వెన్ను విరుస్తోందని సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ పర్యటించారు. గోళ్లపురంలో వర్షాలకు దెబ్బతిన్న కందిపంటను ఆయన పరిశీలించారు. పంట నష్టం గురించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పంట నష్ట పోయిన రైతులను ఆదుకోకపోతే రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తామన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బాలకృష్ణ హెచ్చరించారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు రైతులకు అన్ని రకాల విత్తనాలు ఇచ్చామని వైసీపీ ప్రభుత్వం రైతులపట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బాలకృష్ణ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రత్యేక హోదా గురించి నానా రాద్ధాంతం చేసిన వైసీపీ 22 మంది ఎంపీలున్నా ప్రత్యేక హోదా ఊసెత్తడం లేదని విమర్శించారు.
ఇది చదవండి: పార్టీ బలోపేతానికి చంద్రబాబు కసరత్తు
కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు
కొందరు మంత్రులను ఉద్దేశించి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టాలంటే లెక్కలేదని రాజ్యాంగమంటే గౌరవంలేదని మండిపడ్డారు. తర తమ భేదాలు మరిచి నోరు పారేసుకోవడం మంచిది కాదన్నారు. సాక్షాత్తు మంత్రి తమ్ముడు పేకాటలో పట్టుబడితే ఏముంది జైలుకు వెళతాడు పదివేలు కడతాడని మంత్రి వ్యాఖ్యానించడం దారుణమన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలి. సహనాన్ని పరీక్షించొద్దు. ఊరికే నోరు పారేసుకోవడానికి మేం మాటల మనుషులం కాదు చేతల మనుషులమంటూ బాలకృష్ణ హెచ్చరించారు.
ఇది చదవండి: చంద్రబాబు రాజకీయ భవిష్యత్ ఏమిటి?
కార్యకర్తల కేసులపై స్పందించిన బాలయ్య
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛఉంది ఏదైనా చెప్పుకోవచ్చని అలాగని కేసులు పెట్టి రెచ్చగొడితే ఊరుకోమన్నారు. గాజులు తొడుక్కుని కూర్చోలేదన్నారు
తమ్ముళ్లను హెచ్చరించిన బాలయ్య
బాలకృష్ణ మీడియాతో మాట్లాడే సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో వారించారు. సంయమనం పాటించాలని చెప్పినా వినకపోవడంతో ఏయ్ …ఉష్ అంటూ సుతిమెత్తగా హెచ్చరించారు.
ఇది చదవండి: దేవాలయాలపై దాడులను ఉపేక్షించం-చంద్రబాబు