- ఎన్ డీఏ కూటమిలో వైఎస్ ఆర్ సీపీ చేరుతుందా?
- అమిత్ షాతో జగన్ వరుస సమాలోచనల ఆంతర్యం ఏమిటి?
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం బయలుదేరి దిల్లీ వెళ్ళనున్నారు. అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఆయన హోంమంత్రి అమిత్ షాను కలుసుకొని చర్చలు జరుపుతారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకుంటారని భోగట్టా.
బిహార్ ఎన్నికలు పూర్తయిన తర్వాత కేంద్ర కేబినెట్ లో మార్పులూ, చేర్పులూ చేస్తారనే ఊహాగానాలు సాగాయి. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడమే కాకుండా స్పష్టమైన మెజారిటీతో నితిష్ కుమార్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో పశ్చిమబెంగాల్, అస్సాం, తమిళనాడు వంటి ముఖ్యమైన రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోగా కేంద్ర మంత్రిమండలిలో మార్పులు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ సంకల్పించినట్టు తెలుస్తోంది.
నేషనల్ డెమాక్రాటిక్ అలయెన్స్ లో వైఎస్ఆర్ సీపీ చేరే అవకాశం ఉన్నదని కిందటి నెల జగన్ మోహన్ రెడ్డి దిల్లీ వెళ్ళి అమిత్ షాతో రెండు పర్యాయాలూ, ప్రధాని మోదీతో ఒక పర్యాయం చర్చలు జరిపి వచ్చారు. ఇప్పుడు కేంద్ర మంత్రి మండలిలో మార్పులకు సమయం ఆసన్నమైనది కనుక అత్యవసరంగా దిల్లీ వచ్చి చర్చలు జరపవలసిందిగా అమిత్ షా జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు చర్చిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి కానీ ఆ చర్చ ఇంత జరూరుగా జరిగే అవసరం లేదు. ఇది నిశ్చయంగా రాజకీయాంశమేనని అభిజ్ఞవర్గాల సమాచారం.
కేబినెట్ మంత్రిపదవి ఎవరికి?
ఒక వేళ మంత్రిమండలిలో వైఎస్ ఆర్ సీపీ చేరే పక్షంలో లోగడ తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్టే ఒక కేబినెట్ మంత్రి పదవి, ఒక సహాయమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నది. కేబినెట్ పదవి పార్టీలో అత్యంత ముఖ్యుడుగా కొనసాగుతున్న విజయసాయి రెడ్డికి ఇస్తారా మరెవరికైనా ఇస్తారా అనే చర్చ కొంతకాలంగా పార్టీలో జరుగుతోంది. అదే విధంగా సహాయమంత్రిగా ఎవరిని ఎంపిక చేయవచ్చుననే చర్చ కూడా సాగుతోంది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగే సమాలోచనలో రెండు పేర్లను జగన్ మోహన్ రెడ్డి అమిత్ షాకు చెప్పే అవకాశం ఉన్నది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కేబినెట్ హోదా మంత్రిగా నియమించాలని సూచిస్తే సహాయ మంత్రి పదవి వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తికి ఇచ్చే అవకాశం ఉన్నది.
ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా పశ్చిమబెంగాల్ నుంచీ, తమిళనాడు నుంచీ కొత్త మంత్రులను తీసుకునే అవకాశం ఉన్నది. ఏయే రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయో ఆయా రాష్ట్రాలనుంచి కొత్త మంత్రులను తీసుకోవడం రివాజు. ఏఐఏఎండికెతో ఎన్నికల పొత్తు ఉన్నది కనుక ఆ పార్టీకి చెందిన వ్యక్తిని మంత్రిమండలిలోకి తీసుకొనే అవకాశం ఉంది. శివసేన, అకాళీదళ్ మిత్రపక్షాలుగా ఉండేవి. ఆ రెండు పార్టీలూ ఎన్ డీఏ నుంచి నిష్క్రమించడంతో బీజేపీ నాయకత్వం కొత్త మిత్రులకోసం అన్వేషణ ప్రారంభించింది. వారిలో వైఎస్ ఆర్ సీపీ అగ్రస్థానంలో నిలిచి ఉన్నది.
జనసేనకు ఎటువైపు?
వైఎస్ఆర్ సీపీ బీజేపీతో చేతులు కలిపి ఎన్ డీఏ లో చేరిపోతే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన వేరు దారి చూసుకుంటుందా లేక వైఎసఆర్ సీపీతో సర్దుకొని పోతుందా అనే విషయం ఆసక్తిగా మారుతుంది. పవన్ కల్యాణ్ తిరిగి చంద్రబాబునాయుడితో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీతో చెలిమిని పునరుద్ధరించినా ఆశ్చర్యం లేదు. అప్పుడు రెండు కూటములు 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తాయి. ఒకటి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని అధికార ఎన్ డీఏ కూటమి, రెండవది చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రతిపక్ష యూపీఏ కూటమి. ప్రతిపక్ష కూటమిలో టీడీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు ఉండే అవకాశం ఉంది. అప్పుడు సమఉజ్జీల మధ్య సమరం రసవత్తరంగా ఉంటుంది.
ఇదీ చదవండి: పోలవరంపై కేంద్ర జలశక్తి మంత్రితో బుగ్గన, అనిల్ చర్చలు