- రాజధాని రైతు ఉద్యమం విజయమా? హైకోర్టు వ్యాఖ్యల ప్రభావమా?
- మూడు వ్యవసాయ బిల్లులను కేంద్రం ఉపసంహరించుకున్న విధంగానే ఏపీ చర్యఅవుతుందా?
- రాజధాని రైతులకు ఉపశమనమా?
అమరావతి: దిల్లీలో రైతులు విజయం సాధించిన వారం రోజుల్లోనే అమరావతి లో కదలిక కనిపిస్తోంది. మూడు రాజధానుల చట్టాన్నీ, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ రద్దు బిల్లును ఉపసంహరించుకోబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ సోమవారం ఉదయం రాష్ట్ర హైకోర్టులో వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేస్తారనీ, అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదిస్తుందనీ, దాని కాపీని హైకోర్టులో మద్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో సమర్పిస్తామనీ అడ్వకేట్ జనరల్ చెప్పారు.
అయిదు రాష్ట్రాలలో మూడు మాసాలలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమూడు మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన విషయం విదితమే. అదే బాటలో ఏపీ ముఖ్యమంత్రి సైతం అసెంబ్లీలో ప్రకటన చేయబోతున్నారు. దిల్లీ సరిహద్దులో పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రైతులు సంవత్సరం పొడవునా నిరసనదీక్ష చేస్తున్నట్టే అమరావతి రైతులు అంతకంటే ముందు నుంచే, సంవత్సరం పైగానే నిరసన దీక్షలు చేస్తున్నారు. ఉత్తరాది రైతులు ఎంత పట్టుదలగా ఉన్నారో అమరావతి రైతులు కూడా అంతే పట్టుదలగా ఉన్నారు. ప్రధాని స్పందించిన తీరులోనే జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజాభిప్రాయానికి తలవొగ్గి మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నట్టు భావించాలా? లేక సాంకేతిక లోపాలు సవరించేందుకే ఈ నిర్ణయమా?
ప్రజాస్వామ్యంలో ప్రజాభీష్టం ప్రకారం ప్రభుత్వం నిర్ణయాలు మార్చుకోవడంలో తప్పులేదు. తెగే వరకూ లాగడం ఎవ్వరికీ మంచిది కాదు. ఆదివారంనాడు నెల్లూరులో అమరావతి రైతల మహాపాదయాత్రలో బీజేపీ నేతలు కూడా పాల్గొనడం, వైసీపీ మినహా తక్కిన అన్ని పార్టీలూ రైతుల ఉద్యమాన్ని సమర్థించడం చూసిన తర్వాత చట్టాలను ఉపసంహరించుకోవడమే మంచిదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.
సోమవారం ఉదయం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపైన హైకోర్టులో విచారణ చేస్తున్న త్రిసభ్య ధర్మాసనం ఎదుట శుక్రవారం వరకూ అమరావతి పరిరక్షణ సమితి తరఫున వాదనలు వినిపించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ఈ ధర్మాసనం ఏర్పడింది. సోమవారం ఉదయం అడ్వకేట్ జనరల్ శ్రీరం ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించవలసి ఉన్నది. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేయబోతున్నారనీ, ఆ తర్వాత తాను వివరాలు ధర్మాసనం ఎదుట సమర్పించగలనని అడ్వకేట్ జనరల్ తెలియజేశారు. వికేంద్రకరణ బిల్లునూ, కేపిటల్ రీజియన్ డెవలప్ మెంటు అథారిటీ బిల్లును ఉపసంహరించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించుకున్నట్టు అడ్వకేట్ జనరల్ తెలిపారు.
అమరావతి ఐక్య కార్యాచరణ సమితి ప్రధాని మోదీకి లేఖ రాసింది. తమ మహాపాదయాత్ర విజయవంతంగా ముగిసేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని కో్రింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ రాజధాని రైతులు పాదయాత్ర ప్రారంభించిన విషయం విదితమే. తమపైన లాఠీచార్జి చేశారనీ, తాముఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారనీ ఐకాస ప్రతినిధులు తమ లేఖలో ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దరిదాపుల్లో లేవు. నరేంద్రమోదీ ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో రాజకీయ లబ్ధిపొందడానికి వివాదాస్పదమైన మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకున్నారు. ఎన్నికల దృష్ట్యా రాజకీయంగా మోదీ చర్య అవసరం. మొన్నజరిగిన మునిసిపల్ ఎన్నికలలో కృష్ణ, గుంటూరు. ప్రకాశం జిల్లాలలో అధికార వైసీపీకి తక్కిన ప్రాంతాలలో లభించినంత ఆదరణ లభించలేదు. బిల్లులు ఉపసంహరించుకొని వాటి స్థానంలో ఏమి ప్రవేశపెడతారనే అంశంపైన అంతా ఆదారపడి ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి మడమ తిప్పుతారా? రైతుల మహాపాదయాత్రకు సుముఖంగా స్పందిస్తారా? తన నిర్ణయానికే కట్టుబడి మూడు రాజధానుల ప్రయత్నమే కొనసాగిస్తారా? చూడాలి.