——————
సినిమా సమీక్ష
డా.సి. బి. చంద్ర మోహన్
———————
కొడుకే లోకమైన ఒక అమ్మ !
లోకంలో మంచి తప్ప చెడు ఊహించని అమ్మ!
…ఆ అమ్మ జీవితంలో ఒక పెద్ద అల —
భయానక తుఫానులో , సాగర మధ్యంలో ఎటు పోవాలో, ఏమి చెయ్యాలో తెలీని పరిస్థితి !
— ఇంటికి రావాల్సిన కొడుకు అంతర్ధాన మవడం,
–మరుసటి రోజు డ్రెయినేజిలో శవమై తేలడం,
— శవంపై కత్తి పోటు గాయం…
అమ్మ పోలీసులని ఒకటే కోరుతుంది–
“ఎవరు చంపారనేది నేనడగను. ఎవరికీ అపకారం
తలపెట్టని నా కొడుకుని ఎందుకు చంపాల్సి వచ్చింది ?! దయచేసి కనిపెట్టండి.”
పోలీసులు ఈ విషయంలో ఏమీ చేయలేరని తెలిసిపోతుంది.
ఆ అమ్మ ” సత్యశోధన” కు తానే పూనుకుంటుంది.
కొడుకే లోకమైన అమ్మకు — తానూ, కొడుకే కాక, లోకం అంటే చాలా పెద్దది అనీ , లోకంలో చాలా అన్యాయాలూ, అక్రమాలూ జరుగుతున్నాయని, వాటిని ఎదిరించి పోరాడితే తప్ప న్యాయం అనేది దొరకదనే సత్యాలు తెలుసుకుంటుంది.
తన ‘ సత్య శోధన’లో భాగంగా అమ్మ–కొడుకుని చంపిన హంతకుడికి, ఎటువంటి పాషాణ హృదయాలైనా కరిగే విధంగా ఉత్తరాలు రాస్తూ పోతుంది.
ఫలితం — ఆ హంతకుడు తనంతట తానే నిజం ఒప్పుకుని కారణం చెపుతాడు.
కారణం ఏమి చెబుతాడు ?
కొడుకుని చంపిన వాడిని అమ్మ ఎందుకు ఆదరిస్తుంది?
వడ్డించిన విస్తరి లాంటి జీవితాలు ఒక్క సారిగా కుదుపుకు గురైతే ,
–ఆ కుదుపుకు కారణాలు అన్వేషిస్తే, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి ?
కళ్ళు చెదిరే సత్యాలు
— సమాజంలో అసమానతలు
— ఆ అసమానతలతో పెరిగే ‘ కసి’
— ఒక వర్గానికి ఉన్నతాధికారులు, ప్రభుత్వాలు కొమ్ము కాయడం
— ఇంకో వర్గం నిరంతర, నిరంకుశ దోపిడీకి గురవడం
వాళ్ళ దౌష్ట్యాన్ని ఎదిరించే ఈ వర్గం అన్యాయంగా ,అక్రమంగా అణచివేతకు, హత్యలకు గురవ్వటం–
ఇవన్నీ అమ్మ సత్య శోధనలో తెలుసుకునే సత్యాలు.
మన బతుకులు బావుండాలంటే, తనకు జరిగిన ఘోరమైన అన్యాయం, ఇంకెవరికీ జరగకుండా ఉండాలంటే, చుట్టూ సమాజంలో అందరి జీవితాలూ బాగుపడితే కానీ అది జరిగే పని కాదని అమ్మ తెలుసుకుంటుంది !
అందుకు తన వంతుగా కర్తవ్య నిర్వహణకు పూను కుంటుంది — గోర్కీ ‘అమ్మ’ నవల చదువుతూ.
కొడుకు హంతకుడి జీవితంలో ఆనంద దీపాలు వెలిగిస్తుంది.
అమ్మ మార్గమే కరెక్ట్ అని కింద వర్గం పోలీసులూ, జర్నలిస్టులూ మనసారా నమ్మి, ఉద్యమాలకు పరోక్షంగా నైతిక సహకారం ఇస్తున్నట్లు చూపెట్టటంతో సినిమా ముగుస్తుంది.
మంచి కోసం పరితపించే మనుషుల మనసులు సంఘర్షణకు గురైతే , ఎన్ని జీవిత సత్యాలు వారికి గోచరిస్తాయో, కార్యోన్ముఖుల్ని చేస్తాయో, కదా– దర్శకత్వం వహించిన సి.ఉమామహేశ్వరరావు , చాలా బలంగా చిత్రీకరించారు. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా నడుస్తుంది.
అమ్మగా రేవతి నటన సహజంగానే– అద్భుతం.
గోరటి వెంకన్న పాట, చిందు నాట్యం చిత్రానికి ఒక హైలైట్.
సుమారు 28 ఏళ్ల క్రితం ‘అంకురం’ సినిమా తీసి, తెలుగు సినిమాకు, దర్శకులకు ఒక ఉన్నత స్థానం తెచ్చి పెట్టిన సి.ఉమామహేశ్వరరావు అభినందనీయులు.
గాంధి ‘ సత్య శోధన’ పుస్తకంతో మొదలైన అభ్యుదయం లోకి ‘అమ్మ’ ప్రయాణం — గోర్కీ ‘అమ్మ’ నవల చదువుతున్నట్లు చూపించడంలో దర్శకుడి ఉద్దేశం ( ప్రస్తుత పరిస్థితుల్లో గాంధీయిజం కున్న పరిమితులు, ఇంకేదో ఇజం ఈ సమాజానికి అవసర మనే నిజం) ప్రేక్షకులకు చేరుతుందని ఆశిద్దాం.
ప్రేక్షకుల మనసులను కుదిపి, వాళ్ళ ఆలోచనా ధారలో ప్రకంపనలు లేపే, ఇటువంటి కథలూ, సినిమాలూ వస్తాయని , సమాజంలో మార్పు తెస్తాయని ఆశిద్దాం.
ఈ సినిమా, కొ. కు. ‘స్వార్ధ బుద్ధి’ కథ, క్రిష్ ‘గమ్యం’ సినిమా– ఈ పై మూడూ—మనిషి ఆనందం సామాజిక ఆనందంతో ముడి పడి ఉంటుందనే నిజాన్ని బలంగా వెలువరిస్తాయి.
‘ఇట్లు అమ్మ’ సినిమాను Sony liv లో చూడవచ్చు.