దిల్లీ: దేశంలోనే అత్యధిక సర్క్యలేషన్ కలిగిన హిందీ దినపత్రిక దైనిక్ బాస్కర్ కార్యాలయాలపైనా, ఈ గ్రూప్ కు చెందిన టీవీ చానల్ ‘భారత్ సమాచార్ ’ కార్యాలయాలపైనా, ఆ సంస్థ యజమానులు గృహాలపైనా ఆదాయంపన్ను శాఖ అధికారులు గురువారంనాడు దాడులు చేశారు. మధ్యప్రదేశ్ లో కేంద్ర కార్యాలయం కలిగిన ఈ పత్రికకు అనేక హిందీ భాషారాష్ట్రాలలో ఎడిషన్లు ఉన్నాయి. టీవీ చానల్ ఉత్తరప్రదేశ్ కేంద్రితంగా పని చేస్తోంది. ఏప్రిల్ – మేలో కోవిద్ కు సంబంధించి ప్రభుత్వాలు ప్రకటించే గణాంకాలు ప్రచురిస్తేనే తమ విలేఖరుల బృందం సేకరించిన వాస్తవాలను కూడా ప్రచురించింది. ఆక్సిజన్ సిలిండర్ల, ఆస్పత్రి పడకల, టీకా మందుల కొరత గురించి కథనాలను ప్రముఖంగా ప్రచురించింది.
దైనిక్ భాస్కర్ కోవిద్ సమయంలో సాహసోపేతమైన రిపోర్టింగ్ చేసింది. గంగానదిలో శవాలు తేలిరావడంపైన వాస్తవిక సమాచారం ఇస్తూ సవివరమైన వార్తాకథనాలను ప్రచురించింది. దైనిక్ భాస్కర్ విలేఖరలు గంగానదిలో కొట్టుకొని వచ్చిన శవాలను లెక్కపెట్టారు. అంతే కాకుండా ‘గంగ అబద్ధం చెప్పదు’ అనే శీర్షికతో (గంగా డజ్ నాట్ లై) న్యూయార్క్ టైమ్ ఓపెడె పేజీలో సుదీర్ఘమైన వ్యాసం దైనిక జాగరణ్ సంపాదకులు రాశారు. వాస్తవిక వార్తాకథనాలు ప్రచురిస్తున్న కారణంగానే తమపైన ఒత్తిడి తీసుకుని వచ్చే క్రమంలో భాగంగానే ఈ దాడులు జరిగాయని పత్రిక ప్రధాన సంపాదకుడు బ్రజేష్ మిశ్రా వ్యాఖ్యానించారు.
దైనిక్ భాస్కర్ గ్రూప్ పన్నులు ఎగవేస్తున్నదని ఆదాయం పన్ను శాఖ ఆరోపించింది. ఒత్తిడులకు లొంగే సమస్య లేదనీ, జర్నలిజం విలువలకు కట్టుబడి ఉంటామనీ దైనిక భాస్కర్ నేషనల్ ఎడిటర్ ఓం గౌర్ ఎన్ డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఈ దాడులు తనకు ఆశ్చర్యం కలిగించాయని ఆయన అన్నారు. ఒత్తిళ్ళకు లొంగే సంస్థ తమది కాదనీ, గత ముప్పయ్ సంవత్సరాలుగా ఈ సంస్థలో పని చేస్తున్నాననీ, జర్నలిజం విలువలకు కట్టుబడి సంస్థ ముందుకు పోతునక్నదనీ అన్నారు.
ఆదాయంపన్ను (ఐటీ) శాఖ దాడులు దైనిక భాస్కర్ కేంద్ర కార్యాలయం ఉన్న ఇండోర్ లోనూ, భోపాల్ (మధ్యప్రదేశ్), జైపూర్ (రాజస్థాన్), అహ్మదాబాద్ (గుజరాత్) నగరాలలోనూ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలోనూ జరిగినట్టు సమాచారం. మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ అగర్వాల్ ఈ పరిణామంపైన వ్యాఖ్యానించడానికి ముందుకు రాలేదు. నిజాయితీ కలిగిన జర్నలిజం అంటే ప్రభుత్వం బెదురుతున్నదంటూ దైనిక్ భాస్కర్ ఒక ప్రకటనలో ఆక్షేపించింది. తమ ఉద్యోగుల మొబైల్ ఫోన్లను ఐటీ అధికారుల స్వాధీనం చేసుకున్నారనీ, దాడులు జరిగిన సందర్భాలలో ఈ విధంగా మొబైల్ ఫోన్లు లాగివేసుకోవడం మామూలేనని అధికారులు అంటున్నారని సంస్థ ప్రతినిధి ఒకరు తెలియజేశారు.
మోదీ ప్రభుత్వం కోవిద్ ను అరికట్టడంలో విఫలమైనట్టు ఈ పత్రిక రాసింది కనుక కక్షతో ఐటీ దాడులు జరిపిస్తున్నారంటూ ప్రతిపక్షం ఆరోపించింది. అరుణ్ శౌరీ చెప్పినట్టు అప్రకటిత ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) దేశంలో అమలు జరుగుతోందని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. ఇది జర్నిలిజంపైన జరుగుతున్న దాడి అని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ అభివర్ణించారు. మీడియాపైన ఆయుధాలుగా ఐటీనీ, సీఐడీనీ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నీ ప్రధాని నరేంద్రమోదీ, దేశీయాంగమంత్రి అమిత్ షాలు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కోవిద్ మహమ్మారి రెండో విడత సృష్టించిన విలయంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలలో సంభవించిన మరణాల గురించీ, వైద్య సదుపాయం సకాలంలో అందక ప్రజలు పడిన బాధల గురించీ కథనాలను దైనిక్ భాస్కర్ ప్రముఖంగా ప్రచురించింది.
దైనిక్ భాస్కర్ ని రమేశ్ చంద్ర అగర్వాల్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 1958లో ప్రారంభించారు. కాలక్రమంలో ఈ దిన పత్రిక హిందీ మాట్లాడే 12 రాష్ట్రాలలో విస్తరించి 65 ఎడిషన్ సెంటర్లతో ప్రవర్థమానమై దైనిక్ జాగరణ్ ను మించి మొదటి స్థానం ఆక్రమించింది. ఈ మీడియా సంస్థలో డీబీ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థకు వందశాతం వాటాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన ఈ కంపెనీ వాటాలలో 69.82 శాతం ప్రజల దగ్గరా, 30.18 శాతం ప్రమోటర్ల దగ్గరా ఉన్నాయి. ఈ మీడియా సంస్థలో దేశవ్యాప్తంగా మూడు వేల మంది పూర్తికాలం పని చేసే జర్నలిస్ట్ లూ, కొన్ని వేలమంది స్ట్రింగర్లూ పని చేస్తున్నారు.